హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఎందుకు పోటీ చేస్తోంది? సరిపడా బలం లేదు, ఓడిపోతామని ముందే తెలుసు… అయినా వెరవకుండా కాలు దువ్వడానికి కారణం ఏంటి? ఎమ్మెల్సీ ఎన్నిక విషయంలో కాషాయ దళం దగ్గర స్పెషల్ స్కెచ్ ఉందా? ఓ పథకం ప్రకారం మజ్లిస్‌తో తలపడాలనుకుంటోందా? ఏంటా పథకం? ఎలా వర్కౌట్ అవుతుందని భావిస్తోంది కమలం? హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగిసింది. ఎంఐఎం, బీజేపీ బరిలో ఉన్నాయి. ఈ ఎమ్మెల్సీ సీట్లో మొత్తం 112 ఓట్లు ఉన్నాయి. మెజార్టీ ఓటర్లు జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లే. ఇందులో బీజేపీ తరపున గెలిచిన వారు 23 మంది. వాళ్ళలో నలుగురు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారు. ఇక ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఎక్స్ అఫిషియో రూపంలో బీజేపీకి ఆరుగురు సభ్యుల బలం ఉంది. అలా మొత్తంగా చూసుకుంటే… బీజేపీ బలం 29గా కనిపిస్తున్నా… అందులో నుంచి పార్టీ మారిన వారిని తీసేస్తే…. కాషాయ దళానికి నికరంగా 25 ఓట్లు ఉన్నాయి. అదే సమయంలో అటు ఎంఐఎంకు 50 మంది సభ్యుల బలం ఉంది. అంటే… బీజేపీకి సరిపడా సంఖ్యా బలం లేకున్నా అభ్యర్థిని పోటీకి పెట్టిందన్నమాట. బలం లేదు, గెలుస్తామన్న కనీస గ్యారంటీ కూడా లేదు. మరి అభ్యర్థిని ఎందుకు నిలబెట్టారయ్యా అంటే… అక్కడ ఉంది అసలు రాజకీయం అంటున్నారు పరిశీలకులు. గెలవకపోయినా ఫర్లేదుగానీ… తమకు ఉన్న బలం కంటే ఎక్కువ ఓట్లు తెచ్చుకోవాలన్నది బీజేపీ వ్యూహంగా చెప్పుకుంటున్నారు. అందుకోసం మజ్లిస్ వర్సెస్ అదర్స్ అన్న ఫీలింగ్ తీసుకువచ్చి ఓ ట్రయల్ వేయాలనుకుంటున్నారట కాషాయ నేతలు. ఎంఐఎంకు వ్యతిరేకంగా ఇతర పార్టీల కార్పొరేటర్స్ అంతా అభ్యర్థికి ఓటేయాలని కోరుతోంది బీజేపీ. అందుకోసం హిందుత్వ సెంటిమెంట్‌ను తెరమీదికి తెస్తోందట. ఆ ఫీలింగ్‌తో స్థానికంగా ఉన్న ఇతర పార్టీల కార్పొరేటర్స్ మీద ఒత్తిడి తెచ్చే వ్యూహం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. హైదరాబాద్‌ను పూర్తిగా మజ్లిస్‌కు అప్పగించొద్దు..
భాగ్యనగరాన్ని రక్షించుకోవాలన్నది బీజేపీ తాజా నినాదంగా తెలుస్తోంది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మజ్లిస్‌కు బానిసలుగా మారాయంటూ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళి… ఆ రెండు పార్టీల కార్పొరేటర్స్‌ని డిఫెన్స్‌లో పడేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. గెలుపు ఓటముల సంగతి తర్వాత….ముందు తమకున్న ఓట్ల కన్నా కొన్ని ఎక్కువ వచ్చినా సరే… అదో అఛీవ్‌మెంట్ అంటున్నారట కాషాయ నాయకులు. అందుకే …. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ నియోజక వర్గం ఓటర్లు ఆత్మసాక్షిగా ఓటు వేయాలని విజ్ఞప్తి చేస్తున్నారట కమలం లీడర్స్. మజ్లిస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు క్షమించరంటూ ఓటర్లుగా ఉన్న కార్పొరేటర్స్‌కి ఎమోషనల్‌గా చెబుతున్నట్టు సమాచారం. ఆ పార్టీకి ఏ రకంగా మద్దతు ఇచ్చినా… ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా పని చేసినట్టేనన్నది కాషాయ పార్టీ వాదన. దీంతో బీజేపీ స్ట్రాటజీ ఏమేరకు వర్కౌట్ అవుతుంది… నిజంగానే తమ పార్టీల అధిష్టానాల్ని కాదని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ కార్పొరేటర్స్ బీజేపీకి ఓటు వేస్తారా అన్న చర్చ మొదలైంది హైదరాబాద్ పొలిటికల్ సర్కిల్స్‌లో. అటు బీఆర్‌ఎస్ మాత్రం ఇప్పటిదాకా తన వైఖరి చెప్పలేదు. ఆ పార్టీకి చెందిన కార్పొరేటర్స్ కొందరు బీజేపీకి ఓటు వేసినా… ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నది లేటెస్ట్ టాక్. పోలింగ్ బూత్‌దాకా వెళ్ళేసరికి పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి మరి.