Off The Record: ఆషాడం పోయింది.. శ్రావణం కూడా వెళ్ళిపోయింది. మహారాష్ట్ర ఎన్నికలు కూడా ముగిసిపోయాయి. ఎప్పుడు? ఇంకెప్పుడు? మా ఆశలు నెరవేరేదెప్పుడు? ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న చర్చ ఇది. అధిష్టానం పెద్దలు హామీ ఇచ్చినట్టు వెంటనే పదవుల పందేరం ఉంటుందా? ఇంకేవన్నా సాకులు తెర మీదికి వస్తాయా? గాంధీభవన్ వర్గాలు ఏమంటున్నాయి?
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో…. ఇక తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఆశలు చిగురిస్తున్నాయట. అదేంటీ… ఆ ఎలక్షన్స్‌కు, ఇక్కడి కాంగ్రెస్ నాయకులకు లింక్ ఏంటని అంటే… ఖచ్చితంగా ఉందని అంటున్నాయి గాంధీభవన్ వర్గాలు. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత, లేదంటే ముగిసిన వెంటనే తెలంగాణలోని నామినేటెడ్ పదవుల భర్తీతో పాటు కేబినెట్ విస్తరణ మీద కూడా దృష్టి పెడతామని చెప్పిందట పార్టీ అగ్ర నాయకత్వం.ఈ ఆశకు అదే కారణం అంటున్నాయి రాజకీయ వర్గాలు. అసెంబ్లీ ఎన్నికలతో పాటు పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడ్డవారు, సీట్ల త్యాగాలు చేసిన వారు చాలామంది నామినేటెడ్ పోస్టులు ఆశిస్తున్నారు. ఇప్పటికి 37 మందికి పదవులు ఇవ్వగా… మరో 50 నుంచి 100 మంది క్యూలో ఉన్నారు.
దీంతో వీళ్ళలో ఎందరికి అవకాశాలు దక్కుతాయి? ఎప్పుడు దక్కుతాయన్న చర్చ మళ్లీ మొదలైంది తెలంగాణ కాంగ్రెస్‌లో. కార్పొరేషన్ ఛైర్మన్స్‌తో పాటు అవకాశం ఉన్న అన్ని చోట్ల పార్టీ కోసం పనిచేసిన వారికి వదలకుండా అడ్జస్ట్ చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. పార్టీ జెండా పట్టి పవర్లోకి రాడానికి కష్టపడ్డ ప్రతి నేత ప్రభుత్వంలో నామినేటెడ్ పోస్టు కోసం ఎదురుచూస్తున్నారు. అలాగే… చాలా రోజులుగా కేబినెట్ విస్తరణ కోసం ఎదురు చూస్తున్నారు ఆశావహులు. ఢిల్లీ పెద్దలు బిజీ షెడ్యూల్లో ఉండటం, వివిధ రాష్ట్రాల ఎన్నికల కారణంగా… ఈ కసరత్తును తాత్కాలికంగా పక్కన పెట్టింది ఏఐసీసీ. ఇక ఇప్పుడు ఆ ఆటంకాలన్నీ తొలగిపోయాయి గనుక మేరా నంబర్ కబ్ ఆయేగా అంటూ ఎదురు చూస్తున్నారట కాంగ్రెస్ ఆశావహులు. మొదటి దఫాలో మూడు కమిషన్ చైర్మన్లతో కలిపి 37 నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసింది రాష్ట్ర సర్కార్. ఆ తర్వాత శ్రావణం సెంటిమెంట్‌గా మరో విడత భర్తీ ఉంటుందని అనుకున్నారు. అదిగో ఇదిగో అంటుండగానే… శ్రావణం వెళ్ళిపోయింది. తర్వాత దసరా, దీపావళి కానుకలు అనుకున్నారు. కానీ… అదీ జరగలేదు. ఇప్పుడిక మహారాష్ట్ర ఎన్నికలు ముగిశాయి, కార్తీక మాసం కూడా చివరికి వచ్చింది. ఇప్పటికైనా మా గోడు వినండి, వెంటనే పదవుల పందేరం మొదలుపెట్టండని పెద్దలకు విజ్ఞప్తి చేస్తున్నారట కాంగ్రెస్ లీడర్స్.
మహారాష్ట్రలో గెలుపే లక్ష్యంగా ఏఐసీసీ పెద్దల ఆదేశాల మేరకు టీ కాంగ్రెస్ పెద్దలు, మంత్రులు అక్కడికెళ్ళి ప్రచారం చేసి వచ్చారు.ఇక ఇప్పటికైనా… మిగిలిన నామినేటెడ్ పోస్టులపై పీసీసీతో పాటు ఎఐసిసి దృష్టి కూడా పెట్టి న్యాయం చేస్తే…. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బూస్ట్ ఇచ్చినట్టు ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది పార్టీ వర్గాల్లో. పోస్టుల భర్తీకి త్వరలోనే పార్టీ పెద్దలు గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఇప్పటిదాకా పీసీసీ కూడా చెప్పుకుంటూ వచ్చింది. ఇక క్యాబినెట్లో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వాటిని కూడా వెంటనే భర్తీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. అధిష్టానం కూడా మహారాష్ట్ర ఎన్నికల తర్వాత క్యాబినెట్ విస్తరణకి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి ఒక ఎస్టీ, ఒక రెడ్డి సామాజికవర్గం నేత కేబినెట్ రేస్‌లో ఉన్నారు. ఇక రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో మంత్రి పదవి ఎవరికి దక్కుతుందన్న చర్చ అప్పటి నుంచి జరుగుతూనే ఉంది. ఉమ్మడి ఆదిలాబాద్‌కు కూడా మంత్రివర్గంలో ప్రాతినిధ్యం లేదు. అటు నిజామాబాద్ జిల్లాకు కూడా మంత్రి పదవి ఇవ్వాల్సి ఉంది. దీంతో మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆశావహులు అంతా రీ ఛార్జ్ అవుతున్నారట. అధిష్టానం వాళ్ల ఆశల్ని ఎంత త్వరగా నెరవేరుస్తుందో చూడాలి మరి.