ఇవ్వాల్సిందే…. నాకు పదవి ఇవ్వాల్సిందే…. ఏం ఎందుకివ్వరు? ఉన్నోళ్ళు, జంప్ అయినోళ్ళు… అలా ఎవరెవరికో ఇచ్చేస్తున్నారు…. పార్టీని అంటిపెట్టుకుని వేలాడుతున్న నాకు ఒక్క ఎమ్మెల్సీ ఇవ్వలేరా? ఇదీ… ఆ సీనియర్ కాంగ్రెస్ నాయకుడి వరస. ఇంతకీ ఎవరా నాయకుడు? అంత గట్టిగా డిమాండ్ చేయడం వెనకున్న రీజన్స్ ఏంటి? పొదెం వీరయ్య… భద్రాచలం మాజీ ఎమ్మెల్యే. ప్రస్తుతం తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా ఉన్నారు. కానీ… ఆ సీట్లో అంత సంతృప్తిగా లేరట. అందుకే… నాకా పోస్ట్ వద్దు, నా స్థాయికి కనీసం ఎమ్మెల్సీ కావాల్సిందేనని పట్టుబడుతున్నారట. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో భద్రాచలం నుంచి పోటీ చేసి ఓడిపోయిన పొదెం తాజా టార్గెట్ ఎమ్మెల్సీ సీటేనని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముందు ఇదే డిమాండ్ పెట్టారాయన. ఏకంగా పార్టీ అధినేత రాహుల్ గాంధీకి సైతం ఇదే విన్నవించుకున్నారు. తాజాగా ఇప్పుడు ఎమ్మెల్సీ నోటిపికేషన్ రావడంతో మరోసారి వాయిస్ పెంచుతున్నారాయన. అప్పట్లో ఆయన గెలిస్తే… మంత్రి అవుతారన్న ప్రచారం జరిగింది. కానీ… భద్రాచలం నుంచి పోటీచేసి రెండోసారి గెలవలేకపోయారాయన. గతంలో ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన పొదెం వీరయ్య మొదటి నుంచి కాంగ్రెస్ వాది. ఎప్పుడూ పార్టీ మాత్రం ఫిరాయించ లేదు. అయితే.. అప్పట్లో ములుగు సీటు సీతక్కకు సీటు ఇవ్వాల్సి వచ్చినందున పొదెంను భద్రాచలంకు షిఫ్ట్ చేసింది కాంగ్రెస్ అధిష్టానం. అయిష్టంగానే పది రోజుల ముందు వచ్చి ప్రచారం చేసినా… నాడు తొలిసారి భద్రాచలంలో పాగా వేయగలిగారు. మంచి వాడు, అందరి వాడన్న పేరుంది. కానీ.. 2023 ఎన్నికల్లో మాత్రం చేదు అనుభవమే ఎదురైంది.
మొన్నటి ఎన్నికల్లో తన అనుకున్న వారే మోసం చేయడంతో పొదెం వీరయ్య ఓడిపోయారన్న అభిప్రాయం ఉంది నియోజకవర్గంలో. దీంతో తాను పార్టీ కోసం ఎంతో చేశానని, అందుకే ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారట. అడిగింది ఇవ్వలేదిగానీ… కార్పొరేషన్ చైర్మన్ పదవి దక్కింది. అదే సమయంలో భద్రాచలం నుంచి గెలిచిన బిఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు వెంటనే కాంగ్రెస్ లో చేరిపోయారు. తెల్లం వెంకట్రావు పొంగులేటి వర్గంగా, పొదెం వీరయ్య భట్టి విక్రమార్క వర్గంగా ప్రచారం ఉంది. ఈ పరిస్థితిలో మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యే కోటా కింటి ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో…మరోసారి పొదెం ఆశలు చిగురించాయట. అయితే ఇప్పుడు జిల్లాలో ఉన్న కుల సమీకరణలు, కొత్త రాజకీయంలో ఆయనకు పదవి దక్కుతుందా అన్నది అనమానమేనన్న విశ్లేషణలు పెరుగుతున్నాయి. కానీ… పార్టీ కోసమే… ప్రలోభాలకు లొంగకుండా ఉన్నానని, ఈసారి నాకు కావాల్సిందేనని పట్టుదలగా ఉన్నారట ఆయన. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి కోసం ఢిల్లీ వెళ్ళి వచ్చారట. ఈ పరిస్థితుల్లో జిల్లా నుంచి ఇవ్వాల్సి వస్తే.. ఎవరికి ఇస్తారన్నది ఆసక్తికరంగా మారింది.