ఆ ఉమ్మడి జిల్లాలో తగ్గదే…లే… అంటున్నారట తెలుగు తమ్ముళ్లు. మీరు మర్చిపోదామనుకున్నా… మేం పోనివ్వమంటూ… సోషల్ మీడియా తవ్వకాలు జరిపి పాత వీడియోల్ని వెదికి పట్టుకుని మరీ కొత్తగా సర్క్యులేట్ చేస్తున్నారట. నాడు మమ్మల్ని ఓ ఆటాడేసుకున్న వాళ్ళని అంత తేలిగ్గా వదులుతామా అని అంటున్నారట. ఏ జిల్లాలో ఉందా పరిస్థితి? టీడీపీ లీడర్స్ తలలు పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది? పవర్‌లోకి వచ్చాక పగ…పగ… అని రగిలిపోతున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు. ఎందుకయ్యా బాబూ… మరీ అంత కసి…. జరిగిందేదో జరిగిపోయిందిగా… ఇప్పుడు మీరన్నా ట్రెండ్ మార్చండని ఎవరన్నా అంటే….. మీకేం తెలుసయ్యా నొప్పి? పడ్డవాళ్ళకు మాకు మాత్రమే తెలుస్తుందని అంటూ ఘాటుగానే రిప్లయ్ ఇస్తున్నట్టు సమాచారం. పైగా తమ పార్టీ అధిష్టానం ఎక్కడ లైట్ తీసుకుంటుందోనన్న అనుమానంతో…పాత వీడియోలన్నిటినీ వెతికి వెతికి మరీ తీసుకొచ్చి సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారట. నాయకులు వదిలేసినా… మేం వదలబోమంటూ…. పాత వీడియోల్ని పదేపదే తిప్పుతూ… పార్టీ ముఖ్యుల మీద వత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నాడు ఇబ్బంది పెట్టిన వారిని మర్చిపోయారా అంటూ జిల్లా టీడీపీ నాయకుల్ని కూడా హెచ్చరిస్తున్నారట. పుంగనూరులో ఓ మాజీ రౌడీషీటర్ వ్యవహారం, మాజీ మంత్రి రోజా అవినీతి అంటూ సోషల్ మీడియా తవ్వకాలు మొదలుపెట్టారు చిత్తూరు తమ్ముళ్ళు. నాడు చంద్రబాబును అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ…సైకిల్ యాత్ర చేస్తున్న శ్రీకాకుళం జిల్లా టీడీపీ కార్యకర్తల్ని పుంగనూరు నియోజకవర్గం సుగాలిమిట్ట దగ్గర అడ్డుకుని పచ్చి బూతులు తిడూతూ… వాళ్ళు వేసుకున్న పసుపు చొక్కాల్ని విప్పించాడు ఓ వైసీపీ నాయకుడు. అతన్ని అరెస్ట్ చేయాలన్న డిమాండ్ అప్పట్లో గట్టిగా వినిపించడంతో… కేసుపెట్టి వదిలేశారు చిత్తూరు జిల్లా పోలీసులు. ఇక గతంలో శ్రీకాళహస్తిలో పనిచేసిన సీఐ అంజు యాదవ్ స్టోరీ కూడా దాదాపుగా అంతే. హోటల్ నడుపుతున్న మహిళను అర్ధరాత్రి కొడుతూ స్టేషన్‌కు తీసుకువెళ్ళడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం మొదలైంది.. ఇక టిడిపి నేతలను,జనసేన కార్యకర్తను బహిరంగంగా కొట్టడంపై పవన్ కళ్యాణ్ నేరుగా తిరుపతికి వచ్చి ఎస్పీకి ఫిర్యాదు చేసినా… చర్యలు మాత్రం తీసుకోలేదని, ఇప్పుడా పాత వీడియోలన్నిటినీ మరోసారి సర్క్యులేట్ చేస్తూ… రచ్చ చేస్తున్నారట టీడీపీ కార్యకర్తలు. చూడండి… వాళ్ళు అంత చేస్తే… తొమ్మిది నెలల్లో మీరేం చేస్తున్నారంటూ… తమ నాయకుల మీద వత్తిడి పెంచుతున్నట్టు తెలిసింది. ఇక నగరిలో లోకేష్ పాదయాత్ర సమయంలో మాజీ మంత్రి రోజాతోపాటు అప్పటి సిఐ వాసంతి టిడిపికి చుక్కలు చూపించారు. మంత్రిని మాజీ మంత్రి తీవ్ర స్థాయిలో తిట్టడంతో రగిలిపోయిన తెలుగు మహిళలు నగరిలో ఉన్న రోజా ఇంటికి చీర, జాకెట్ తీసుకునివెళ్ళి నిరసన తెలిపారు. అప్పుడు వాళ్ళని కొట్టుకుంటూ నగిరి పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు సిఐ వాసంతి.
రోజా ఇంట్లోకి చొరబడేందుకు యత్నించారంటూ 30మంది టీడీపీ మహిళలపై కేసులు పెట్టడం అప్పట్లో కలకలం రేపింది. దీనిపై అప్పట్లో స్పందించిన లోకేష్… అక్రమ కేసులు పెట్టిన సీఐ వాసంతిని వదిలే ప్రసక్తే లేదంటూ స్వయంగా ప్రకటించారు. అయితే… రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… వాసంతికి జీడీ నెల్లూరు సీఐగా పోస్టింగ్ ఇవ్వడంపై రగిలిపోతున్నారట తమ్ముళ్ళు. మహిళలని కూడా చూడకుండా కొట్టి… కేసులు పెట్టిన ఆ సీఐకి గంగాధరనెల్లూరు ఎమ్మెల్యే ధామస్ ఎలా పోస్టింగ్ ఇప్పిస్తారంటూ…. సోషల్ మీడియా వేదికగా కడిగిపారేస్తున్నారట. అలాగే నగరిలోనే పనిచేసి ఇబ్బంది పెట్టిన అప్పటి ఎస్ ఐ చిరంజీవి విషయాలు బయటకు తీస్తున్నట్టు తెలిసింది. ఇక నాడు చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలో అప్పటి పలమనేరు డిఎస్పీ సుధాకర్ రెడ్డి చేసిన హంగామా అంతా అంతా కాదంటూ ఆయన వీడియోలను ఓ రేంజ్ లో తిప్పేస్తున్నారట తమ్ముళ్లు. ఏకంగా చంద్రబాబునే కుప్పంలోకి రానివ్వకుండా గొడవ పెట్టుకున్న డిఎస్పీ వీడియోలను సర్క్యులేట్ చేస్తూ… చర్యలు ఎప్పుడని ప్రశ్నిస్తున్నారు. పుంగనూరు అల్లర్లు ఘటనలోని అధికారులను, చంద్రగిరి సిఐలుగా పనిచేసిన సురేంద్ర రెడ్డి, రాజశేఖర్ వేధించారంటూ లిస్ట్ చదువుతున్నారట. అధికారులతో ఆగకుండా మాజీ మంత్రి రోజా మాటలు, పెద్దిరెడ్డి లిక్కర్, ల్యాండ్ స్కామ్ అంటూ ప్రతి వీడియోను ఉధృతంగా రీ సర్క్యులేట్ చేస్తుండటంతో… ఏం చేయాలో అర్ధంగాక చిత్తూరు జిల్లా టీడీపీ నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. ఇది మరీ శృతి మించితే పార్టీకే తలనొప్పులన్న టాక్ కూడా నడుస్తోంది జిల్లాలో. అధికారులు తప్పులు చేశారన్నది నిజమేనని, వాటిని ఆధారాలతో నిరూపించి చర్యలు తీసుకోవడానికి కాస్త టైం పడుతుందని, అప్పటిదాకా ఓపికపట్టాలని సర్దిచెబుతున్నట్టు సమాచారం. అలాకాకుండా వైసిపి తరహాలోనే అడ్డదిడ్డంగా సస్పెండ్లు చేసుకుంటూపోతే…ప్రయోజనం ఏముంటుందని నచ్చజెపుతున్నారట. ఆవేశం వద్దు అలోచన ముద్దు అని నేతలు అంటుంటే…. కార్యకర్తలు మాత్రం అదంతా మాకు తెలియదబ్బాయ్… బుల్లెట్ దిగిందా లేదా అన్నదే ముఖ్యం అంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం మీద మీరు మర్చిపోయినా…. మేం మాత్రం గుర్తు చేస్తూనే ఉంటామంటూ ఒకింత సీరియస్‌గానే ఉన్నారట చిత్తూరు టీడీపీ కార్యకర్తలు.