ఒకప్పుడు సినిమాల్లోను, రాజకీయాల్లోను ఒక ఊపు ఊపేసిన ఆ మాజీ ఎంపీ ఇప్పుడెందుకు పూర్తిగా తెరమరుగయ్యారు? కేవలం ఎక్స్ మెసేజ్‌లకే ఎందుకు పరిమితం అవుతున్నారు? అధికారంలో ఉన్నాసరే… కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆమె దూరమయ్యారా? లేక పార్టీనే దూరం చేసుకుంటోందా? ఎవరా లీడర్? ఏంటా కథ? అటు సిల్వర్ స్క్రీన్ మీద, ఇటు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద వెలుగు వెలిగిన నాయకురాలు విజయశాంతి. ఒక దశలో లేడీ అమితాబ్‌గా తెలుగు ఇండస్ట్రీని శాసించారామె. తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా కొంత కీలకంగానే పనిచేశారు. ఆ క్రమంలోనే తల్లి తెలంగాణ పేరుతో సొంత పార్టీ పెట్టి కొన్నాళ్ళు నడిపాక కేసీఆర్ ఆహ్వానంతో ఆ పార్టీని బీఆర్‌ఎస్‌లో విలీనం చేశారు విజయశాంతి. బీఆర్‌ఎస్ ఎంపీగా గెలిచి పార్లమెంటులో తెలంగాణ వాణిని గట్టిగానే వినిపించారు. ఇక ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో… అసలు తెలంగాణను ఇచ్చిందే సోనియా గాంధీ అంటూ…కాంగ్రెస్ కండువా కప్పుకున్నారామె. కొన్నాళ్ళయ్యాక అక్కడ తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని బీజేపీ గూటికి చేరిపోయారు. కొన్నాళ్ళు ఆ పార్టీలో ఉన్నాక… అసెంబ్లీ ఎన్నికలకి ముందు కాషాయ కండువా పక్కనపడేసి… తిరిగి హస్తం నా నేస్తం అన్నారు విజయశాంతి. ప్రస్తుతం కాంగ్రెస్ లోనే కొనసాగుతున్నా… పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా… ఎక్కడా కనిపించడం లేదు ఈ మాజీ ఎంపీ.
ఎన్నికల టైంలో ప్రచార కమిటీలో పని చేసిన విజయశాంతి…ఒకటి..రెండు సభల్లో తప్ప పెద్దగా హడావుడి చేయలేదు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత… అసలు కాంగ్రెస్ పార్టీ వేదికల మీద కనిపించడం మానేశారామె. కేవలం ఎక్స్‌కే పరిమితం అయ్యారా అన్నట్టు ఆ మెసేజ్‌లతోనే సరిపెట్టేస్తున్నారు. దీంతో ఇప్పుడు కొత్త డౌట్స్ వస్తున్నాయట పరిశీలకులకు. కాంగ్రెస్ పార్టీ ఆమెను పిలవడం లేదా…? లేక పిలిచినా విజయశాంతి వెళ్ళడం లేదా? అన్నది బిగ్ క్వశ్చన్. ప్రస్తుతం విజయశాంతి లాంటి వారి సేవలు కాంగ్రెస్ పార్టీకైతే అవసరం ఉందన్నది విస్తృతాభిప్రాయం. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు ప్రచారం కల్పించడం, ప్రతిపక్షాల విమర్శలకు కౌంటర్స్ వేయడం లాంటి చాలా పనులు ఉన్నాయి. కానీ పార్టీ ఇప్పటి వరకు ఆ దిశగా ఆలోచిస్తున్నట్టు లేదన్న చర్చ జరుగుతోంది. అసలు విజయశాంతిలాంటి సీనియర్ లీడర్స్‌ని కాంగ్రెస్ పార్టీ సరిగా ఉపయోగించుకోవడం లేదన్న టాక్ నడుస్తోంది. పార్టీ పట్టింపులేనితనం కారణంగానే… విజయశాంతి ఎక్స్‌కు పరిమితం అవుతున్నారా అన్న ప్రశ్నలు సైతం ఉన్నాయట కాంగ్రెస్ వర్గాల్లో. తన పోస్ట్‌ల్లో కూడా హర హర మహాదేవ… జై తెలంగాణ అంటూ చివర్లో పెడుతున్నారు విజయశాంతి. గతంలో అన్ని అంశాలపై… స్పందించే విజయశాంతి… ఇప్పుడు మీడియా ముందుకు మాత్రం రావడం లేదు. అంటే… ఇప్పుడు పార్టీలో యాక్టివ్‌గా లేరని అనుకోవాలా..? లేక అసలు రాజకీయాలకే దూరంగా ఉంటున్నారా..? అదీఇదీ కాకుండా కాంగ్రెస్ పార్టీనే ఆమెను పట్టించుకోవడం లేదా? అంటూ… రకరకాల అనుమానాలు తెర మీదకు వస్తున్నాయట. వీటికి రాములమ్మ సమాధానం చెప్తారా…లేక కాంగ్రెస్ రియాక్టు అవుతుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు.