భద్రాద్రి జిల్లాలో ఇసుక పేరుతో ఏదేదో జరిగిపోతోందా? శాండ్ పాలిటిక్స్ సలసల కాగుతున్నాయా? బీఆర్‌ఎస్ హయాంలో చక్రం తిప్పిన కాంట్రాక్టరే ఇప్పుడు కూడా హవా నడిపిస్తున్నాడా? ఇసుక ర్యాంప్‌ల పేరుతో అక్కడేం జరుగుతోంది? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇసుక బంగారంతో సమానం. ఇక్కడి నుంచి ప్రభుత్వానికి కోట్ల రూపాయల ఆదాయం వచ్చేది. కానీ ప్రస్తుతం రీచ్‌ల అలాట్‌మెంట్ జరక్కపోవడంతో…అక్రమ రవాణా అడ్డగోలుగా జరిగిపోతోంది. ఇసుక వ్యాపారంలో గిరిజనుల్ని ప్రోత్సహించేలా…. సొసైటీలకు అప్పగిస్తూ ఉమ్మడి రాష్ట్రంలో నిర్ణయం తీసుకున్నారు. కానీ… వాటి వెనకున్నదంతా బడా కాంట్రాక్టర్సే అన్నది బహిరంగ రహస్యం. అయితే… రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… గత 15 నెలల నుంచి పాత అనుమతులు రద్దయ్యాయి. కానీ… ఇటీవల భద్రాద్రి జిల్లాలో ఉన్న 17 ఇసుక ర్యాంపుల్ని ఒక మాజీ మంత్రి అనుచరులకు ఇచ్చినట్టే ఇచ్చి వెంటనే రద్దు చేశారు. కొత్త ఇసుక పాలసీ ప్రకటిస్తామని అన్నారు. కానీ… ఆ రద్దయిన 17లో ఓ నాలుగు ర్యాంపులు మాత్రం అనధికారికంగా నడుస్తున్నాయట. ఇదీకూడా బీఆర్‌ఎస్ హయాంలో చక్రం తిప్పిన వాళ్లే నడిపిస్తున్నారట. మణుగూర్‌లోని ఓ ర్యాంప్ దగ్గర అంతకు ముందే భారీగా ఇసుక డంప్ చేయగా.. పాత కాంట్రాక్టర్‌కే దాన్ని అప్పగించారట. అది పేరుకే డంప్‌గానీ… ఆ పేరుతో గోదావరిలోని ఇసుకను కూడా తోడేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. సదరు కాంట్రాక్టర్‌కు ఇప్పటికీ బీఆర్‌ఎస్ ముఖ్యులతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఎమ్మెల్సీ కవిత ఇటీవల ఖమ్మం టూర్‌కు వచ్చినప్పుడు హడావిడి అంతా ఆయనదేనని చెప్పుకుంటున్నారు. అదే కాంట్రాక్టర్‌కు చెందిన మనుషులు అన్నారం ర్యాంప్ నుంచి ఇసుకను తరలిస్తుండగా సమీపంలోని గ్రామస్తులు అడ్డుకున్నారు. దాంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఎంటరైపోయి… లారీలను విడిపించారట. కాంగ్రెస్ ప్రభుత్వంలో… బీఆర్‌ఎస్‌కు అనుకూలుడైన కాంట్రాక్టర్ విషయంలో అంత సాఫ్ట్ కార్నర్ ఏంటన్న చర్చ జరుగుతోందట.
ఇక్కడ చెప్పుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే… ఈ వ్యవహారాన్ని బీఆర్‌ఎస్ నాయకులే తప్పుపడుతున్నారట. పోలీసులే దగ్గరుండి ఇసుక లారీలను ఎలా పంపిస్తారని సాక్షాత్తు బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నిస్తున్నారు. ఒకరిద్దరు అధికార పార్టీకి చెందిన వారిని కలుపుకుని సదరు బీఆర్‌ఎస్ కాంట్రాక్టర్ చక్రం తిప్పుతున్నట్టు ప్రచారం ఉంది. అసలు గులాబీ పార్టీ పవర్‌లో ఉన్నప్పుడైతే…అతగాడి అరాచకాలకు అడ్డే లేదట. అప్పట్లో ఆయనకు చెందిన ఇసుక లారీని ఒక సీఐ అరగంట పాటు ఆపితే…. అదే రోజు రాత్రి ఆ సీఐని ట్రాన్స్‌ఫర్ చేయించారట. అంతే కాదు… ఆ మాజీ మంత్రి అండ చూసుకుని ఆ కాంట్రాక్టర్ ఇసుక తవ్వే ఏరియాల్లో బీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిదులను కూడ లెక్క చేయలేదట. ఆ కారణంతోనే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ధర్నాలు జరుగుతున్నాయా అని మాట్లాడుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే…. భద్రాచలం నియోజకవర్గంలోని చర్ల మండలంలో వీరాపురం, మొగళ్లపల్లి ఇసుక ర్యాంప్‌లు పని చేస్తున్నాయి. వాటికి ఈ మధ్యనే పర్మిషన్స్ వచ్చాయి. సీతమ్మ బ్యారేజి ఆనకట్ట సిల్ట్ తొలగించే క్రమంలో వాటికి అనుమతులు ఇచ్చారు. అయితే ఇక్కడే ఓ డౌట్ కొడుతోంది ఎక్కువ మందికి. బ్యారేజి పనులు నిలిచి పోయి ఏడాది దాటింది. అలాంటి చోట ఇప్పుడు సిల్ట్ తీసే పేరుతో పర్మిషన్స్ ఇవ్వడం ఏంటో అర్ధం కావడం లేదని అంటున్నారు. ఈ రెండు ర్యాంపుల కు సంబందించిన కాంట్రాక్టర్ లు మాత్రం ఆనాడు బీఆర్ఎస్ లో పని చేసిన వారేనట. బీఆర్ఎస్ నుంచి మారిపోయి కాంగ్రెస్ కండువా వేసుకుని ర్యాంపుల్లో రఫ్పాడిస్తున్నారట. దీంతో సిసలైన కాంగ్రెస్ నాయకులు రగిలిపోతున్నట్టు తెలిసింది. మొత్తం మీద భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇసుక రాజకీయం యమా రంజుగా నడుస్తోందని అంటున్నారు పరిశీలకులు.