అధికార పార్టీలో ఉంటే చాలు అడ్డగోలు వ్యాపారాలకు లైసెన్స్ వచ్చేసినట్టేనా? ఐదేళ్లు వైసీపీలో ఉండి నానా బీభత్సం చేసిన చేసిన అక్కడి ఊరసవెల్లులు ఇప్పుడు టీడీపీలోకి ఎంటరైపోయి…. పార్టీ ఏదైతేనేం… మనకు మన యాపారం ముఖ్యం అంటున్నారా? పాత, కొత్త టీడీపీ నేతలు కలిసి మెలిసి పంచేసుకుంటున్నారా? ఎక్కడ జరుగుతోందీ దో నంబర్ దందా? ఎవరా రాజకీయ ముసుగు కప్పుకున్న రాబందులు? ఉమ్మడి కర్నూలు జిల్లాలో రేషన్ బియ్యం అక్రమ రవాణా, ఇసుక, మద్యం దందాలు యమా జోరుగా నడుస్తున్నాయట. ఆ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం అని లేదు. గవర్నమెంట్ ఏదైతే ఏంటి..? కావాల్సింది కొట్టు, కాదు కూడదంటే… కండువా మార్చు. పార్టీ ఏదైతేనేం…. మనకు పని జరగడం ముఖ్యం అన్నట్టుగా ఉందట ఇక్కడి వ్యవహారం. అది యాపారం…. మనకు పార్టీలు, విలువలతో పనేందని అంటున్నారట అక్కమార్కులు. కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీ పాత నాయకులు వెనుకుండి నడిపిస్తుంటే…. మరికొన్ని చోట్ల ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జంపై పసుపు కండువాలు కప్పుకున్నవారు తమకు అడ్డేలేదన్నట్టుగా నడిపిస్తున్నారట. సదరు ఊసరవెల్లి లీడర్స్ వైసీపీలో ఉన్నపుడు కూడా రేషన్ బియ్యం, ఇసుక అక్రమ రవాణా, అడ్డగోలు మద్యం వ్యాపారం చేసిన వాళ్లేనని చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారం మారేసరికి వాళ్ళు కూడా వెంటనే కండువా మార్చేసి టీడీపీలో చేరిపోయి తమ వ్యాపారానికి అడ్డులేకుండా చూసుకున్నారన్నది లోకల్ టాక్. ఆలూరు నియోజకవర్గం హోళగుంద, హాలహర్వి మండలాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నందున రాత్రివేళ అట్నుంచి రేషన్ బియ్యాన్ని సరిహద్దు దాటిస్తున్నట్టు సమాచారం. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి బిజినెస్ చేసిన నేతలు ఇప్పుడు టీడీపీలో చేరి యథేచ్ఛగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు స్థానికంగా. అంతకు ముందు వైసీపీలో ఉన్న హాలహర్వి మండలానికి చెందిన ఇద్దరు…. ప్రస్తుతం సైకిలెక్కి రేషన్ బియ్యం దందా చేస్తున్నారట. ఇక ఎమ్మిగనూరు పరిధిలో మట్కా విచ్చలవిడిగా నడుస్తోందని, వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఓ ప్రజాప్రతినిధి శివారు కాలనీలో పేకాట, మట్కా శిబిరాల్ని నడిపిస్తున్నారట. దీనిగురించి జనం పబ్లిక్‌గా మాట్లాడుకుంటున్నా… పోలీసులకు మాత్రం పట్టుబడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నది లోకల్ వాయిస్. అటు నాగలదిన్నెలో వైసీపీ నుంచి టీడీపీలోకి జంపైన ఇద్దరు స్థానిక నేతలు తుంగభద్ర నది నుంచి జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారట.
ఆదోని నియోజకవర్గంలో కూడా ఇదే తంతు నడుస్తోందని అంటున్నారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆ పార్టీ నేతలు చెలామణి అయిన కొందరు ఇప్పుడు బీజేపీలో చేరి కర్ణాటక మద్యం , ఎర్రమట్టి అక్రమ తవ్వకాల్లో మునిగి తేలుతున్నట్టు సమాచారం. అదోనిలో రేషన్ బియ్యం దందాను తాత్కాలికంగా నిలిపివేశారట. మంత్రాలయం వైసీపీలో కీలకంగా ఉండే ఓ స్థానిక నేత ఫుల్లుగా కర్ణాటక మద్యం, రేషన్ బియ్యం వ్యాపారం చేశారని, రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే…. అతను టీడీపీ కండువా కప్పుకుని తన అక్రమ వ్యాపారానికి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. మరోనేత జగనన్న కాలనీలో భూ కబ్జాలకు తెరలేపినట్టు సమాచారం. డోన్ లో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మట్కా, అక్రమ మద్యం నిర్వాహకులకు అండగా ఉన్న నేత టీడీపీ చేరారట. ఇప్పటికీ ఆయన అనుచరుల మట్కా, అక్రమ మద్యం వ్యాపారం నాన్ స్టాప్‌గా నడుస్తోందట. శ్రీశైలం నియోజకవర్గం కొత్తపల్లి మండలంలో రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కీలకంగా ఉన్న వైసీపీ నేతలు టీడీపీలో చేరి లైన్ క్లియర్ చేసుకున్నారట. ఆళ్ళగడ్డలో ఓ నేత ఎన్నికల ముందు వైసిపి నుండి టిడిపిలో చేరి ప్రస్తుతం అక్రమ రేషన్ బియ్యం వ్యాపారంలో కీలకంగా మారినట్టు సమాచారం. సిరువెళ్లలో వైసీపీ నుండి టీడీపీ లో చేరిన నేత ఎర్ర మట్టి, ఇసుక అక్రమ తవ్వకాల్లో కీలకంగా ఉన్నారట. ఈ మధ్యనే ఈ విషయం ఎమ్మెల్యే దృష్టికి వెళ్ళడంతో వార్నింగ్ ఇచ్చినట్టు చెప్పుకుంటున్నారు. ఓవైపు అక్రమ మద్యం, రేషన్ బియ్యం, అక్రమ ఇసుక తవ్వకాలు సహించేది లేదని స్వయంగా సీఎం చంద్రబాబు తరచూ హెచ్చరిస్తుంటే మరోవైపు పార్టీ మారి వచ్చిన నాయకులు… పాత టీడీపీ నేతలు కూడబలుక్కుని మరీ… ఊరిమీద పడుతున్నారని ఘాటుగానే మాట్లాడుకుంటున్నారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో. ఇప్పటికైనా పార్టీ అధిష్టానం జోక్యం చేసుకుని ఈ దందాలకు చెక్ పెడుతుందో లేదో చూడాలి మరి.