ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకి, మరో ప్రోటోకాల్ పోస్ట్‌లో ఉన్న నాయకుడికి మధ్య ఒకరకంగా యుద్ధమే జరుగుతోందా? పాత కొత్త వైరం ముదురు పాకాన పడిందా? ఇద్దరి వర్గపోరులో పార్టీ పెద్దలు సైతం తలబాదుకోవాల్సి వస్తోందా? ఏకంగా రాష్ట్ర మంత్రి ముందే రచ్చ చేసుకున్న ఆ ఇద్దరు ఎవరు? ఏదా అసెంబ్లీ నియోజకవర్గం? వనపర్తి కాంగ్రెస్ వార్ పీక్స్ చేరుతోందట. నియోజకవర్గంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డి మధ్య పంచాయతీ ఓ రేంజ్‌లో నడుస్తున్నట్టు చెబుతున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సీనియర్ నేత, మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాదని… బీఆర్ఎస్ నుంచి పార్టీలోకి వచ్చిన మేఘారెడ్డికి టిక్కెట్ ఇచ్చింది కాంగ్రెస్ అధిష్టానం. దీనిపై అప్పట్లో రకరకాల విశ్లేషణలు వచ్చాయి. ఎవరికి నచ్చిన ఈక్వేషన్స్ వాళ్లు చెప్పేసుకున్నారు. వాటన్నిటి సంగతి ఎలా ఉన్నా… ఎన్నికల్లో విజయం సాధించి అసెంబ్లీలో అడుగు పెట్టారు మేఘారెడ్డి. ఆ తర్వాత చిన్నారెడ్డికి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి కట్టబెట్టింది ప్రభుత్వం. అంత వరకు బాగానే ఉన్నా… ఆ తర్వాతే అసలు సమస్య మైదలైందట. ఎమ్మెల్యే మేఘారెడ్డి నియోజకవర్గంపై పూర్తి స్థాయి పట్టు బిగిస్తుండటం……తన పట్టు తగ్గకుండా చిన్నారెడ్డి జాగ్రత్త పడటంతో… నియోజకవర్గంలో నువ్వా నేనా అన్నట్టుంది కాంగ్రెస్ రాజకీయం. ఎవరికి వారు తమ మాటే నెగ్గాలన్న పట్టుదలగా ఉండటంతో… ఎప్పటికప్పుడు పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. ఇక తాజాగా…ఈ నెల 22న వనపర్తి టూర్‌కు వచ్చారు మంత్రి తుమ్మల. ఆ సందర్భంగా మరోసారి వీరిద్దరి మధ్య వివాదం చెలరేగింది . గోపాల్ పేట, ఖిల్లా ఘనపురం మార్కెట్ ల ఏర్పాటు, స్థల ఎంపిక విషయంలో మంత్రి ముందు నిరసనకు దిగిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు…
ఎమ్మెల్యే మేఘారెడ్డి పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి మాటున ఎమ్మెల్యే అవినీతికి పాల్పడుతున్నారని, మార్కెట్ స్థలాల ఎంపిక వెనక…ఎమ్మెల్యే అనుచరుల భూముల ధరలు పెంచుకునే ప్లాన్ ఉందంటూ బాంబ్ పేల్చారు. నేను పెట్టిన రాజకీయ భిక్షతో మేఘారెడ్డి ఎమ్మెల్యే అయ్యారంటూ … బహిరంగంగానే మాట్లాడటం కలకలం రేపింది.ఇక ఇదే సమయంలో మేఘారెడ్డి అండ్ టీమ్ కూడా గట్టిగా కౌంటర్ ఇస్తోందట. చిన్నారెడ్డి అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, బీఆర్‌ఎస్ ప్రతినిధిలా వ్యవహరిస్తున్నారంటూ…తీవ్ర స్థాయిలో విరుచుకు పడుతున్నారట. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట్రం మొత్తానికి కాకుండా… వనపర్తి కి మాత్రమే పరిమితమై డిస్టబెన్స్‌గా ఉన్నారని మండి పడుతోందట ఎమ్మెల్యే వర్గం. ఇదే సమయంలో సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్‌గా అనుభవం ఉన్న చిన్నారెడ్డి వ్యవహారశైలి మీద కూడా చర్చ జరుగుతోందట పార్టీ సర్కిల్స్‌లో. అంత సీనియర్ నాయకుడు కూడా మంత్రి కార్యక్రమాన్ని అడ్డుకొని నిరసన తెలపడం పై కాంగ్రెస్ వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయట. ఇదేనా ఆయన అనుభవం, ఇదేనా సీనియర్ నాయకుడి క్రమశిక్షణ అంటూ ఎమ్మెల్యే వర్గం కూడా వీలైనంత ఎక్కువ చర్చ జరిగేలా చూస్తోందట. ఒక వేళ మార్కెట్ స్థలాల ఎంపిక విషయం లో అబ్జెక్షన్స్ ఉంటే జీవో వచ్చినప్పుడే ఆ అంశాన్ని మంత్రులు, ముఖ్య మంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఉండొచ్చు కదా… ఇప్పుడు రోడ్డెక్కి రచ్చ చేయడం తగునా అన్నది ఎమ్మెల్యే వర్గం క్వశ్చన్. మరో పక్క గతంలో చిన్నారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే గా ఉండి, నిరంజన్ రెడ్డి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగిన సమయంలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు రాష్ట్రానికా, వనపర్తికా అంటూ చిన్నారెడ్డి ప్రశ్నించిన వీడియో ను వైరల్ చేస్తున్నారట ప్రస్తుత ఎమ్మెల్యే అనుచరులు. ఇప్పుడా ప్రశ్న చిన్నారెడ్డి కి వర్తించదా అని ప్రశ్నిస్తోంది మేఘారెడ్డి టీమ్. ఇలా… మొత్తంగా వనపర్తి వార్ ఓ రేంజ్‌కి చేరుతోంది. పార్టీ పెద్దలు దీన్ని ఎలా సెట్ చేస్తారో చుడాలి.