Operation Sindoor: ‘‘ఆపరేషన్ సిందూర్’’తో భారత సత్తా ప్రపంచానికి తెలిసింది. భారత్ యాక్షన్‌లోకి దిగితే ఎలా ఉంటుందనే విషయం పాకిస్తాన్‌కి బాగా అర్థమైంది. ఇన్నాళ్లు తమ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని బెదిరిస్తూ వస్తున్న పాకిస్తాన్‌కి, అది పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులకు భారత్ ధీటైన సమాధానం ఇచ్చింది. ఇదెలా ఉంటే, పాకిస్తాన్‌పై దాడి ఇప్పుడు టర్కీ, చైనాలకు నొప్పి కలిగిస్తున్నాయి. పాకిస్తాన్ రక్షణ రంగం ఈ రెండు దేశాలపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఈ రెండు దేశాలకు చెందిన డ్రోన్లు, క్షిపణులు, ఫైటర్ జెట్‌లను పాకిస్తాన్ భారీగా కొనుగోలు చేసింది. అయితే, భారత్ జరిపిన దాడుల్లో ఈ రెండు దేశాల ఆయుధాలు, పరికరాలు చిత్తు చిత్తుగా ఓడిపోయాయి.
ప్రయోగశాలగా మారిన పాక్..
అదే సమయంలో భారత్ స్వయంగా అభివృద్ధి చేసుకున్న మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్‌తో పాటు బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపణులు చాలా సమర్థవంతంగా పనిచేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే పాకిస్తాన్ భారత్‌కి ఇప్పుడు ఒక ప్రయోగశాలగా మారింది. ఎప్పుడైతే, ఆపరేషన్ సిందూర్ మొదలైందో భారత్ దేశంలో తయారైన ఆయుధాలను రియల్ టైమ్‌లో వినియోగించింది. ఇవి చాలా సమర్థవంతంగా పాకిస్తాన్ డ్రోన్లను, క్షిపణులను నిర్వీర్యం చేశాయి.
టర్కీ, చైనా డిఫెన్స్ ఎగుమతులపై ప్రభావం:
ఇన్నాళ్లు డ్రోన్ల తయారీలో టర్కీ, క్షిపణుల తయారీలో చైనా తోపులం అని ఫీల్ అయ్యాయి. అయితే, భారత్ మాత్రం తమ ముందు మీ ఆయుధాలు ఏం పనిచేయమని ప్రపంచానికి బహిర్గతం చేసింది. భారత్ క్షిపణులతో దాడులు చేస్తుంటే పాకిస్తాన్ చైనా నుంచి కొనుగోలు చేసిన ‘‘HQ-9 గగనతల రక్షణ వ్యవస్థ’’ పనిచేయలేదు. పైగా పాక్ వీటికి ఎక్కడెక్కడ మోహరించిందో వాటిని భారత్ ధ్వంసం చేసింది. ఇక టర్కీ డ్రోన్లు భారత సరిహద్దుల్లోకి రాగానే మన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వాటిని పిల్లల్లా నేలకూల్చాయి. మరోవైపు పాకిస్తాన్‌కి చైనా అందించిన పీఎల్-15 ఎయిర్ టూ ఎయిర్ క్షిపణిని కూల్చినట్లు ఈ రోజు జరిగిన ప్రెస్ బ్రీఫింగ్‌లో భారత సైనికాధికారులు చెప్పారు. వీటితో పాటు పాక్ మిరేజ్ యుద్ధవిమానాన్ని కూల్చినట్లు తెలిపారు.
ఈ పరిణామాలతో భారత్ ఆయుధ ఎగుమతులు పెరిగే అవకాశం ఉంటుంది. అదే సమయంలో చైనా, టర్కీ ఉత్పత్తులకు విలువపడిపోయే ఛాన్స్ ఏర్పడింది. పాకిస్తాన్ మినహా ప్రస్తుతం ఏ దేశం కూడా చైనా మిలిటరీ ఉత్పత్తులపై ఎక్కువగా ఆధారపడటం లేదు. ఇప్పుడు ఈ దాడుల వల్ల టర్కీ, చైనాలను భారత్ ఎక్స్‌పోజ్ చేసినట్లు అయింది. ఆదే సమయంలో మన రక్షణ ఉత్పత్తుల సత్తా ప్రపంచానికి తెలియజేసింది.