తెలంగాణలో పార్టీ నిర్మాణం పటిష్టంగా లేదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందా? అందుకే ఇక స్పెషల్ ఫోకస్ పెట్టాలని అనుకుంటోందా? జిల్లా పార్టీ అధ్యక్షుల్ని ఢిల్లీ ఎందుకు పిలిచారు? గతానికి భిన్నంగా ఇప్పుడు వాళ్ళని నేరుగా పిలవడం వెనకున్న వ్యూహం ఏంటి? అధికారంలో ఉండి కూడా అంత ఎక్స్‌ట్రా కేర్ తీసుకోవడం వెనకున్న సీక్రెట్ ఏంటి? హై కమాండ్ నుంచి తెలంగాణ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులకు పిలుపు వచ్చింది. ఈనెల 27న…రమ్మని వర్తమానం పంపారట పార్టీ పెద్దలు. సడన్‌గా ఎందుకలా పిలిచారని రాష్ట్ర నేతలు ఆరా తీస్తే… పార్టీ బలోపేతం మీద స్పెషల్ ఫోకస్ అన్నారట అట్నుంచి. దాంతో ఇప్పుడు పీసీసీలో రకరకాల చర్చలు మొదలయ్యాయి. రాష్ట్రంలో అధికారం ఉన్నా…. పార్టీ నిర్మాణ పరంగా ఉండాల్సినంత బలంగా లేదన్నది ఏఐసీసీ పెద్దల ఉద్దేశ్యంగా తెలుస్తోంది. అందుకే ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. చాలా ఏళ్లుగా పార్టీ అధిష్టానం వైపు నుంచి ఇలాంటి ప్రయత్నం ఏదీ జరగలేదు. అందుకే ఇప్పుడు జిల్లా పార్టీ అధ్యక్షుల్ని కూడా ఢిల్లీ పిలిచి మాట్లాడాలనుకుంటున్నారట. పార్టీ నిర్మాణంలో జిల్లా అధ్యక్షుల పాత్ర కీలకం. అందుకే… మళ్ళీ మూలాల్లోకి వెళ్ళాలని భావిస్తున్నట్టు సమాచారం. జిల్లా అధ్యక్షులకు ఇంకా ఎక్కువ అధికారాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. క్షేత్ర స్థాయిలో పని చేసేది ఎవరు..? చేస్తోంది ఎవరో గుర్తించే వెసులు బాటు డిసిసి అధ్యక్షులకు ఉంటుంది. పార్టీ నిర్మాణంలో కూడా వాళ్ళదే కీలక పాత్ర. అందుకే డిసిసిలను బలోపేతం చేయాలన్నది ఏఐసీసీ ప్రయత్నం అట. పీసీసీకి కొత్త చీఫ్ మహేష్ గౌడ్ వచ్చి ఆరు నెలలు గడిచింది. అయినా జిల్లా కమిటీల్లో పెద్దగా మార్పు లేదు.
అందుకే ఇక ఆ కమిటీల్ని వేయాలనుకుంటున్నారట. ఈసారి వేసే కమిటీల్లో డీసీసీ అధ్యక్షులుగా కాస్త చురుగ్గా ఉండే మహిళలకు ప్రాధాన్యం ఇవ్వాలనుకుంటున్నట్టు సమాచారం. కార్పొరేషన్ చైర్మన్ పదవి కోసం ప్రయత్నం చేస్తున్న నాయకురాలు పారిజాతకు రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఇక గద్వాల డిసిసి అధ్యక్ష పదవికి సరితా తిరుపతయ్య పేరు సీరియస్‌గా పరిశీలిస్తున్నారట. కాస్త కమాండింగ్ ఉండి కో ఆర్డినేట్ చేసుకోగలిగిన వాళ్ళకు జిల్లా అధ్యక్ష పదవులు ఇస్తే… క్షేత్ర స్థాయిలో దూకుడుగా ఉండటంతో పాటు ప్రతిపక్షాల నుంచి వచ్చే సవాళ్ళను దీటుగా ఎదుర్కోగలుగుతారని అంచనా వేస్తున్నారట హస్తం పెద్దలు. రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కూడా… డిసిసి అధ్యక్షులతో గట్టిగా పని చేయించాలని చూస్తున్నారట. పదవుల భర్తీ కూడా అందుకు అనుగుణంగానే ఉంటుందని అంటున్నారు. తిరిగి పవర్ లోకి రావడం ఎలా..? చేసిన పనుల్ని జనంలోకి గట్టిగా తీసుకెళ్ళి ప్రచారం చేసుకోవడం ఎలా? లాంటి అంశాల మీద స్పెషల్ ఫోకస్ పెడుతున్నారట రాష్ట్ర ఇన్ఛార్జ్. మొత్తానికి పార్టీ నిర్మాణం బలంగా ఉంటేనే.. భవిష్యత్ అని నిర్ధారణకు వచ్చిన అధిష్టానం జిల్లా అధ్యక్షులను ఢిల్లీ పిలిచి దిశానిర్దేశం చేయబోతోంది. తర్వాత ఎంత దూకుడుగా ముందుకు వెళ్తారో చూడాలి మరి.