ఎమ్మెల్యే కొలికపూడి టీడీపీ అధిష్టానానికి కొరుకుడు పడటం లేదా? ఏకంగా పార్టీకే డెడ్‌లైన్ పెట్టి అల్టిమేటమ్ ఇవ్వడాన్ని ఎలా చూడాలి? ఆయన ఇన్నాళ్ళు చేసిన రచ్చ ఒక ఎత్తు, తాజా వివాదం మరో ఎత్తులా ఉండబోతోందా? ఎమ్మెల్యే వాఖరి మీద పార్టీ పెద్దలు సీరియస్‌గానే ఉన్నారా? తిరువూరు ఎమ్మెల్యే గురించి టీడీపీలో ఏమని మాట్లాడుకుంటున్నారు? ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి ఆందోళనల్లో చురుగ్గా పాల్గొనడం, ఎగ్రెసివ్ నేచర్‌తో సీఎం చంద్రబాబు దృష్టిని ఆకర్షించారు కొలికపూడి శ్రీనివాస్. ఆ కోటాలోనే ఆయనకు తిరువూరు టీడీపీ టిక్కెట్ దక్కింది. అయితే… తాను ఎమ్మెల్యేగా గెలిచి, రాష్ట్రంలో తమ పార్టీ పవర్‌లోకి వచ్చాక కూడా కొలికపూడి అదేరకమైన ఎగ్రెసివ్‌నెస్‌ని కొనసాగిస్తుండటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారుతోందట. ఇంకా చెప్పాలంటే… సొంత పార్టీ ఎమ్మెల్యే వైఖరి టీడీపీ పెద్దల్ని ఇరకాటంలో పెడుతోందన్న చర్చలు జోరుగా నడుస్తున్నాయి. వైఖరి మార్చుకోమంటూ….ఇప్పటికే అధిష్టానం పిలిచి చెప్పినా… ఆయన దూకుడు మాత్రం తగ్గడం లేదు…… సరికదా, ఇంకా డోస్ పెంచుతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది. ఎమ్మెల్యే వ్యాఖ్యలకు హర్ట్ అయి గతంలో ఒక మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం, మద్యం షాపులు ఎక్కువయ్యాయని, బెల్ట్ షాపులు పెరిగిపోయాయని అనడం లాంటివన్నీ పార్టీని ఇరుకున పెట్టాయి. దీంతో కొలికలపూడి వ్యవహార శైలిపై తీవ్ర చర్చ జరుగుతోందట టీడీపీలో. తాజాగా ఎఎంసి మాజీ చైర్మన్ రమేష్ రెడ్డి వ్యవహర శైలిపై ఎమ్మెల్యే కామెంట్ చేయడం, ఏకంగా పార్టీకే అల్టిమేటం ఇవ్వడం గురించి హాట్ హాట్‌గా మాట్లాడుకుంటున్నాయి టీడీపీ శ్రేణులు. ఈయనేంటి… ఈయన విధానాలేంటి అంటూ చెవులు కొరికేసుకుంటున్నారట కార్యకర్తలు. ఒక ఎమ్మెల్యేకి ఏదైనా ఇబ్బంది ఉంటే పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళాలిగానీ…. ఈ రకంగా అల్టిమేటం ఇవ్వడం ఏంటన్న చర్చ నడుస్తోందట టీడీపీలో. ఎమ్మెల్యే ల వ్యవహార శైలిపై సీఎం చంద్రబాబు పదే పదే క్లాస్ తీసుకుంటూనే ఉన్నారు. అయినా కొంతమంది వైఖరిలో మార్పు ఉండడం లేదు. కొలికపూడి కూడా ఆ లిస్ట్‌లో ఉన్నారని అంటున్నారట కార్యకర్తలు. టీడీపీ చరిత్రలోనే ఒక ఎమ్మెల్యే క్రమశిక్షణా కమిటీ ముందు హాజరవడం ఇదే మొదటి సారని అంటున్నారు. అదిపోను…. క్రమశిక్షణా కమిటీ హెచ్చరించినా కూడా కొలికపూడి వైఖరి మారడం లేదని, ఆయన అసలు పార్టీ పరువును ఎక్కడ కలుపుదామనుకుంటున్నారంటూ ఘాటు రియాక్షన్సే వస్తున్నాయట టీడీపీ వర్గాల నుంచి.
తన డిమాండ్‌కు అనుగుణంగా ఏకంగా హై కమాండ్‌కు డెడ్ లైన్ పెట్టడం, అల్టిమేటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పాలిటిక్స్ అన్నాక పట్టు విడుపులు ఉంటాయి. కానీ..ఇప్పుడు ఈ ఎమ్మెల్యేవిషయంలో ఎలాంటి చర్యలు తీసుకోకుంటే.. భవిష్యత్‌లో మరి కొంతమంది కూడా ఇలాగే మారిపోయే ప్రమాదం ఉందన్న మాటలు వినిపిస్తున్నాయి టీడీపీ సర్కిల్స్‌లో. అదే సమయంలో…. ఇంతలా అడ్డం తిరుగుతూ రచ్చ చేస్తున్న ఎమ్మెల్యేని ఎలా డీల్ చేయాలోఅధిష్టానానికి కూడా అర్ధం కావడం లేదా అని కూడా టీడీపీ నాయకులు మాట్లాడుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక స్థానిక నాయకుడి మీద చర్యలు తీసుకోకుంటే…. ఏకంగా తన ఎమ్మెల్యే పదవికే రాజీనామా చేస్తానని అల్టిమేటమ్ ఇవ్వడం చిన్న విషయం కాదంటున్నారు పార్టీ లీజర్స్. క్రమశిక్షణ సంఘం ఈ సారి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుందా లేక ఎమ్మెల్యేనే తన అల్టిమేటంకు కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తి కరంగా మారింది. కొలికపూడి శ్రీనివాస్ రెండు రోజులు టైం ఇచ్చారు..అయినా ఇప్పటి వరకు టీడీపీ నుంచి ఎలాంటి స్పందన లేదు. ఇవాళో రేపో రెస్పాండ్ కావచ్చని అంటున్నారు. అయితే… ఆ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారింది. ఈసారి పార్టీ పెద్దలు కూడా సీరియస్ కావచ్చన్న టాక్ నడుస్తోంది పార్టీ వర్గాల్లో. అయితే ఇక్కడ సమస్యలో గిరిజన మహిళ అంశం కూడా ఉంది కాబట్టి పార్టీ పెద్దలు కూడా ఆచితూచి స్పందించవచ్చంటున్నారు. ఏతావాతా కొలికపూడి శ్రీనివాస్ మాత్రం టీడీపీ అధిష్టానానికి కొరకరాని కొయ్యలా మారినట్టు చెప్పుకుంటున్నాయి కృష్ణా పొలిటికల్ సర్కిల్స్.