ఏపీ సీఎం చంద్రబాబు మాటలు ఆ ఇద్దరు లీడర్స్ చెవికెక్కడం లేదా? వైసీపీ వాళ్ళకు సాయం చేస్తే… పాముకు పాలు పోసినట్టేనని స్వయంగా పార్టీ అధ్యక్షుడి నోటి నుంచి వచ్చిన మాటల్ని వాళ్ళు లైట్ తీసుకున్నారా? ఎక్కడా కాని పనులు వాళ్ళ దగ్గర అవుతాయంటూ…. వైసీపీ నాయకులు, పాత కాంట్రాక్టర్స్ వాళ్ళ దగ్గరికి క్యూ కడుతున్నారా? కొత్త పైరవీ రాయుళ్ళని పేరుబడ్డ ఆ లీడర్స్ ఎవరు? ఏంటా కథ? వైసీపీకి వాళ్ళకు ఎవరూ సాయం చేయొద్దు…. వాళ్ళకు హెల్ప్ చేస్తే… పాముకు పాలు పోసి పెంచినట్టేనని ఆ మధ్య రెండు సందర్భాల్లో గట్టిగానే అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. ఒకసారి ఉమ్మడి చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో అంటే… మరోవిడత ప్రకాశం జిల్లా మార్కాపురంలో సూటిగా, సుత్తిలేకుండా అదే మాట చెప్పారు చంద్రబాబు. అలా అనడంతోనే వదిలేయలేదాయన. నేను చెబితే వైసీపీ వాళ్ళు తెగ గింజుకుంటున్నారు… ఏం… మా వాళ్ళు.. మీ వాళ్ళతో లాలూచీ పడాల్నా? పార్టీ కోసం ప్రాణాలు పోగొట్టుకున్న కార్యకర్తల కుటుంబాలకు కాకుండా మీకెందుకు పనులు చేయాలని కూడా ఘాటుగా రియాక్ట్ అయ్యారు బాబు. అంతవరకు బాగానే ఉంది. కానీ… కీలక పదవుల్లో ఉన్న టీడీపీ నాయకులకు తమ అధినేత చెప్పిన మాటలు బుర్రెకెక్కాయా అంటే… డౌటే నన్నది ఎక్కువ మంది సమాధానం. ఎందుకంటే…. ఏ రెండు జిల్లాల్లో అయితే ఆయన ఆ మాటలు అన్నారో… అవే జిల్లాల్లో కీలకంగా ఉన్న నేతలు వైసీపీ లీడర్స్‌తో తెరచాటు వ్యవహారాలు నడిపిస్తూ…. దోస్త్ మేరా దోస్త్ అంటున్నారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఉమ్మడి చిత్తూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు నేతలు వైసీపీ వాళ్ళతో కుమ్మక్కై వాళ్లకు పనులు చేయిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిత్తూరు నేత కూడా ప్రకాశం జిల్లాకు చెందినవైరే కావడం ఇక్కడ ఇంకో విశేషం. కందుకూరుకు చెందిన కంచర్ల శ్రీకాంత్ 2009లో టీడీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. 2023లో ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారాయన. ప్రస్తుతం శాసనమండలిలో విప్‌గా కొనసాగుతున్న శ్రీకాంత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ టైంలో కూడా కుప్పం ఇంచార్జ్ గా ఉన్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ప్రాతినిధ్యం లేకపోవడంతో… శ్రీకాంతే అంతా తానై నడిపిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక మరోనేత దామచర్ల సత్య. కొండేపి నియోజకవర్గానికి చెందిన సత్య ఎన్నికలకు ముందు ఉత్తరాంధ్ర జిల్లాల టీడీపీ ఇంచార్జ్ గా ఉన్నారు.
