వాళ్ళు చర్చిస్తారు… నిర్ణయిస్తారు.. నిర్ణయాలు మాత్రమే తీసుకుంటారు. బస్… అక్కడితో మేటర్ ఖతం. తీసుకున్న నిర్ణయాలను అమలు చేయాలన్న ఆలోచన తెలంగాణ కాంగ్రెస్ నేతలకు ఉండదా? లేదా మనం మీటింగ్‌లు పెట్టి బిస్కెట్ తిని ఛాయ్‌తాగి వెళ్ళిపోతే… నిర్ణయాలు వాటంతట అవే అమలైపోతాయని ఫీలవుతారా? ఏకంగా పార్టీ చెప్పిన మాటకు కూడా దిక్కులేదా? ఇక్కడ ఓన్లీ టెలింగ్స్..!? నో ఇంప్లిమెంటేషన్సా? అంతా… తలపండిన నేతలే. ఎవరికి ఎవరూ తీసిపోరు. వ్యూహరచనలు, ఎత్తులకు పైఎత్తులు వేయడంలో కూడా అందరూ దిట్టలే. దూరం నుంచి చూస్తుంటే…అమ్మో… వీళ్ళా… వీళ్ళని ఢీ కొట్టడం సాధ్యమా అన్నట్టుగా ఉంటుంది ప్రత్యర్థులకు. కానీ… దగ్గరకొచ్చి చూస్తేకదా అసలు విషయం అర్ధమయ్యేది. నేను లేస్తే మనిషిని కాదన్నట్టుగా ఉంటుందట తెలంగాణ కాంగ్రెస్ నేతల వ్యవహారశైలి. అందుకే… అంతా బాగుంది కానీ అల్లుడి నోటిలో శని ఉందని కేడరే అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. టేబుల్ ముందు కుర్చీల్లో కూర్చున్నప్పుడు కాంగ్రెస్ పెద్దల మాటలు, నిర్ణయాలు చూస్తుంటే అబ్బో… ఇక మామూలుగా ఉండదని అనిపిస్తుందని, తీరా ఆచరణలోకి వచ్చేసరికి వీళ్ళెక్కడ దొరికార్రా బాబూ… అని తలబాదుకోవాల్సి వస్తోందని అంటోందట పార్టీ కేడర్. మీటింగ్స్‌లో ఉన్నతమైన నిర్ణయాలు తీసుకుంటారు కానీ.. ఆచరణలో పెట్టరని సణుక్కోవడం హస్తం పార్టీలో కామన్ అయిపోయిందట. పార్టీలో విధానపరమైన, కీలక అంశాలను చర్చించేందుకు… పొలిటికల్ అఫైర్స్ కమిటీని ఏర్పాటు చేశారు. నాయకుల అభిప్రాయాలు తీసుకోవడం, సయోధ్య లాంటి వాటికి కలిసి వస్తాయన్న అంచనాతో pac సమావేశాలు పెట్టాలి. కానీ ఇవి కూడా నామమాత్రమే మిగిలిపోతున్నాయని సీనియర్ నేతలు కూడా అంగీకరిస్తున్న పరిస్థితి. గత జనవరిలో హైదరాబాద్ వచ్చారు Aicc ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. పార్టీ వ్యవహారాలను ఇక సీరియస్‌గా తీసుకోవాలంటూ ముఖ్య నాయకులు అందరికీ దిశా నిర్దేశం చేశారు. అలాగే… కొన్ని కీలకమైన అంశాలపై క్లారిటీ ఇచ్చి వెళ్ళారాయన. ప్రతి నెలా… తప్పనిసరిగా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ పెట్టుకోవాలన్నది ఆయన చేసిన సూచనల్లో ప్రధానమైనది. పార్టీ, ప్రభుత్వానికి సంబంధించిన కీలకమైన అంశాలను ముందు పీఏసీలోనే చర్చించి.. అంతా కలిసి నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు కేసీ. ఆయన చెప్పడం వరకైతే చెప్పేశారుగానీ… ఆచరణలో మాత్రం ఆ సీరియస్‌నెస్ కనిపించడం లేదని పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. దీనిమీదే ఇప్పుడు పార్టీలో సీరియస్‌గా మాట్లాడుకుంటున్నారట. వీళ్ళు మారరా? ఇక ఎంతమాత్రం మారే అవకాశం లేదా? ఆ మాత్రందానికి ఢిల్లీ నుంచి ఆయన రావడం ఎందుకు? మీటింగ్ అంటూ ఓ… హడావిడి చేసేసి అటు ఫ్లైట్ ఎక్కగానే ఆ విషయం మర్చిపోవడం ఎందుకని కాంగ్రెస్ కేడర్ మాట్లాడుకుంటోందట. కేసీ వేణుగోపాల్ వచ్చి వెళ్ళిన జనవరి నుండి ఇప్పటి వరకు కీలక అంశాలకు సంబంధించి ఎన్నో నిర్ణయాలు జరిగాయి. కానీ… పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది లేదు. అందులో వీళ్ళు మాట్లాడింది లేదు.
ఎవరికి తోచిన నిర్ణయాలు వాళ్ళు తీసేసుకున్నారన్న అభిప్రాయం బలంగా ఉంది. బీసీ కుల గణన, ఎస్సీ వర్గీకరణ అమలు, రేషన్ కార్డులకు సన్న బియ్యం, భూ భారతి లాంటివి చాలా జరిగాయి. కానీ… వేటిమీదా పార్టీ పరంగా కార్యాచరణ లేనే లేదు. అసలు అత్యంత కీలకమైన బీసీ కులగణనపై ప్రజల్లోకి వెళ్ళే ప్రణాళిక ఇప్పటికీ సిద్ధం కాలేదు. ఇక ఎస్సీ వర్గీకరణ ఇప్పటి వరకు దేశంలో ఎక్కడా అమలవలేదు. తాము చేసికూడా ఈ విషయాన్ని గొప్పగా చెప్పుకోలేకపోతున్నారు కాంగ్రెస్ నాయకులు. సర్కార్ తీసుకున్న నిర్ణయాలను ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుంటూ… ప్రజల్లోకి తీసుకువెళ్ళాల్సిన బాధ్యత పార్టీ మీద ఉంటుంది. కానీ… ఇక్కడ మాత్రం ప్రభుత్వం పని ప్రభుత్వానిది, పార్టీ పని పార్టీది అన్నట్టుగా ఉందట. అదంతా వేరే…. కనీసం పార్టీ అత్యంత ముఖ్య నాయకుడు కేసీ వేణుగోపాల్ స్వయంగా హైదరాబాద్ వచ్చి చెప్పిన మాటలు కూడా ఇక్కడి నాయకుల చెవికెక్కకపోతే వీళ్ళనేం అనాలి? ఏం చేయాలంటూ కోపంగా మాట్లాడుతోందట ద్వితీయ శ్రేణి. అసలు లోపం ఎక్కడుందో ముందు చర్చ జరగాలంటున్నట్టు సమాచారం. తెలంగాణ కాంగ్రెస్‌లోని సమన్వయ లోపంతో వ్యూహాలు దెబ్బతింటున్నాయన్న అభిప్రాయం ఉంది. ప్రభుత్వం తనపాటికి తాను నిర్ణయాలు తీసుకుంటూ… పనిచేసుకుంటూ పోతోంది. కానీ… ప్రచారం చేసే నాయకులు మాత్రం లేరన్న అభిప్రాయం బలపడుతోంది పార్టీలో. ఈ పరిస్థితుల్లో పార్టీ నాయకత్వానికి కాన్ఫిడెన్స్ అనుకోవాలా..? ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకోవాలా అన్న చర్చ జరుగుతోంది. వీళ్ళలో మార్పు వస్తేనే మనుగడ అన్న మాటలు పార్టీ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.