హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం వద్ద ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు ఆందోళనకు దిగారు. దాదాపు 200 మంది ఓలా, ఉబర్ క్యాబ్ డ్రైవర్లు నిరసన చేపట్టారు. కిలోమీటర్‌కి 18 నుండి 20 రూపాయలు చెల్లించేటట్టు ఓలా, ఉబర్ కంపెనీలు ఒప్పందం కుదుర్చుకోగా.. ప్రస్తుతం కిలోమీటర్‌కి 6 నుంచి 9 రూపాయలు కేటాయిస్తున్నాయి. అంతేకాకుండా.. తమకు వచ్చిన ఛార్జెస్ లో నుండి కంపెనీలు 30 శాతం కమిషన్ తీసుకుంటున్నారని క్యాబ్ డ్రైవర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు గచ్చిబౌలి నుండి ఎయిర్ పోర్ట్ వెళితే 600 రూపాయలు చెల్లించేవని.. ప్రస్తుతం 300 నుండి 350 రూపాయలు చెల్లిస్తున్నట్లు క్యాబ్ డ్రైవర్లు ఆరోపించారు. 30 కిలోమీటర్ల దూరానికి 350 రూపాయలు సరిపోవటం లేదంటూ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు.
Read Also: IPL 2025: ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఓపెనింగ్ మ్యాచ్‌కు వర్షం ముప్పు..!
పాత తరహాలోనే కిలోమీటర్ కి 18 నుండి 20 రూపాయలు కేటాయించాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. అంతేకాకుండా.. ఇతర రాష్ట్రాల వాహనాలు ఓలా, ఉబర్ లలో నడవడంతో తమకు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మాదాపూర్ నుండి ఎయిర్ పోర్ట్ వెళితే కస్టమర్ దగ్గర నుండి ఓలా, ఉబర్ కంపెనీలు 850 రూపాయలు వసూలు చేస్తున్నారన్నారు. తమకు మాత్రం అదే ట్రిప్పుకు 450 రూపాయలు చెల్లిస్తున్నట్లు వాపోయారు. ఓలా, ఉబర్ కంపెనీలు ఒక ట్రిప్పు పై 400 రూపాయలు కమీషన్ తీసుకుంటున్నాయని పేర్కొ్న్నారు. ఈ 400 రూపాయలలో కూడా 5 శాతం పర్సన్ జీఎస్టీ పేరున కంపెనీలు కట్ చేస్తున్నాయని తెలిపారు. ఏపీ వాహనాలను నంబర్ ప్లేట్లు మార్చి ఓలా, ఉబర్లలో నడుపుతున్నారని.. తెలంగాణ స్టేట్ కి రోడ్డు టాక్స్ కట్టి తాము వాహనాలు నడుపుతున్నామని డ్రైవర్లు చెప్పారు. నంబర్ ప్లేట్లు మార్చి వాహనాలు నడుపుతున్న వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ఓలా, ఉబర్ డ్రైవర్లు డిమాండ్ చేశారు.