పార్టీ అధికారంలోకి వచ్చాక ఏపీ మారిటైం బోర్డు చైర్మన్ అయ్యారాయన. ఎమ్మెల్యే కాకున్నా…. ఇప్పుడాయన సొంత నియోజకవర్గమైన కొండేపిలో చక్రం తిప్పటంతో పాటు జిల్లాలో కీలక నేతగా మారారట.ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇద్దరు మంత్రులు.. ఓ ఇంచార్జ్ మంత్రి.. ఎమ్మెల్యేలు సహా పలువురు కీలక నేతలు ఉన్నా.. ఈ ఇద్దరు మాత్రం వాళ్ళకు మించి అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని టీడీపీ వర్గాలే గుసగుసలాడుకుంటున్నాయట. జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల దగ్గరకు వెళ్లినా కాని పనులు ఈ ఇద్దరి దగ్గరకు వెళ్తే అవుతాయన్న టాక్ పెరిగిపోవడంతో…. ఇప్పుడు వైసీపీ నేతలు కూడా క్యూ కడుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. స్పెషల్ పవర్ సెంటర్స్‌గా మారిపోయిన వీళ్ళిద్దరి దగ్గరకు వెళితే కాని పనంటూ ఉండదన్న ప్రచారంతో… టీడీపీ వాళ్ళకంటే ఎక్కువగా వైసీపీ వాళ్లే సీక్రెట్ మీటింగ్స్ పెడుతున్నారని, పనులు కూడా అలాగే జరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. కంచర్ల శ్రీకాంత్ కు ఎడ్యుకేషనల్ బ్యాక్ గ్రౌండ్ ఉండటంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయనకు పరిచయం ఉన్న విద్యాసంస్దల అధినేతలు ఏ పనులు కావాలన్నా వచ్చేస్తున్నారట. ఆయన కూడా పార్టీలతో సంబంధం లేకుండా… తన దగ్గరకు వచ్చింది వైసీపీ వాళ్ళయినా సరే… ఉదారంగా, ఇంకా చెప్పాలంటే కాస్త పెద్ద మనసుతో పనులు చేసి పెడుతున్నారంటూ సెటైరికల్‌గా మాట్లాడుకుంటున్నాయి జిల్లా రాజకీయ వర్గాలు. ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో వైసీపీలో అత్యంత కీలకంగా వ్యవహరించిన ఓ విద్యాసంస్దల అధినేత ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు శ్రీకాంత్ దగ్గరకు పనుల కోసం వెళ్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వీరితో పాటు ప్రధానంగా చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వైసీపీ నాయకులు క్యూలు కడుతున్నట్టు సమాచారం. ఇక దామచర్ల సత్య దగ్గర కూడా ఇంచుమించు అదే పరిస్థితి ఉందట.గత ప్రభుత్వ హయాంలో పనులు చేసి బిల్లులు పెండింగులో ఉన్న వైసీపీ వాళ్ళు కూడా సత్య దగ్గరికి వచ్చి వెళ్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆ ఇద్దరి దగ్గరకు వెళ్తే చాలు…. ఏ పని అయినా అవుతుందన్న టాక్ ఫిక్స్ కావటంతో రోజురోజుకూ గిరాకీ కూడా పెరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో… టీడీపీ నేతలు కొత్త పవర్ సెంటర్స్ పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట. మరోవైపు ఒంగోలులో దామచర్ల సత్య సోదరుడు జనార్ధన్ ఎమ్మెల్యేగా ఉన్నారు. చివరికి ఆయన కూడా ఒంగోలులో సత్య ఆఫీస్ ఏర్పాటు చేసుకోవడాన్ని వ్యతిరేకించారట. ఈ ఇద్దరి వ్యవహారాలను గమనిస్తున్న టీడీపీ నేతలు చాలామంది లోలోపల రగిలిపోతూ సందర్భం కోసం చూస్తున్నట్టు సమాచారం. అసలు చంద్రబాబు చెప్పిందేంటి? వీళ్ళు చేస్తోందేంటి? వీళ్ళకు పార్టీ ముఖ్యమా? లేక వైసీపీ వాళ్ళకు పనులు చేసి పెట్టడం ముఖ్యమా అంటున్నారట. ఇంకొందరైతే… కాస్త ఘాటుగానే… నాటు భాషలో రియాక్ట్ అవుతున్నట్టు సమాచారం. పార్టీ పెద్దలకు చాలా దగ్గర అని ప్రచారం చేసుకునే వీళ్ళిద్దరూ వైసీపీ వాళ్ళను ముద్దు చేస్తూ… నెత్తినెక్కించుకోవడాన్ని సహించబోమని, అధ్యక్షుడి దృష్టికి తీసుకువెళ్తామని అంటున్నారట కొందరు. ఈ ఎపిసోడ్ ఏ టర్న్ తీసుకుంటుందో చూడాలి మరి.