మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి విషయంలో… వైసీపీ రివర్స్ అటాక్ మొదలుపెట్టిందా? మైనింగ్ అక్రమాలపై సీఐడీ కాదు…. సీబీఐతో దర్యాప్తు చేయించమన్న డిమాండ్ వెనక వ్యూహం ఉందా? అధికార పార్టీ మీద పైచేయి సాధించేందుకు ప్రతిపక్షం ఓ పద్ధతిలో అడుగులేస్తోందా? ఇంతకీ వైసీపీ నయా స్ట్రాటజీ ఏంటి? అది ఎంతవరకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంది? మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అరెస్ట్ ఎపిసోడ్ సినిమాలో ట్విస్ట్‌లను తలపించింది. అజ్ఞాతంలో ఉన్న కాకాణిని… వెదికి మరీ పట్టుకున్నారు పోలీసులు. పొదలకూరు మండలం వరదాపురంలోని రుస్తుం మైన్స్ నుంచి క్వార్ట్జ్ ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని, అదంతా గోవర్ధన్ రెడ్డి కనుసన్ననలోనే నడిచిందంటూ కేసు బుక్ చేశారు పోలీసులు. ఇక 55 రోజుల తర్వాత ఆయన్ని బెంగళూరులో అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు. అజ్ఞాతం నుంచి అరెస్ట్‌దాకా…. ప్రతి సందర్భంలోనూ ట్విస్ట్‌లే ట్విస్ట్‌లు. ఫైనల్‌గా 14 రోజుల రిమాండ్ పడింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి పీకల్లోతున ఇరుక్కుపోయారని మాట్లాడుకుంటున్న టైంలో…వ్యూహం మారుస్తోందట వైసీపీ జిల్లా నాయకత్వం. ఆయన తప్పు చేశారనేదానికంటే… ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోందని చెప్పేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ఆ ప్రచారం ద్వారా సానుభూతి కూడగట్టుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితే…. గోవర్ధన్ రెడ్డికి కూడా ఎదురవుతుందని ఊహించిన నెల్లూరు వైసీపీ నాయకత్వం… అక్రమ కేసుల పేరుతో…ప్రజల్లోకి వెళ్ళాలనుకుంటోందట. కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎలాంటి తప్పు చేయలేదని, ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ఆయన్ని వేధించేందుకు కేసులు పెడుతోందన్న మెసేజ్‌ని జిల్లా పొలిటికల్ స్క్రీన్ మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తోందట పార్టీ. అక్రమ మైనింగ్ వ్యవహారంలో పోలీసుల పాత్రను కూడా ప్రశ్నిస్తున్నారు జిల్లా వైసీపీ నాయకులు. ముందు డిపార్ట్‌మెంట్‌ని కార్నర్ చేస్తే…సగం సమస్య తీరిపోతుందన్నది వాళ్ల ఆలోచనగా తెలుస్తోంది. క్వార్ట్జ్ అక్రమ తవ్వకాలు, రవాణా మీద సీబీఐ దర్యాప్తు జరపాలన్నది వైసీపీ లేటెస్ట్ డిమాండ్. ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో.. కాకాణి కుమార్తె పూజిత నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్‌ను కలిసి ఈ మేరకు వినతి పత్రం కూడా ఇచ్చేశారు. కాకాణిని అక్రమంగా అరెస్ట్ చేశారని ఓవైపు చెబుతూనే….. సీబీఐ దర్యాప్తు కోరడం ద్వారా….. అధికార పార్టీ నేతల మీద పైచేయి సాధించాలన్నది వైసిపి స్కెచ్‌గా తెలుస్తోంది.
ఈ విషయంలో ఒకసారి సీబీఐ అంటూ రంగంలోకి దిగితే… కొంతమంది టీడీపీ నేతల వ్యవహారాలు కూడా బయటికి వస్తాయన్నది వైసీపీ అంచనా అట. అందుకు తగ్గట్టే… సీబీఐ డిమాండ్ తెర మీదికి వచ్చాక జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులు డైలమాలో పడ్డారన్నది లోకల్ టాక్. కాకాణి కేసుకు సంబంధించి వైసీపీ రివర్స్ కౌంటర్ వేస్తున్నా…. జిల్లా టీడీపీ నాయకులు పెద్దగా స్పందించడం లేదు. సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మినహా మిగిలిన వారంతా కాకాణి విషయంలో గమ్ముగానే ఉన్నారు. అక్రమ మైనింగ్ కేసులో A1, A2, A3కి బెయిల్ రావడం, A4గా ఉన్న మాజీ మంత్రి మీద నాన్ బెయిలబుల్ కేసులు పెట్టడంతో… ఇదే విషయాన్ని హైలైట్ చేస్తున్నారు జిల్లా ఫ్యాన్ పార్టీ లీడర్స్. దీని ద్వారా కుట్ర పూరితంగా కాకాణిని ఇరికించారన్న భావనను బాగా వ్యాప్తి చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అటు ఎమ్మెల్యే సోమిరెడ్డి మాత్రం కాకాణి పాపం పండిందని, తెల్ల రాయిని కొల్లగొట్టడం వల్లే ఆయన జైల్లో ఉన్నట్టు చెప్పుకొస్తున్నారు. ఆ సంగతి ఎలా ఉన్నా… ఒకసారి దొరికారు కాబట్టి… మాజీమంత్రిని మరిన్ని కేసుల్లో విచారణ పేరుతో ఇబ్బంది పెడతారని ముందే ఊహించిన వైసీపీ మాత్రం కౌంటర్స్ రెడీ చేసుకుంటోందట. క్వార్ట్జ్ కేసులో సీబీఐ విచారణ కోరడం ద్వారా…. గోవర్ధన్‌రెడ్డి ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదని చెప్పాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో సింహపురి రాజకీయం మాంఛి రకసకందాయంలో పడుతోంది. వైసీపీ ఫాలో అవుతున్న సెంటిమెంట్ స్ట్రాటజీని ప్రజలు నమ్ముతారా..? దాన్ని టీడీపీ ఎలా కౌంటర్ చేసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.