మోటారు వాహనాల చట్ట సవరణను నిరసిస్తూ తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు చేపట్టిన ధర్నాను విరమించారు. ఇవాళ ఉదయం నుంచి వారు ధర్నాకు దిగడంతో చాలా బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. దీంతో వాహనదారులు మిగతా బంకులకు పరుగులు తీశారు. పెద్దఎత్తున బారులు తీరారు. అయితే తాజాగా ట్యాంకర్ల యజమానులు ధర్నాను విరమించడంతో యథావిధిగా బంకులకు పెట్రోల్ సరఫరా కానుంది. ఇది వాహనదారులకు ఊరట కలిగించనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్ సహా తెలంగాణ వ్యాప్తంగా పెట్రోల్ కొరతపై ఆయిల్ ట్యాంకర్ల అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖర్ కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల సమ్మె లేదని స్పష్టం చేశారు. పెట్రోల్, డీజిలకు సంబంధించి కంగారుపడాల్సిన అవసరం లేదన్నారు. కేంద్ర చట్ట సవరణతో కొంత గందరగోళం ఏర్పడిందని, ఆయిల్ ట్యాంకర్లు యథావిధిగా నడుస్తాయని ఆయన వివరించారు.