తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 90 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక మార్చి 3న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది.
కరీంనగర్-మెదక్-అదిలాబాద్-నిజామాబాద్ గ్రాడ్యుయేట్.. టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఆరంభమైంది. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-అదిలాబాద్‌లో పట్టభద్రుల నియోజకవర్గంలో 3,55,159 ఓటర్లు ఉండగా.. 56 అభ్యర్థులు బరిలో ఉన్నారు. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానం కోసం 27,088 మంది ఉపాధ్యాయులు ఓట్లు నమోదు చేసుకోగా.. 15 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. వరంగల్-నల్లగొండ-ఖమ్మం ఉపాధ్యాయ స్థానానికి 25,797 మంది ఉపాధ్యాయులు ఓటర్లుగా ఉన్నారు. ఇక్కడి నుంచి 19మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం ఉమ్మడి ఏడు జిల్లాల పరిధిలో జరిగే ఎన్నికల పోలింగ్ కోసం జిల్లాల కలెక్టర్లు ఏర్పాట్లను పరిశీలించారు.
ఏపీలో ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ, ఉభయగోదావరి, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గాలకు పోలింగ్ ఆరంభం అయింది. 16 జిల్లాల పరిధిలోని 1,062 కేంద్రాల్లో పోలింగ్ జరుగుతోంది. ఈ మూడు నియోజకవర్గాల పరిధిలో 70 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. 6,84,593 మంది ఓటర్లు ఉన్నారు.