నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేస్తా? ఆ తర్వాత మీ ఇష్టం. కాంగ్రెస్ హైకమాండ్‌కు పార్టీకే చెందిన ఓ శాసనసభ్యుడు ఇచ్చిన వార్నింగ్ ఇది. కావాలంటే నా ప్లేస్‌లో వేరే కులం నేతని నిలబెట్టి గెలిపిస్తా ఆయనకైనా కేబినెట్ బెర్త్ ఇవ్వమని వేడుకోలు. ఇంతకీ ఆయన పార్టీ పెద్దలకు వార్నింగ్ ఇస్తున్నారా? వేడుకుంటున్నారా? అసలు తనకు ఇవ్వాల్సిందేనని ఏ కేలిక్యులేషన్ ప్రకారం అంత గట్టిగా అడుగుతున్నారు? ఎవరా ఎమ్మెల్యే? ఏమా కథ? తెలంగాణ కేబినెట్ విస్తరణకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం ఓవైపు రకరకాల ఈక్వేషన్స్‌తో కసరత్తు చేస్తోంది. మరోవైపు ఆశావహుల వత్తిళ్లు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయట. మంత్రివర్గానికి ఒక షేప్ తీసుకువద్దామని రాష్ట్ర పెద్దలు సైతం ఆలోచిస్తుండగానే… ఒక రకంగా వార్నింగ్స్ కూడా పెరుగుతున్నాయట. ముఖ్యంగా రాష్ట్రంలోని 43శాతం జనాభా ఉంటున్న ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. ఈ క్రమంలోనే… ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి ఇప్పటికే కాంగ్రెస్ హైకమాండ్ ముఖ్యుల్ని కలిసి తమ జిల్లాకు ప్రాతినిధ్యం కావాలని విన్నవించారట. రాహుల్ గాంధీ, మల్లిఖార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్‌ను కలిసి ఉమ్మడి రంగారెడ్డి నాయకులు వినతిపత్రాలు ఇచ్చారు. ఈ క్రమంలో మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలు పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనకు గనక కేబినెట్‌లో చోటు కల్పించకపోతే… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారాయన. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో తన స్థానంలో మరో సామాజిక వర్గానికి చెందిన వారిని నిలబెట్టి గెలిపిస్తానని కూడా అన్నారు. అప్పుడైనా వాళ్లకు మంత్రి పదవి ఇస్తారా? అంటూ పార్టీ పెద్దల్ని ప్రశ్నించారు. కేవలం రెడ్డిని అన్న కారణంతో…. సామాజి వర్గాల కోణంలో అత్యంత కీలకమైన జిల్లా నుంచి ఉన్న తనకు మంత్రి పదవి ఇవ్వకపోవడం అన్యాయమన్నది ఆయన వాదన. మల్ రెడ్డి రంగారెడ్డి చేసిన ఈ కామెంట్స్ తెలంగాణ కాంగ్రెస్‌లో ఒక రకంగా ప్రకంపనలు రేపుతున్నాయి. తెలంగాణకు గుండెకాయ లాంటి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలు అభివృద్ధి చెందాలన్నదే తన ఆకాంక్ష అని చెప్పుకొస్తున్నారు మల్‌రెడ్డి.
తన జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం తపిస్తున్నామని… ప్రజలు ఎంతో నమ్మకంతో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చారని, వారి నమ్మకాన్ని వమ్ముచేయకుండా ఉండటమే తమ అభిమతమంటూ అనుచరులు, పార్టీ నేతలకు చెబుతున్నారట. పార్టీ లైన్ దాటవద్దన్న కారణంతో తాను అన్ని విషయాలు మాట్లాడలేకపోతున్నానని అంటున్నారు ఎమ్మెల్యే. పార్టీలో కష్టపడి పనిచేసిన వారికి గుర్తింపు ఇవ్వాలని, అధికారంలో లేనప్పుడు పార్టీకి కార్యకర్తలకు అండగా ఉన్న వారికి ఇప్పుడు గుర్తింపు ఇవ్వాలన్నది ఆయన వెర్షన్. కొత్తగా పార్టీలోకి వచ్చిన వారిని గౌరవించాల్సిన అవసరం ఉందని కాని, అదే సమయంలో వాళ్ళ కోసం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డవాళ్ళని విస్మరించడం కరెక్ట్ కాదని వాదిస్తున్నారాయన. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ మరింత బలోపేతం కావడానికి అధిష్ఠానం చొరవ చూపాలని.. కష్టపడి పని చేసే వారిని గుర్తించాల్సిన అవసరం ఉందని హైకమాండ్‌కు చెబుతున్నారు మల్‌రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఒక్క మంత్రి పదవి లేకపోవటం దారుణమని, దానివల్ల అభివృద్ధి ఆగడంతో పాటు పార్టీ బలోపేతానికి కూడా అవకాశం లేకుండా పోతోందంటున్నారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే. మరోవైపు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలంటూ… నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు మొదలుపెట్టారు కొందరు. మంత్రి పదవి రాకుంటే ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తానంటున్న మల్ రెడ్డి వార్నింగ్‌ని కాంగ్రెస్ అధిష్టానం ఎంతవరకు సీరియస్‌గా తీసుకుంటుంది? ఆయనకు ఛాన్స్ ఇస్తుందా లేదా అన్నది తేలాలంటే… కేబినెట్ విస్తరణ ముహూర్తం ఫిక్స్ అయ్యేదాకా ఆగాల్సిందే.