ఆ… ఆరు జిల్లాల వైసీపీ కోఆర్డినేటర్…. తన నియోజకవర్గంలో ఆరుగురు ఎంపీటీసీల్ని మేనేజ్ చేయలేకపోతున్నారా? పో… పోవయ్యా అంటూ వాళ్లంతా ఆయన్ని లైట్ తీసుకున్నారా? ఉండండి కలిసి పని చేద్దామని ఆయనంటే…. అమ్మ పుట్టిల్లు మేనమామకు తెలియదా అంటూ సామెత చెప్పేసి మరీ టూర్స్‌కు చెక్కేస్తున్నారా? రచ్చ గెలిచే సంగతి తర్వాత… ముందు ఇంట్లో ఇబ్బంది పడుతున్న ఆ లీడర్ ఎవరు? ఎంపీటీసీల్ని బతిమాలుకోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చింది? కురసాల కన్నబాబు…. వైసిపి ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్. పార్టీ పవర్‌లో ఉన్నప్పుడు రెండున్నరేళ్లు వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారాయన. కాకినాడ రూరల్ నుంచి నాలుగు సార్లు పోటీ చేసి రెండు సార్లు విజయం సాధించారు. అదంతా గతం. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాలు ఆయన్ని ఇరుకున పెడుతున్నాయట. ఇంట గెలవలేడుగానీ…అక్కడెక్కడికో పోయి వెలగబెడతాడంట అంటూ ఎకసెక్కాలాడుతున్నారట ఆయన అంటే గిట్టని వారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాతి పరిణామాలతో…. కాకినాడ రూరల్ ఎంపీపీ రాజీనామా చేశారు. 2021లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో రూరల్ నియోజకవర్గంలోని 18 ఎంపీటీసీ సీట్లకుగాను వైసీపీ 15 చోట్ల గెలిస్తే జనసేన మూడింటిని తన ఖాతాలో వేసుకుంది. ఈక్రమంలో రాజీనామా చేసిన ఎంపీపీ సీటుకు ఈనెల 27న ఎన్నిక జరగనుంది. దాంతో జనసేన అడ్వాన్స్ అయిందట. ప్రస్తుతం ఈ నియోజకవర్గ నుంచి జనసేన ఎమ్మెల్యే నానాజీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తమ పార్టీకి ఉన్న ముగ్గురు ఎంపీటీసీ లతోపాటు వైసీపీ తరుపున గెలిచిన ఆరుగురికి కూడా ఆ మధ్య గ్లాస్ పార్టీ కండువా కప్పేశారు నానాజీ. మరో నలుగురు వైసీపీ ఎంపీపీటీసీలు కూడా జాయిన్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది. 27న ఎన్నిక జరగాల్సి ఉండగా… కొందరు ఇప్పటికే ఫ్యామిలీ టూర్స్ పేరుతో బయటికి వెళ్ళిపోవడం నియోజకవర్గంలో హాట్ టాపిక్ అయింది. వీరంతా డైరెక్ట్‌గా వచ్చి ఓటేసే ప్లాన్‌లో ఉన్నారని, ఆలోపు టూర్‌లో జరగాల్సిన సర్దుబాట్లన్నీ జరిగిపోతాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అదే నిజమై ఎంపీపీ చేజారితే అది కన్నబాబుకు పరువు ప్రతిష్టల సమస్య అవుతుందని అంటున్నారు. సొంత నియోజకవర్గంలో ఎంపీపీని కాపాడుకోలేని నాయకుడు ఉత్తరాంధ్ర రీజినల్ కో ఆర్డినేటర్‌గా ఏం చేస్తారన్న ప్రశ్నలు అక్కడే వస్తున్నాయట. ఆరు జిల్లాల కో ఆర్డినేటర్‌గా ఉన్న నాయకుడు ఆ మాత్రం ఇంటిని చక్కదిద్దుకోలేకపోతున్నారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.
అప్పటికీ ఎంపీటీసీలు ను కాపాడుకోవడానికి కన్నబాబు తన ప్రయత్నం తాను చేస్తున్నా… ఎవ్వరూ వినడం లేదట. మీరు పవర్‌లో ఉన్నప్పుడు అంతా ఫ్యామిలీ పాలిటిక్స్ నడిపారు తప్ప మమ్మల్ని ఎక్కడ పట్టించుకున్నారంటూ రివర్స్‌లో ప్రశ్నించినట్టు తెలిసింది. మనల్ని నమ్ముకుని కొంత మంది ఉన్నారు. వాళ్ళకి కూడా పనులు ఇచ్చి బతకనిద్దామని ఎన్నడైనా ఆలోచించారా అంటూ ఘాటుగా రియాక్ట్ అవుతున్నట్టు సమాచారం. ఇప్పుడు మాకు ఛాన్స్ వచ్చింది. మేం మాత్రం ఎందుకు వదులుకోవాలంటూని డైరెక్ట్ అయిపోతున్నారట. మీకు సీట్లు ఇప్పించి గెలిపించాను…. ఇలా చేయడం కరెక్ట్ కాదని కన్నబాబు అంటుంటే దానికి కూడా రివర్స్ ఎటాక్ గట్టిగానే వస్తుందట. మీరేమన్నా…. ఊరికినే దారిని పోయే వాళ్ళను తీసుకొచ్చి టికెట్లు ఇచ్చారా? మాకు పదవులు ఇస్తే మేము కూడా రిటర్న్ చాలా ఇచ్చామని, అవన్నీ తవ్వుకోవడం అవసరమా అని తగులుకుంటున్నారట. కాకినాడ రూరల్ ఎంపీపీ పదవీకాలం 2026 వరకు ఉంది. దీంతో పార్టీ అధికారంలో లేకపోయినా తనకు పట్టు ఉందని నిరూపించుకోవడానికి మాజీ మంత్రి చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతున్నాయట. ఐదేళ్లు మీ రాజకీయాలు మీరు చేశారు. ఏదో…. ఇప్పుడు మా స్థాయిలో చిన్నా చితక పనులు చేసుకోవడానికి అవకాశం వచ్చింది. మమ్మల్ని వదిలేయండి మహా ప్రభో అని టూర్‌కి వెళ్ళిపోయారట. మంత్రిగా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఫ్యామిలీ పాలిటిక్స్ చేసి మీరు మాత్రమే బాగుపడ్డారంటూ ఎంపీటీసీలు గట్టిగానే ఓపెన్ అయిపోతున్నట్టు తెలిసింది. కన్నబాబు ఎప్పుడూ తన అవసరాలు చూసుకుంటారు తప్ప నమ్ముకున్న వాళ్ళ గురించి ఆలోచించరనిన ప్రచారం జరుగుతోంది నియోజకవర్గంలో. మొత్తానికి ఆరు జిల్లాల వైసిపి రీజినల్ కోఆర్డినేటర్‌కు సొంత నియోజకవర్గంలో పట్టు చిక్కకపోవడం చర్చనీయాంశం అవుతోంది. కరెక్ట్‌గా టైం చూసి టాటా బైబై చెప్పేస్తున్నారు మండల సభ్యులు. పోతే పోయారు… మీరు మీ ఫ్యామిలీ అంతే… అంటూ మీరు మారరన్నట్టు డైలాగ్స్ కూడా కొట్టేస్తున్నట్టు తెలిసింది. ఇంట గెలిచి రచ్చ గెలవాలన్నది సామెత. మరి కన్నబాబు ఇంట గెలుస్తారా? లేక ఇంట్లో ఈగల మోత బయట పల్లకీ మోత అన్న సామెతను నిజం చేసుకుంటారా అన్నది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు.