తెలంగాణలో త్వరలో జరగబోయే ఎమ్మెల్సీల ఎన్నికలకు పార్టీలన్నీ రెడీ అవుతున్నాయి. కాంగ్రెస్, బీజేపీ నేతలు..ఎవరి వ్యూహాలో వారి మునిగిపోయారు. మరి ప్రతిపక్ష బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి ? గ్రాడ్యూయేట్, టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? లేదంటే ఎన్నికలకు దూరంగా ఉంటుందా ?
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు సంబంధించిన పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ సారి పోటాపోటీగా ఎన్నికలు జరుగుతాయన్న ప్రచారం నడుస్తోంది. 2019 మార్చిలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో 17 మంది పోటీ పడ్డారు. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన జీవన్‌రెడ్డి విజయం సాధించారు. జీవన్‌రెడ్డి పదవీ కాలం 2025 మార్చి 29 తో ముగియనుంది. ఈ ఎన్నికలకు సంబంధించి ఎన్‌రోల్‌మెంట్ చేసుకోవడానికి ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఓటర్ల నమోదు ప్రక్రియ మరో రెండు రోజుల్లో ముగియనుంది. గతంతో పోలిస్తే ఈసారి పట్టభద్రుల ఓటర్ల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2019లో మొత్తం 1,96,321 ఓట్లు ఉండగా, ఈ సారి ఆ సంఖ్య 2.5 లక్షలకు పైగా చేరొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆయా పార్టీల తరపున టికెట్ ఆశిస్తున్న నేతలు…భారీగా ఎన్‌రోల్ మెంట్ చేయిస్తున్నారు. పట్టభద్రుల ఓటర్ల నమోదుపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రధాన రాజకీయ పార్టీలు…ఓటర్లు నమోదు దూసుకెళ్తున్నాయి. అయితే గులాబీ పార్టీలో మాత్రం ఎలాంటి ఉలుకుపలుకు లేకుండా పోయిందని నేతలు మాట్లాడుతుకుంటున్నారు. మరోవైపు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలనుకునే నేతలు…ఓటర్ల నమోదును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. వారికి బీఆర్ఎస్ నుంచి మాత్రం ఎవరో ఒకరిద్దరు ఎన్ రోల్ చేయిస్తున్నారట. దీన్ని ఎవరు సీరియస్‌గా తీసుకోవడం లేదని సొంత పార్టీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
గత ఎన్నికల సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ అధికారంలో ఉంది. అయినప్పటికీ పట్టభద్రుల ఎన్నికల్లో పార్టీ మద్దతుతో పోటీ చేసిన అభ్యర్థి ఓడిపోయారు. అధికారంలో ఉన్న సమయంలోనే ఓటమి పాలయిన బీఆర్ఎస్…ప్రస్తుతం ప్రతిపక్షానికే పరిమితం అయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తుందా ? లేదా ? అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకవేళ పోటీ చేయాలని అనుకుంటే…పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో క్రియాశీలకంగా వ్యవహరించి ఉండేది. అయితే శాసనమండలి ఎన్నికల గురించి…బీఆర్ఎస్ పార్టీలో ఎలాంటి సప్పుడు లేదు. దీంతో ఓటర్ల నమోదు కోసం ఖర్చు చేస్తున్న ఆశావహ నేతలు…ప్రస్తుతం టికెట్ వస్తుందో లేదోనని వెనుకడుగు వేస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్…ఏది చేసినా అది సస్పెన్స్ గానే ఉంటుంది. ఈ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అని ఆయనకు మాత్రమే తెలుసు. దీంతో కేసీఆర్ మనసులో ఏముందో…పార్టీ నేతలతో పాటు కార్యకర్తలకు అంతుచిక్కడం లేదు. పోటీ విషయంలో ఒక అడుగు వెనుక తగ్గి..తరువాత రెండు అడుగులు ముందుకు వేయొచ్చని అధినేత భావిస్తున్నారా ? బీఆర్ఎస్ ముఖ్యనేతలు ప్రాతినిధ్యం వహించే…కరీంనగర్, మెదక్ జిల్లాలో పట్టభద్రుల స్థానానికి అభ్యర్థిని నిలబెట్టలేక పోతే ఎలా ? క్యాడర్‌లో మరింత నైరాశ్యం పెరగదా ? అని కార్యకర్తలు చర్చించుకుంటున్నారు.