OYO: దేశీయ సంస్థ ఓయో కీలక నిర్ణయం తీసుకుంది. బైజూస్, జొమాటో వంటి దేశీయ కంపెనీలు ఉద్యోగులను తొలగించగా.. తాజాగా ఓయో కూడా ఉద్యోగుల సంఖ్యను తగ్గించనున్నట్లు ప్రకటించింది. టెక్నాలజీ టీమ్‌లలో 600 ఎగ్జిక్యూటివ్‌లను తొలగించనున్నట్లు పేర్కొంది. అలాగే సేల్స్ విభాగంలో 250 మంది ఎగ్జిక్యూటివ్‌లను నియమిస్తున్నట్లు కంపెనీ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఓయోలో ప్రధానంగా 3700 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా… వ్యాపార నిర్వహణ ఖర్చులను తగ్గించడానికి 10 శాతం ఉద్యోగాలు తగ్గించాలని కంపెనీ చూస్తోంది. దానిలో భాగంగా కంపెనీ ఇంజనీరింగ్, కార్పొరేట్ విభాగంలో టీమ్‌లను తగ్గిస్తోంది.
సంస్థాగత నిర్మాణంలో విస్తృతమైన మార్పులను అమలు చేయడంలో భాగంగా ఈ చర్య తీసుకున్నట్లు ఓయో తెలిపింది. ప్రొడక్ట్ అండ్ ఇంజినీరింగ్, కార్పొరేట్ హెడ్‌క్వార్టర్స్, ఓయో వెకేషన్ టీమ్స్‌లో ఉద్యోగుల సంఖ్యను తగ్గించనుండగా.. రిలేషన్‌షిప్, బిజినెస్ డెవలప్‌మెంట్ టీమ్‌లో కొత్తగా నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. అదే సమయంలో ప్రత్యేకంగా, వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి దాని ప్లాట్‌ఫారమ్‌లోని హోటళ్లు, గృహాల సంఖ్యను పెంచడంలో సహాయపడటానికి రిలేషన్షిప్ మేనేజ్‌మెంట్ టీమ్‌లలో 250 మందిని కొత్తగా చేర్చుకోనుంది. ఉద్యోగులను తొలగించాల్సి రావడం దురదృష్టకరమని ఓయో వ్యవస్థాపకుడు, సీఈవో రితేష్ అగర్వాల్ పేర్కొన్నారు. తొలగించిన ఉద్యోగులకు మూడు నెలల పాటు మెడికల్ ఇన్సురెన్స్ కొనసాగుతుందని తెలిపారు. భవిష్యత్‌లో ఆయా విభాగాల్లో నియామకాలు చేపట్టినప్పుడు తొలగించిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన పేర్కొన్నారు.
Mass Killings: సామూహిక హత్యలు జరిగే దేశాల జాబితాలో పాకిస్థాన్‌దే అగ్రస్థానం!
గత రెండేళ్లలో ఓయో ఇలా ఉద్యోగులను తొలగించడం ఇది రెండోసారి. 2020 డిసెంబర్‌లో కంపెనీ 300 మంది ఉద్యోగులను తొలగించింది. యాప్ గేమింగ్, సోషల్ కంటెంట్ క్యూరేషన్ వంటి విభాగంలో కూడా టెక్నికల్ సిబ్బందిని తగ్గించనుంది. కంపెనీ ప్రస్తుతం ఐపీవోకు వెళ్లడానికి సిద్ధంగా ఉంది. ఓయో ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలంలో రూ. 63 కోట్ల నిర్వహణ లాభాన్ని ఆర్జించింది.