డెడ్‌బాడీ డోర్ డెలివరీ కేసుపై కూటమి సర్కార్ స్పెషల్‌గా దృష్టి పెట్టిందా? ఆ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీకి మూడినట్టేనా? ఈ కేసులో ఒకే దెబ్బకు రెండు పిట్టల్ని కొట్టేందుకు కూటమి సర్కార్ ప్లాన్ చేస్తోందా? ఇందులో ఎమ్మెల్సీ తప్పును నిరూపించగలిగితే… వైసీపీ స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్‌ని కూడా కదిలించవచ్చని అనుకుంటోందా? ఆ కేసు విషయంలో జరిగిన తాజా డెవలప్‌మెంట్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని షేక్ చేసిన అంశాల్లో డెడ్‌బాడీ డోర్ డెలివరీ ఒకటి. ఆ పార్టీ నాయకులు ఒప్పుకున్నా, ఒప్పుకోకున్నా…. ఆ ఎపిసోడ్ మాత్రం ఫ్యాన్ పార్టీని గట్టిగానే కొట్టిందన్నది విస్తృతాభిప్రాయం. మరీ ముఖ్యంగా వైసీపీకి స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ అయిన దళితుల మీద బాగానే ప్రభావం చూపిందని అంటారు. 2022 మే 18న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారు డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగింది. హత్య చేశాక మృతదేహాన్ని కారులోనే ఇంటికి తీసుకువెళ్ళి అప్పగించడం అప్పట్లో పెను సంచలనం అయింది. నాటి నుంచే… శవాలను డోర్ డెలివరీ చేస్తారంటూ రాజకీయ ప్రత్యర్థులు వైసీపీ మీద సెటైర్స్ వేయడం మొదలుపెట్టారు. చనిపోయిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం దళితుడు కావడంతో…తీవ్రత ఇంకా పెరిగింది. రకరకాల వత్తిళ్ళతో… సొంత పార్టీ అధికారంలో ఉన్నా… అనంతబాబుని అరెస్ట్ చేశారు పోలీసులు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఆరు నెలలపాటు ఉన్నారు ఎమ్మెల్సీ. తర్వాత బెయిల్ మీద బయటికి వచ్చినా… ఆయన్ని నేరుగా జనంలోకి పంపడానికి అప్పట్లో కాస్త వెనకాడింది వైసీపీ అధిష్టానం. అంతేకాదు నాటి ప్రతిపక్షం చేస్తున్న మాటల దాడికి తట్టుకోలేక అనంతబాబుని పార్టీ నుంచి సస్పెడ్ చేసింది. అయితే… అది అధికారికంగానే తప్ప… అనధికారికంగా ఎమ్మెల్సీ వైసీపీ కార్యకలాపాల్లో పాల్గొంటూనే ఉన్నారు. ఇక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్యం హత్య కేసుపై తీవ్ర ఆరోపణలే చేసింది టీడీపీ. తాము అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామంటూ డ్రైవర్ కుటుంబానికి భరోసా ఇచ్చింది. అయితే అప్పట్లో కేసు ఫైల్ చేసినప్పుడు అనంత బాబు సుబ్రహ్మణ్యాన్ని ఉద్దేశపూర్వకంగా చంపలేదంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు పోలీసులు. అది కూడా వివాదాస్పదమైంది. ఇక ఛార్జ్‌షీట్ వేయడంతోనూ గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు తెలుగుదేశం లీడర్స్. ఈ కేసులో సుబ్రహ్మణ్యం కుటుంబం తరపున తొలి నుంచి ఫైట్ చేస్తున్నారు అడ్వకేట్ ముప్పాళ్ళ సుబ్బారావు. ఇప్పుడు అదే అడ్వకేట్‌ను ప్రాసిక్యూషన్‌కి సలహాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం అపాయింట్ చేయడంతో కలకలం రేగుతోంది. అంటే…. శవం డోర్ డెలివరీ కేసు లోతుల్లోకి వెళ్ళి… వైసీపీ ఎమ్మెల్సీ చుట్టూ ఉచ్చు బిగించేందుకు సర్కార్ సిద్ధమైందా అన్న అనుమానాలు వస్తున్నాయట. అనంతబాబు కేసును వైసీపీ సర్కార్ నిర్లక్ష్యం చేసిందని, తమ పార్టీ ఎమ్మెల్సీ అన్న ఉద్దేశ్యంతో తప్పు చేసిన వ్యక్తిని కూడా వదిలేసిందని తొలి నుంచి ఏకిపారేస్తోంది టీడీపీ. ఇక ఇప్పుడు తమకు ఛాన్స్ వచ్చింది కాబట్టి… గతాన్ని తవ్వేందుకు పలుగు పార రెడీ చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఆ మొత్తం ఎపిసోడ్ మీద తాజాగా పూర్తి నివేదిక కోరాలని పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. అప్పట్లో పోలీసులు హత్య కేసును సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం చేశారన్న ఆరోపణలున్నాయి. ఈ వ్యవహారంలో ఎమ్మెల్సీతో పాటు మరికొంతమంది ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… ఎలాగైనాసరే… అనంతబాబు బెయిల్ క్యాన్సిల్ అయ్యేలా కోర్ట్‌లో వాదనలు వినిపించేందుకు గట్టిగా గ్రౌండ్ వర్క్ జరుగుతున్నట్టు సమాచారం. అందుకు అవసరమైన మెటీరియల్ కూడా సిద్ధమవుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అప్పట్లో వైసీపీకి ఈ కేసు పెద్ద మైనస్‌గా మారింది. ముఖ్యంగా ఆ దెబ్బకు దళిత వర్గాల్లో అపనమ్మకం పెరిగిందని వైసీపీ వర్గాలే అంగీకరిస్తున్న పరిస్థితి. ఓటమికి కారణాల్లో ఇది కూడా ఒకటని అంటారు. దీంతో ఇప్పుడు ఈ కేసు దుమ్ము దులిపి పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి సుబ్రహ్మణ్యం కుటుంబానికి న్యాయం చేశామని చెప్పుకోగలిగితే అది పొలిటికల్ కూడా తమకు అడ్వాంటేజ్ అవుతుందని భావిస్తున్నారట టీడీపీ పెద్దలు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చాక తమకు న్యాయం జరిగిందని దళిత వర్గాల్లో నమ్మకం కలిగించగలిగితే… ఆ ఇంపాక్ట్ గట్టిగా ఉంటుందన్నది అధికార పక్షం లెక్కగా తెలుస్తోంది. అందుకే అనంతబాబు ఏ కారణంతో డ్రైవర్‌ని హత్య చేశాడన్న విషయం మీద దృష్టిపెట్టి… దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నట్టు సమాచారం. తొలి నుంచి కేసును ఫాలో అవుతున్న అడ్వకేట్ ను ప్రాసిక్యూషన్‌లో ఇన్వాల్వ్ చేయడం ఇందులో భాగమేనని అంటున్నారు. పిన్ టు పిన్ సమాచారం పక్కాగా తీసుకుని కొలిక్కి తీసుకురావాలనుకుంటున్నారట ప్రభుత్వ పెద్దలు. మొత్తానికి సుబ్రహ్మణ్యం హత్య కేసు పై కొత్త ట్విస్ట్ ఇచ్చింది ప్రభుత్వం.. దీంతో ఎమ్మెల్సీ అనంత బాబును కార్నర్ చేయడానికి స్కెచ్ సిద్ధమైపోయినట్టేనని అంటున్నారు పరిశీలకులు. మరి అనంతబాబు మళ్లీ ఊచలు లెక్కబెట్టడానికి సిద్ధమైపోతారా? లేక తనదైన శైలిలో మీదికి రాకుండా చూసుకుంటారా అన్నది తేలాలంటే కొన్నాళ్ళు ఆగాల్సిందేన్ననది పొలిటికల్ పరిశీలకుల మాట.