ఆ నియోజకవర్గంలో ఒక్కసారిగా రాజకీయం హీటెక్కింది. ఇప్పుడే ఎన్నికలు జరుగుతున్నాయనేంత రేంజ్‌లో నేతల మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. అధికార-విపక్ష నేతల మధ్య సవాళ్లు-ప్రతిసవాళ్లు నడుస్తున్నాయ్. చిన్న వివాదమే రెండు పార్టీల మధ్య చిచ్చు రేపింది. ఇంతకీ…ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? ఖమ్మం జిల్లా పాలేరులో ప్రస్తుతం రాజకీయం వేడెక్కుతోంది. అధికార పార్టీకి దీటుగా ప్రతిపక్ష పార్టీ నేతల పర్యటనలు సాగుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలోనూ ఇంతలా రాజకీయాలు సాగడం లేదట. ప్రతిపక్ష నేతల పర్యటనలు ఇక్కడిలా మరెక్కడ జరగటంలేదు. ఎన్నికలు అయ్యాక చాలా మంది అధికార పార్టీలో చేరిపోయారు. ఇక్కడి రాజకీయం మాత్రం మహా పసందుగానే సాగుతోంది. ఓ చిన్న ఘటన రాజకీయాలను మరింత వేడెక్కించింది.
ఎన్నికలు అయిపోగానే ఆనాటి అధికార పార్టీకి చెందిన నేతలను ప్రస్తుత అధికార పార్టీ నేతలు సహజంగానే టార్గెట్ చేసుకున్నారు. గతంలో బీఆర్ఎస్ నేతలు ప్రతిపక్ష నేతలను ఎలా టార్గెట్ చేసుకున్నారో ఇక్కడ కూడా అదే విధంగా ఆనాటి బిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసుకున్నారు. కొంతమంది బీఆర్ఎస్ నేతలు జైళ్లకు వెళ్లారు. మరికొంత మంది కామ్ అయ్యారు. ఉన్న కొద్ది మంది నేతలు మాజీ ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి వెంట ఉండి అధికార పార్టీని ఎదుర్కొంటున్నారు. ఐతే ప్రతీకార రాజకీయాలకు మాత్రం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఎప్పుడూ వ్యతిరేకంగానే ఉంటారు. ఎందుకంటే జిల్లాలో ఏ రాజకీయ పార్టీ నేత అయినప్పటికి ఆయన వద్దకు వెళ్లి వస్తుంటారు. గత ఎన్నికల్లో స్థానిక ఎన్నికల్లో ప్రతిపక్షం వారికి, అధికార పక్షం వారికి ఇద్దరికి ఆయన సహకరించారన్న పేరు ఉంది. కానీ…పాలేరులో ద్వీతీయ శ్రేణి నాయకత్వం మాత్రం ఆనాటి బిఆర్ఎస్ శ్రేణులను వదిలిపెట్టడం లేదట. ఆనాడు బిఆర్ఎస్ శ్రేణులు జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ వాళ్లను, ప్రత్యర్ధులను వేధించిన చరిత్ర ఉంది. పాలేరులో తుమ్మల వర్గీయులను సైతం బీఆర్‌ఎస్ నాయకులు వేధిచారన్న ప్రచారం ఉంది. అందుకే ఇప్పుడు బిఆర్ఎస్ శ్రేణులను కాంగ్రెస్ కార్యకర్తలు వదిలిపెట్టడం లేదట.
పాలేరు నియోజకవర్గంలోని నేలకొండపల్లిలో ఇటీవల బిఆర్ఎస్ జెండా దిమ్మె వివాదానికి కారణమైంది. అది అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆగ్రహాలకు కారణం. నేలకొండపల్లి మండలం కొత్తూరులో బిఆర్ఎస్ దిమ్మె నిర్మాణం చేపట్టారు. ఐతే దానిని తొలగించేందుకు ఆర్ అండ్ బి అధికారుల మీద కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకులు ఒత్తిడి తెచ్చారు. ఇంకేముంది ఆర్అండ్‌బి అధికారులు కూలగొట్టడానికి ప్రయత్నాలు చేయడం దానికి కాపలాగా బిఆర్‌ఎస్ నేతలు వారం రోజుల పాటు అక్కడే టెంట్ వేసుకుని కాపలాగా ఉన్నారు.
బీఆర్ఎస్ జెండా ఆవిష్కరణ సందర్భంగా మాజీ ఎంఎల్ఎ కందాల ఉపేందర్ రెడ్డి పొంగులేటిని టార్గెట్ చేసుకుని మాట్లాడారు. పొంగులేటి శ్రీనివాస రెడ్డి నేను చెబుతున్నాను అంటూ మాటల దాడి చేశారు. మీరు, మీ కార్యకర్తలు పార్టీలకు అతీతంగా ప్రజల కోసం పని చేయండన్నారు. ఎదుటి వారు ఒక్కటి కొడితే మేం రెండు కొడతాం…మీరు రెండు కొడితే ఆరు కొడతాం.. కార్యకర్తలను హింస పెడితే ప్రాణం అడ్డుపెట్టి వారి కోసం ఉంటాను అంటూ కందాల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్లు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. సామాన్యులను ఇబ్బంది పెట్టొద్దు. అంటూ చేసిన కామెంట్ రాజకీయాల్లో హీట్ పుట్టించింది.
ఇక ఆ తరువాత అదే నియోజకవర్గంలో పర్యటిస్తున్న మంత్రి పొంగులేటి చాలా ఆగ్రహంగా స్పందించారు. కందాల ఉపేందర్ రెడ్డి పేరు చెప్పకపోయినప్పటికీ పొంగులేటి మాత్రం కందాలనే టార్గెట్ చేసుకున్నారట. కారుకూతలు కూసే నాయకులకు ఎర్రగా కర్రు కాల్చి వాత పెట్టాల్సిన రోజు వస్తుందని పొంగులేటి హెచ్చరికలు చేశారు. ఇది కందాల ఆయన అనుచర వర్గాన్ని ఉద్దేశించిన చేసినవేననే ప్రచారం జరుగుతోంది. మొత్తానికి…పొంగులేటి, కందాల ఇద్దరి వెనుక ఉన్న అనుచర వర్గమే ఇలా రెచ్చగొట్టిస్తుందని చర్చించుకుంటున్నారు. దీంతో పాలేరులో రాజకీయం వేడెక్కింది.