Online Love Scam: ఈ డిజిటల్ యుగంలో సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్స్ వలన పరస్పర సంబంధాలు సులభంగా ఏర్పడుతున్నప్పటికీ, దుర్వినియోగం కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ముఖ్యంగా వాట్సప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌ల ద్వారా పరిచయమై, ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడే సంఘటనలు పెరుగుతున్నాయి. తాజాగా ఫిలింనగర్‌లో ఇలాంటి ఒక వింత కేసు నమోదైంది.
సౌదీకి చెందిన మహ్మద్ అబ్దుల్ ఆహాద్ అనే యువకుడు, ఒక భారతీయ మహిళతో వాట్సప్‌లో పరిచయమై ప్రేమలోకి దించాడు. కొంతకాలం ప్రేమ తర్వాత, వీరు వీడియో కాల్ ద్వారా వివాహం చేసుకున్నారు. పెళ్లి అనంతరం వీరి సంభాషణలు పూర్తిగా ఆన్లైన్ లోనే కొనసాగాయి. ఈ జంట సంవత్సరం పాటు ఆన్లైన్ ద్వారా దాంపత్య జీవితాన్ని కొనసాగించారు కూడా. అయితే, పెళ్లి తర్వాత కొంత కాలం గడిచిన తర్వాత మహిళకు సంబంధించిన వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు పంపాలంటూ ఒత్తిడి పెంచడం ప్రారంభించాడు. ఎలాగో పెళ్లి అయ్యిందకదా అని సదరు మహిళా ఫోటోలు, వీడియోలు పంపింది. ఆ తర్వాత మోసగాడి అసలు స్వరూపం బయట పడింది. గత కొంతకాలంగా మహిళకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు బహిరంగం చేస్తానంటూ బ్లాక్‌మెయిల్ చేయడం మొదలు పెట్టాడు. ఈ పనిలో అతనితో పాటు అతని మొదటి భార్య కూడా సహకరించిందని మహిళ ఆరోపిస్తోంది.
ఈ ఘటనతో మహిళ తన భర్త గురించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని భావించి విచారణ ప్రారంభించింది. ఈ అన్వేషణలో అతనికి ఆమెతో మొదటి పెళ్లి కాదని, ఇప్పటికే ముగ్గురిని వివాహం చేసుకున్నాడని తెలిసింది. అసలు విషయం తెలుసుకున్న ఆమె వెంటనే ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. విషయాన్ని తెలుసుకున్న ఆమె మహ్మద్ అబ్దుల్ ఆహాద్, అతని మొదటి భార్యపై వివిధ సెక్షన్ల కింద ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపడుతోంది.
Read Also: MLC Elections 2025: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం!
ఈ సంఘటన నుండి ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది ఏమిటంటే, ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులపై పూర్తిగా విశ్వాసం పెట్టకూడదు. ముఖ్యంగా వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు భాగస్వామ్యం చేయడంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాట్సాప్, సోషల్ మీడియా ద్వారా పరిచయమైన వ్యక్తులతో డబ్బు లేదా వ్యక్తిగత సమాచారాన్ని పంచుకోవడం ప్రమాదకరం. ప్రస్తుతం సైబర్ మోసాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వ్యక్తిగత సమాచారం, నమ్మకాన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడే వ్యక్తుల సంఖ్య పెరుగుతోంది. అందుకే, వ్యక్తిగత విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా అనుమానాస్పదమైన ఘటన ఎదురైతే వెంటనే పోలీసులను ఆశ్రయించడం మంచిది.