ఆ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ నేతలంతా… ఆ ఎంపీనే ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఎక్కడో స్విచ్చేస్తే… అక్కడ బల్బ్ వెలుగుతోందా..? అన్న-తమ్ముడు అనుకుంటూనే.. ఎందుకు లడాయి పెట్టుకుంటున్నారు? క్రమశిక్షణ అన్నది బ్రహ్మ పదార్ధంలా మారిపోయిందా? ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? కీచులాడుకుంటున్న ఆ నాయకులెవరు? ఉమ్మడి పాలమూరు జిల్లా కాంగ్రెస్ పంచాయితీ గాంధీభవన్‌కి చేరింది. ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ముందు ఆందోళన, పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదుల దాకా వచ్చేసింది వ్యవహారం. ఎంపీ మల్లు రవి టార్గెట్‌గా… పాలమూరు జిల్లాలోని కీలకనేతలంతా ఏకమైనట్టు కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. క్రమశిక్షణా కమిటీ చైర్మన్‌గా ఉన్న మల్లు రవినే…క్రమశిక్షణ ఉల్లంఘిస్తున్నారని, ఆయన మీదే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసేదాకా వెళ్ళింది మేటర్. అసలు ఈ లొల్లి వెనక స్టోరీ ఏంటి..!? పాలమూరు జిల్లా పంచాయతీలో ట్విస్ట్‌లు ఏంటని అంటే…. అబ్బో… అది చాలా పెద్ద కథ అంటున్నారు పొలిటికల్ పండిట్స్. పాలమూరు జిల్లా డిసిసిబి చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి… మొదట బీఆర్‌ఎస్‌లో ఉన్నప్పుడే డిసిసిబి డైరెక్టర్. ఎంపీ మల్లు రవి ఆయన్ని పార్టీలోకి తీసుకుని అవిశ్వాసం పెట్టించి మరీ చైర్మన్‌ని చేయించారట. విష్ణు వర్ధన్ రెడ్డి… కొల్లాపూర్ నియోజక వర్గానికి చెందిన నేత. అక్కడ మంత్రి జూపల్లి ఉండటంతో రాజకీయం చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. దీంతో పక్కన ఉండే అలంపూర్.. గద్వాల్ నియోజకవర్గాల్లో వేలు పెట్టడం మొదలుపెట్టారట. ఎంపీ అండతో… రెండు నియోజక వర్గాల్లో పార్టీని డిస్ట్రబ్ చేస్తున్నారనేది అందరి ఆగ్రహం.
దీనికి తోడు.. మల్లు రవి ఎంపీగా నియోజక వర్గ పర్యటన సందర్భంగా ఆలంపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని వెంటపెట్టుకుని పోవడం, పొరుగున ఉన్న గద్వాల వరకు తీసుకెళ్లి సరితా తిరుపతయ్యతో సన్మానం చేయించడం లాంటి చర్యలు అలంపూర్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సంపత్ కి కోపం తెప్పించినట్టు చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ నేతలను వదిలేసి… పక్క పార్టీ వాళ్ళని వెంట పెట్టుకు తిరగడం ఏంటన్నది క్వశ్చన్. సదరు ఎమ్మెల్యే పార్టీలో చేరినా…..ఇబ్బంది ఉండేదికాదని, ఎంపీ ఏకంగా బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేని వెంట తీసుకుని కాంగ్రెస్ నేతల ఇళ్ళకు తిరగడం ఏంటని ప్రశ్నిస్తున్నారు మిగతా నాయకులు. మరోవైపు సంపత్‌కి, స్థానిక ఎమ్మెల్యేకి మధ్య ఎప్పటి నుంచో కోల్డ్‌వార్ ఉంది. దాన్ని కాదని… మల్లు రవి తన ప్రత్యర్ధిని వెనకేసుకు తిరగడం చిర్రెత్తు కొచ్చినట్టు అయ్యిందట. జిల్లాలో జరుగుతున్న ఈ వ్యవహారం అటు మంత్రి జూపల్లికి కూడా నచ్చడం లేదంటున్నారు. దీంతో నాగర్‌కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నేతలతో జరిగిన సమావేశంలో ఇదే అజెండా అయ్యింది. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే నేతల మధ్య లొల్లి తారాస్థాయికి చేరడం, క్రమశిక్షణా కమిటీ ఛైర్మనే ఇందులో పాత్రధారి కావడంపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ఈ విషయంలో ఇప్పుడు రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏ చర్యలు తీసుకుంటారన్నది కూడా ఆసక్తికరంగా మారింది. క్రమశిక్షణ కమిటి చైర్మన్ గా ఉన్న మల్లు రవి… పై చర్యలు తీసుకుంటారా..? అన్నది కూడా ఇక్కడ ఇంట్రస్టింగ్ పాయింట్. అటు మల్లు రవి మాత్రం తానెక్కడా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడలేదని.. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్నారని చెప్తున్నారు. మొత్తం మీద పాలమూరు పంచాయితీ మాత్రం పార్టీకి పెద్ద తలనొప్పిగా మారిందన్న మాటలు బలంగా వినిపిస్తున్నాయి గాంధీభవన్‌లో.