బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా? ఆయన ఏదో చేయబోతే… అది ఇంకేదో అయిపోయి ఇరుకున పడేసిందా? కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా బుక్కయిపోయారా? ఆ పార్టీ శ్రేణులు ఇప్పుడాయన్ని సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేసుకుంటున్నాయా? ఇంతకీ… ఏ విషయంలో ఇరుక్కుపోయారు కేటీఆర్? కాంగ్రెస్ పార్టీ ఎలా సోషల్ రివెంజ్ తీసుకుంటోంది? ఈ రైతు ఆవేదన వీడియోని ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేటీఆర్… రాష్ట్రంలో పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూడమంటూ జనం మీదికి వదిలారు. కాంగ్రెస్ పాలనలో మిర్చి రైతులు ఎలా అల్లాడిపోతున్నారో చూడండంటూ… ఆయన కూడా తీవ్రంగా సోషల్ మీడియా ఆవేదన వ్యక్తం చేశారు. మాయమాటలు నమ్మిన పాపానికి.. మిర్చి రైతు కంట్లో కారం కొడతారా.. ? ఇద్దరు ఆడపిల్లల తండ్రిని అరిగోస పెడతారా.. ? ఇందిరమ్మరాజ్యంలో చెప్పిన మార్పు ఇదేనా..? అంటూ… రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీశారాయన. ఖమ్మం జిల్లా… చింతకాని మండలం నావరంలో లక్షలు అప్పుచేసి ఈ రైతు మిర్చి పండిస్తే…. 2-3 వేలకే తెగనమ్మమంటారా? సాక్షాత్తు వ్యవసాయ మంత్రి ఇలాకాలోనే.. గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే… రైతులేం కావాలె.. ఖమ్మంలో ముగ్గురు మంత్రులున్నా ఏం చేసుకోవాలె..బోనస్ పేరిట బోగస్ మాటలు ఆపండి.. మిర్చి రైతుకు కనీసం మద్దతు ధర ఇప్పించండి..అంటూ.. ఓ రేంజ్‌లో మిర్చి ఘాటుకంటే ఎక్కువగా ఎక్స్‌లో ఫైరైపోయారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
కేటీఆర్ పోస్ట్ చేయడం, ప్రభుత్వాన్ని నిలదీసిఫై అనడం వరకు బాగానే ఉందిగానీ…. ఆ తర్వాతే అసలు మేటర్ బయటికి వచ్చింది. ఈ వీడియోలో రైతు అడుగుతున్నది కనీసం మూడు వేల రూపాయల మద్దతు ధర కూడా రావడం లేదని. కానీ… ఇప్పుడు మార్కెట్‌లో క్వింటాల్ మిర్చి రేటు 12 నుంచి 14వేల దాకా పలుకుతోంది. ఇక్కడే కాంగ్రెస్ శ్రేణులకు దొరికిపోయారు మాజీ మంత్రి. ఇదేంటీ… ఏదో తేడాగా ఉందే… అంటూ కాస్త లోతుగా చూస్తే…. ఈ వీడియో, ఆ రైతు ఆవేదన అంతా వాస్తవమే. కానీ… అది 2018లో ఉన్న పరిస్థితి. అప్పుడు అధికారంలో ఉన్నది బీఆర్‌ఎస్సే. ఇక చెలరేగిపోతున్నారు కాంగ్రెస్ సోషల్ మీడియా వారియర్స్. కేటీఆర్‌ను ఉద్దేశించి తొందరపడి ఒక కోయిలా…. అంటూ సాంగ్స్ సింగుతున్నారు. అసలు ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో… మీ హయాంలో ఎంత దారుణంగా ఉందో చూసుకో. పొరపాటో, గ్రహపాటో… మీరు పోస్ట్ చేసిన ఈ వీడియో వల్ల అప్పట్లో మీ పాలనలో రైతులు ఎంత గోస పడ్డారో మీరే మరోసారి ప్రపంచానికి చెప్పేశారంటూ… కేటీఆర్ మీద విరుచుకుపడుతున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. బీఆర్‌ఎస్ హయాంలో మిర్చి క్వింటా మూడు వేలు కూడా పలక్కుంటే… మా టైంలో 14వేల రూపాయలు ఉందని అంటూ… రివర్స్ అవుతున్నారు కాంగ్రెస్ నాయకులు. ఈ రైతు గోస.. మనసులేని ముఖ్యమంత్రికి వినిపించడం లేదా ? కనికరం లేని కాంగ్రెస్ సర్కారుకు కనిపించడం లేదా ? అంటూ ఎక్స్‌లో కేటీఆర్ వేసిన ప్రశ్నలను ఆయనకే రివర్స్‌లో వేస్తున్నారు. ఇదంతా గమనిస్తున్నవారు మాత్రం… ముందు వెనకా చూసుకోకుండా కేటీఆర్ తొందరపడి సెల్ఫ్‌గోల్ వేసుకున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. అసలు కనీస వెరిఫికేషన్ కూడా లేకుండా ఆయన ఎలా పోస్ట్ చేశారు? అయినా మూడు వేలెక్కడ? 13వేలెక్కడ? అసలిప్పుడు మిర్చి మార్కెట్ గురించి కేటీఆర్‌కు కనీస అవగాహన కూడా లేదా? అని ప్రశ్నిస్తున్నారు. ఈ వీడియో ద్వారా మార్కెట్‌లో ఏం జరుగుతోందో తనకు తెలియదన్న విషయాన్ని కూడా కేటీఆర్ బయటపెట్టుకున్నట్టయిందన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్‌లో. ఏతావాతా… ఈ ఎపిసోడ్‌తో… సోషల్ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలని ఛాన్స్ వస్తే…. ఎవరికి వారు అడ్వాంటేజ్ తీసుకుని అవతలి వాళ్ళని ఆడేసుకుంటారన్న సంగతి గుర్తుంచుకోవాలంటున్నారు. ఇటీవల బీసీ కులగణన, ఎమ్మెల్యేల సీక్రెట్ మీటింగ్, ఢిల్లీ పరిణామాల లాంటి విషయాల్లో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి బీఆర్‌ఎస్ సోషల్ మీడియా సానుభూతిపరులు బీభత్సం చేసేశారు. ఇప్పుడు మిర్చి రైతు రూపంలో కేటీఆర్ కాంగ్రెస్ శ్రేణులకు దొరికిపోయారు. అప్రమత్తంగా లేకుంటే ఎవరి జుట్టు ఎవరి చేతికైనా దొరకవచ్చు. తస్మాత్ జాగ్రత్త!