Subbanna Ayyappan: ప్రముఖ వ్యవసాయ జలవనరుల శాస్త్రవేత్త, భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ICAR) మాజీ డైరెక్టర్ జనరల్, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ సుబ్బన్న అయ్యప్పన్ మృతదేహం కర్ణాటకలోని శ్రీరంగపట్న సమీపంలోని కావేరీ నదిలో లభ్యమైంది. ఈ విషాదకర సంఘటన తాజాగా వెలుగుచూసింది. పోలీసుల అందించిన సమాచారం ప్రకారం.. స్థానికులు నదిలో తేలియాడుతున్న శరీరాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందించగా, అధికారులు దానిని వెలికితీసారు. మృతుడి ద్విచక్రవాహనం కావేరీ నది తీరాన నిలబెట్టిన స్థితిలో కనిపించడంతో.. ఆయనే స్వయంగా నదిలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, మృతికి గల కారణం పూర్తిగా దర్యాప్తు అనంతరం మాత్రమే స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.
Read Also: IPL In Hyderabad: హైదరాబాద్‌లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగకపోవడానికి అసలు కారణం ఇదే.?!
ఇక అయ్యప్పన్ వయస్సు 70 సంవత్సరాలు. ఆయన మైసూరు నగరంలోని విశ్వేశ్వర నగర్ ఇండస్ట్రియల్ ఏరియాలో నివసిస్తున్నారు. అయితే, అయ్యప్పన్ మే 7న నుండి కనిపించకపోవడంతో ఆయన కుటుంబ సభ్యులు మైసూరులోని విద్యారణ్యపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ప్రతిరోజూ కావేరీ నది ఒడ్డున ఉన్న సాయిబాబా ఆశ్రమానికి ధ్యానం కోసం వెళ్ళే అలవాటు ఆయనకు ఉండేదని పోలీసులు పేర్కొన్నారు.
Read Also: Amritsar Spurious LiquorG: కాటికి పంపిన కల్తీ మద్యం.. 14 మంది మృతి
ఇక డాక్టర్ అయ్యప్పన్ భారత్‌లో ‘బ్లూ రివల్యూషన్’ (అక్వాకల్చర్ విప్లవం) సాధనలో కీలక పాత్ర పోషించారు. ICARకు క్రాప్ విభాగానికి సంబంధించిన కాకుండా మిగిలిన విభాగాల నుండి తొలిసారి డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన శాస్త్రవేత్త అయ్యప్పన్. ఆయన సేవలకు భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే, సుబ్బన్న అయ్యప్పన్ మృతి గల కారణాల కోసం పోలీసులు వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.