ఆన్ లైన్ గేమ్స్ డెత్ గేమ్స్‌గా మారుతున్నాయి. రోజుల వ్యవధిలోనే లక్షాధికారులు కావాలనే ఆశతో.. ఆన్ లైన్ గేమ్స్‌లో పెట్టుబడి పెట్టి యువకులు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. కష్టార్జితాన్ని.. కాస్తా వ్యసనానికి పెట్టుబడిగా పెట్టి సర్వస్వం కోల్పోతున్నారు. అప్పులకు తెచ్చిన డబ్బులు, వడ్డీలు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా.. నిజామాబాద్ జిల్లా తెలంగాణ యూనివర్సిటీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగి.. ఆన్ లైన్ గేమ్స్‌కు బానిసగా మారి తనువు చాలించాడు. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన.. ఆన్ లైన్ గేమ్స్ ఇప్పుడు గ్రామాలను తాకాయి. నిజామాబాద్ జిల్లా డిచ్‌పల్లి మండలం నడిపల్లి తండాలో విషాదం నెలకొంది. నడిపల్లి తండాకు చెందిన అరుణ్.. ఆన్ లైన్ గేమింగ్‌కు అలవాటు పడి అప్పుల పాలయ్యాడు. అప్పులు తీర్చే దారి లేక బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో.. ఉరి వేసుకున్నాడు అరుణ్…
తెలంగాణ యూనివర్సిటీ బాయిస్ హాస్టల్‌లో.. అరుణ్ వెయిటర్‌గా ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కొంత కాలంగా ఆన్ లైన్ గేమింగ్‌కు అలవాటు పడ్డాడు అరుణ్. ఈ క్రమంలో అప్పుల పాలయ్యాడు. కొద్ది రోజుల క్రితం తన బైక్‌ను కూడా గేమ్స్ ఆడేందుకు తాకట్టు పెట్టాడు. ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు. అప్పులు కుప్పలుగా పెరిగిపోవడంతో.. అప్పు తీర్చే దారిలేక ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. 9 నెలల క్రితం అరుణ్ తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా.. ఇప్పుడు కొడుకు ఆన్ లైన్ గేమింగ్ భూతానికి బలవ్వడంతో మృతుని తల్లి, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలంయలో ఔట్ సోర్సింగ్ లో ఉద్యోగం చేస్తూ.. కుటుంబానికి అండగా ఉంటాడనుకున్న కొడుకు.. ఆత్మహత్య చేసుకోవడం పట్ల తల్లి బోరున విలపిస్తోంది. చెట్టంత కొడుకు కళ్ల ముందే చనిపోవడంతో ఆమె వేదన అరణ్య రోదనలా మారింది. ఆన్ లైన్ గేమింగ్ వ్యసనంతో అరుణ్ బలవన్మరణానికి పాల్పడ్డట్లు మృతుని కుటుంబ సభ్యులు చెబుతున్నారు..
Fastag Secrets : ఫాస్టాగ్ గురించి మీరు తెలుసుకోవలసిన కీలక అంశాలు
ఆన్ లైన్ గేమింగ్‌కు అలవాటు పడ్డ అరుణ్.. డబ్బులు పొగొట్టుకుని అప్పుల పాలై.. ఆ అప్పులు తీర్చే దారిలేక ఆత్మహత్య చేసుకున్నట్లు మృతుని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో ఇటీవల కాలంలో ఈ తరహా బలవన్మరణాలు పెరిగిపోయాయి. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు చేస్తున్న బాధితులు.. అధిక వడ్డీకి యాప్‌లో లోన్లు తీసుకుని బెట్టింగ్ గేమ్స్‌లో ఉన్నదంతా పొగొట్టుకుని రోడ్డున పడుతున్నారు. అప్పులు ఇచ్చిన వాళ్ల వేధింపులు భరించలేక తనువు చాలిస్తున్నారు. బెట్టింగ్ యాప్‌లలో పిల్లలు చేసే అప్పులకు కుటుంబాలు సైతం బలవుతుండటం కొసమెరుపు. కొడుకులు చేసిన అప్పులు తీర్చలేక.. తల్లిదండ్రులు ఆత్మహత్యలకు పాల్పడిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి…
రోజుల వ్యవధిలో లక్షాధికారులు కావాలనే అత్యాశతో యువకులు బెట్టింగ్ యాప్‌లు, క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడుతున్నారు. గేమ్స్ ఊబిలో చిక్కి విలవిలలాడుతున్నారు. చివరకు ప్రాణాలు తీసుకుని.. తల్లిదండ్రులకు గర్భశోకం మిగులుస్తున్నారు… ఆన్‌లైన్ జూదం, బెట్టింగ్ యాప్‌లపై పోలీసులు ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు నగరాలకు పరిమితమైన బెట్టింగ్ యాప్ విష సంస్కృతి ఇప్పుడు గ్రామాలను పాకడం ఆందోళన కలిగిస్తోంది..