అక్కడ నాయకులంతా మనం మనం బరంపురం అంటున్నారా? పార్టీ ఏదైతేనేం…. రాష్ట్ర స్థాయిలో వాళ్లు ఎలా కొట్టుకుంటే మనకెందుకు? జిల్లాలో మాత్రం కలిసుందామని అనుకుంటున్నారా? ఆగర్భ శతృవుల్లా వ్యవహరించే టీడీపీ, వైసీపీ నాయకులు సైతం ఇక్కడ అంత సీన్ లేదమ్మా అంటున్నారా? ఏ వివాదం తలెత్తినా టీ కప్పులో తుఫాన్‌లా రెండు రోజుల్లో చల్లారిపోతున్న ఆ జిల్లా ఏది? ఏంటి అక్కడి డిఫరెంట్ రాజకీయం? ఉమ్మడి కర్నూలు. ఒకప్పుడు జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన మహామహుల్ని అందించిన జిల్లా. అలాగే… రాజకీయ, గ్రామ ఆధిపత్యం కోసం హత్యలు, ప్రతీకార హత్యలతో ఫ్యాక్షన్ పురుడుపోసుకున్నది కూడా ఇక్కడే. అవతలోళ్ళు ఒక్క మాట అంటే… ప్రత్యర్థులు పది మాటల్ని తూటాల్లా పేల్చిన జిల్లా. కానీ… కొన్నేళ్ల నుంచి గమనిస్తుంటే… ఇక్కడ రాజకీయంగా చాలా మార్పు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఒకప్పుడు ఫ్యాక్షన్ లో రక్త సంబంధీకులు, ఆస్తులు కోల్పోయిన నేతలు మెల్లిగా ముఠా కక్షలకు దూరమయ్యారు. ఆ తరువాత రాజకీయాల్లో నిలదొక్కుకొని ఆర్థికంగా బలపడటంతో… ఇక ప్రశాంతంగా జీవించాలన్న మార్పు నాయకుల్లో కనిపిస్తోందట. ఉమ్మడి కర్నూలు పాలిటిక్స్‌లో గతంలో ఉన్న వాడి వేడి ఇప్పుడు కనిపించడం లేదన్నది ఓ విశ్లేషణ. అధికారంలో వున్నా, ప్రతిపక్షంలో వున్నా వీలైనంతవరకు వివాదాలకు దూరంగా వుంటున్నారట స్థానిక నాయకులు. అధికారంలో ఉన్నప్పుడు రెచ్చిపోవడం, ప్రత్యర్థులపై కేసులు బనాయించడం, ఆ తరువాత ప్రత్యర్థులు అధికారంలోకి వస్తే తాము అదే పరిస్థితి ఎదుర్కోవడం ఎందుకన్న ఉద్దేశ్యం కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఏ పార్టీ అధికారంలో వున్నా ప్రతిపక్ష నేతలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారట. ఆ పార్టీ ఈ పార్టీ అనే తేడా లేకుండా ఏ పార్టీ అధికారంలో ఉన్నా అదే వాతావరణం రెండు దశాబ్దాల నుంచి కనిపిస్తున్నట్టు చెబుతున్నారు. దశాబ్దాల పాటు పగతో రగిలిపోయిన కుటుంబాలు కూడా చేతులు కలిపిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం ఏపీలో రాజకీయం నిత్యం హాట్ హాట్‌గా నడుస్తోంది. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నా, ప్రస్తుత టీడీపీ హయాంలోనూ అదే పరిస్థితి.
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది నాటి ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదయ్యాయి. రకరకాల కారణాలతో అరెస్ట్‌లు చేశారు. ప్రస్తుతం టీడీపీ హయాంలోనూ ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదవుతున్నాయి. మెల్లిగా అరెస్ట్‌లు పెరుగుతున్నాయి. బయట, గతంలో ఎలాంటి ఫ్యాక్షన్ ఛాయలు లేని జిల్లాల్లో అలా జరుగుతుండగా… ఫ్యాక్షన్ గడ్డ అని పేరుబడ్డ ఉమ్మడి కర్నూలు జిల్లాలో మాత్రం…అలాంటి హంగామా ఏం లేకుండా అన్ని పార్టీల నాయకులు కూల్ కూల్ అంటున్నారట. దీంతో అటు జనంలో కూడా ఇది మంచి పరిణామమేనన్న అభిప్రాయం పెరుగుతోంది. 2014 తర్వాత టీడీపీ హయాంలో అప్పుడు నంద్యాల వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న భూమా నాగిరెడ్డి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో రచ్చ చేశారంటూ కేసు పెట్టారు. ఓ పోలీస్ అధికారిని కులం పేరుతో దూషించారని అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. ప్రస్తుత మంత్రి బిసి జనార్దన్ రెడ్డిపై వైసీపీ హయాంలో ఓ గొడవకు సంబంధించి అరెస్టు చేశారు. ఈ ఘటనలు మినహాయిస్తే… ఈ మధ్య కాలంలో టీడీపీ, వైసీపీల్లో ఉన్న పెద్ద నాయకులెవరి మీద కేసులు బుక్ అవలేదు. అధికార, ప్రతిపక్ష నేతలు తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న సందర్భాలు తక్కువ. అటు ఒకప్పుడు ఒకరినొకరు చంపుకున్న కుటుంబాలు కూడా ఇప్పుడు దాడులకు దూరంగా ఉంటున్నాయి. రాజకీయంగా ఏవైనా విమర్శలు లేదా వివాదాలు తలెత్తినా అవి టీ కప్పులో తుఫానులా సద్దుమణిగిపోతున్నాయి. 2023లో చంద్రబాబును నంద్యాలలో అరెస్టు చేసినా, ఏపీ అంతటా టీడీపీ ఉధృత ఆందోళనలు చేసిందిగానీ…. ఉమ్మడి కర్నూలు జిల్లాలో నామమాత్రంగానే జరిగిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు కొందరు. అయితే ప్రస్తుతం… ఉమ్మడి కర్నూలు జిల్లా రాజకీయంపై ఇతర ప్రాంతాల నాయకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయట. వివాదాలకు దూరంగా ఉంటే మంచిదే కదా అని కొందరంటుంటే…, అధికారంలో ఉన్నప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసి ప్రతిపక్షంలోకి రాగానే ఉన్నారా లేరా అన్నట్టు వ్యవహారం మారుతోందన్నది ఇంకో వెర్షన్. ఇది ఆయా పార్టీల అధినేతల్లో ఒకింత అసంతృప్తికి కూడా కారణమవుతోందట. మొత్తమ్మీద కర్నూలు పాలిటిక్స్ డిఫరెంట్ గురూ అంటున్నారు పొలిటికల్ ఇనలిస్ట్స్.