ఆంధ్రప్రదేశ్ అంతటా… ఒక రకమైన రాజకీయం నడుస్తుంటే.. అక్కడ మాత్రం మరో తరహా పొలిటికల్ హీట్ పుడుతోంది. అసలు ఏకంగా… ప్రత్యర్థిని ఊళ్లోనే అడుగుపెట్టనివ్వడంలేదట. ఆయన లెగ్ పెడితే శాంతి భద్రతల సమస్య వస్తుందని పోలీసులు అంటుంటే… నువ్వయినోడివి ముందు అడుగుపెట్టి చూడు…మిగతాది తర్వాత మాట్లాడుకుందామని అంటున్నారట ప్రత్యర్థులు. కర్మ ఎవర్నీ వదిలపెట్టదంటూ సెటైర్లు కూడా వస్తున్నాయి. ఏదా నియోజకవర్గం? ఎవరా పోట్ల గిత్తలు? తాడిపత్రి….. పెద్దగా పరిచయం అక్కర్లేని ఈ పేరు వినగానే ముందు గుర్తుకు వచ్చేది హైటెన్షన్ పాలిటిక్స్. ఎందుకంటే… ఏపీ మొత్తం మీద అత్యంత సమస్యాత్మక నియోజకవర్గాల్లో అగ్ర భాగాన ఉంటుంది ఇది. అందుకు ప్రధాన కారణం కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నది స్థానికంగా ఉన్న అభిప్రాయం. వీరిద్దరి మధ్య సాగుతున్న ఆధిపత్యపోరు ఈ నాటిది కాదు. నాలుగు దశాబ్దాల నుంచి రెండు కుటుంబాల మధ్య వార్ నడుస్తోంది. వైసీపీ హయాంలో జేసీకి అడుగడుగునా ఇబ్బందులు ఎదురయ్యాయి. మున్సిపల్ ఛైర్మన్ హోదాలో ప్రభాకర్‌రెడ్డి, నాడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి… ఇలా ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుతో నిత్యం తాడిపత్రి రణరంగంగా కనిపించేది. ఈక్రమంలో జేసీ ప్రభాకర్ రెడ్డి మీద చాలా కేసులు పడ్డాయి. కట్ చేస్తే… ఐదేళ్లలో సీన్ మారిపోయింది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డి కుమారుడు జేసీ అస్మిత్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. దీంతో మళ్లీ తాడిపత్రి పాలిటిక్స్‌లో జేసీ ఫ్యామిలీది పైచేయి అయింది. అప్పటి నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డిని టార్గెట్ చేయడం అటుంచితే.. అసలాయన్ని నియోజకవర్గంలోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. ఒకటి కాదు రెండు కాదు… ఏకంగా 8నెలల నుంచి ఇదే పరిస్థితి. అసలు దీనంతటికీ కారణం పోలీసులే అన్నది మాజీ ఎమ్మెల్యే వాదన. తాను తాడిపత్రి వెళితే… శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని చెబుతున్నారని, అసలు గత చరిత్ర ఏంటో ఒక సారి చూడాలని అంటున్నారాయన. జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో ఉంటేనే అసలైన లా అండ్ ఆర్డ్ సమస్య వస్తుందని, ఆరు నెలల పాటు ఆయన అక్కడ ఉండకుండా చూస్తే శాంతి భద్రతలు ఆటోమేటిక్‌గా అదుపులోకి వస్తాయన్నది పెద్దారెడ్డి వెర్షన్.
తనని తాడిపత్రి రానివ్వకపోవడమే కాకుండా వైసీపీ శ్రేణుల ఇళ్లకు మునిసిపల్ అధికారులు నోటీసులు ఇస్తున్నారని, జేసీ ప్రభాకర్ రెడ్డి కనుసన్నల్లోనే మునిసిపల్ కమిషనర్ శివరామకృష్ణ పని చేస్తున్నారని ఆరోపిస్తున్నారు పెద్దారెడ్డి. జేసీ అవినీతిపై హై కోర్ట్‌కు వెళ్ళే ప్లాన్‌తో ఉన్నట్టు చెబుతున్నారాయన. అసలు అధికారులే వైసీపీ శ్రేణులను ఊళ్లు వదిలిపోవాలని చెప్పడం ఏంటన్నది మాజీ ఎమ్మెల్యే క్వశ్చన్. అసలు ఇలాంటి రాజ్యాంగాన్ని ఎక్కడైనా చూశారా అంటూ నిలదీస్తున్నారు. అయితే… అదే సమయంలో అందుకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయుల నుంచి కూడా అదే స్థాయిలో కౌంటర్స్ పడుతున్నాయట. ప్రతిసారి పోలీసుల పర్మిషన్ అడుగుతున్నావ్.. నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. రా.. చూసుకుందాం అంటూ సవాల్ చేస్తున్నారట. నీ కొడుకుల్ని ముందు తాడిపత్రి రమ్మను తర్వాతి సంగతి తర్వాత మాట్లాడుకుందాం అంటూ… మీసాలు మెలేస్తున్నట్టు తెలుస్తోంది. గత ఐదేళ్ళలో తాడిపత్రి నియోజకవర్గాన్ని విచ్చలవిడిగా దోచుకొని తిని… ఇప్పుడు విదేశాలకు వెళ్ళి జల్సా చేస్తున్నారని, వస్తే వాళ్ళ సంగతి కూడా తేలిపోతుందని అంటున్నారట. పోలీసులు అభ్యంతరం చెబుతోంది నీకే తప్ప నీ కొడుకులకు కాదుకదా… వాళ్ళని ఎవ్వరూ ఏమీ అనరుకదా…. ముందైతే విదేశాల నుంచి కొడుకుల్ని పిలిపించమంటూ…కేతిరెడ్డి మీదికి జేసీ అనుచరులు కాలు దువ్వుతున్నట్టు చెప్పుకుంటున్నారు. గత ఐదేళ్లలో ఏం చేశావో గుర్తు చేసుకో అంటూ గుర్తు చేస్తున్నారట. ఇలా… మొత్తం మీద కేతిరెడ్డి పెద్దారెడ్డి కుటుంబం తాడిపత్రికి తిరిగి రావడం అన్నది డైలీ సీరియల్‌ని మించిన ట్విస్ట్‌లతో…. అంతకంటే ఎక్కువగా సాగుతోందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఈ సీరియల్‌కి ఎండ్ కార్డ్ ఏ రూపంలో పడుతుందో చూడాలి మరి.