ప్రత్యర్థి బలంగా ఉన్న నియోజకవర్గంలో… మరింత సమన్వయంతో పని చేయాల్సిన చోట ఆ టీడీపీ లీడర్స్ ఇద్దరూ ఇగోలకు పోతున్నారా? చివరికి నువ్వెంత అంటే… నువ్వెంత అనుకోవడమేగాక వార్నింగ్స్ ఇచ్చుకునేదాకా వెళ్లిందా? పార్టీ పెద్దలు తలంటినా…. మా దారి మాదేనన్నట్టుగా ఉన్నారా? వీళ్ళ మధ్య కేడర్ నలిగిపోతున్న పరిస్థితి ఏ నియోజకవర్గంలో ఉంది? ఎవరా ఇద్దరు నాయకులు? పులివెందుల పాలిటిక్స్‌లోకి వైఎస్ ఫ్యామిలీ ఎంటరయ్యాక మరో వ్యక్తి గెలిచిన దాఖలాలు లేవు. అలాంటి చోట మరింత సమన్వయంతో పనిచేయాల్సిన టీడీపీ నేతలు ఇద్దరూ… వ్యక్తిగత ఇగోలకు పోయి ఇంకా దిగజార్చుతున్నారన్న టాక్ నడుస్తోంది ఉమ్మడి కడప రాజకీయ వర్గాల్లో. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ, నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి మధ్య వార్ తారాస్థాయికి చేరిందట. దీంతో క్యాడర్ ఎటువైపు ఉండాలో తెలియక గందరగోళపడుతున్నట్టు సమాచారం. ఇప్పటికే రెండుసార్లు బీటెక్ రవి అనుచరులు రాంగోపాల్ రెడ్డికి, ఆయన వర్గానికి వార్నింగ్స్ ఇచ్చారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో జగన్ వైనాట్ 175 అంటే… టిడిపి అధినేత చంద్రబాబు వైనాట్ పులివెందుల అన్నారు. ఇక రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చాక… పులివెందులని అంత తేలిగ్గా వదలకూడదన్న ఉద్దేశ్యంతో ఉందట టీడీపీ అధిష్టానం. అందుకే ఇక్కడి నేతలకు ప్రాధాన్యం ఇస్తున్నా… వాళ్లు మాత్రం కుమ్ములాటలతో టైం పాస్ చేస్తున్నారన్నది కేడర్ అసంతృప్తి. ఇటీవల నియోజకవర్గంలో ఉద్యోగాల విషయమై రాంగోపాల్ రెడ్డి, బీటెక్ రవి మధ్య విభేదాలు తలెత్తాయట. వేంపల్లి త్రిబుల్ ఐటీలో 14 మందికి ఎటువంటి నోటిఫికేషన్ లేకుండానే ఉద్యోగాలు ఇచ్చారట. తను రికమండ్ చేసిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అధికారుల్ని ఆదేశించినట్టు సమాచారం. అయితే…. నేను నియోజకవర్గ ఇన్చార్జిని. నేను చెప్పిన వారికే ఉద్యోగాలు ఇవ్వాలని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి కూడా అధికారులపై ఒత్తిడి తెస్తున్నారట. మొత్తం 14 ఉద్యోగాల్లో 11 పోస్టుల్ని రాంగోపాల్ రెడ్డి అనుచరులకే ఇచ్చినట్టు తెలుస్తోంది. అక్కడే బీటెక్ రవికి మండిపోయిందని అంటున్నారు.
దాంతోపాటు వేంపల్లి పంచాయతీ ఆఫీస్‌లో రాంగోపాల్ రెడ్డి అనుచరులు తొమ్మిది మందికి జాబ్స్ ఇవ్వడంపై కూడా బీటెక్ రవి గుర్రుగా ఉన్నారట. జెండాలు మోసిన కార్యకర్తల కాదని ఇతర పార్టీలకు చెందిన వ్యక్తులకు ఉద్యోగాలు ఇస్తున్నారంటూ అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. అటు రేషన్ డీలర్ల వ్యవహారం కూడా ఎమ్మెల్సీ, మాజీ ఎమ్మెల్సీ చిచ్చు పెట్టిందని చెప్పుకుంటున్నారు. దానికి సంబంధించి తమ వర్గానికి చెందిన ప్రకాష్ అనే వ్యక్తిని బీటెక్ రవి అనుచరులు కిడ్నాప్ చేసి వేధించారంటూ రాంగోపాల్ రెడ్డి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట. ఇలా ఎవరికి వారు ఆధిపత్యం కోసం పోరాడుతూ అసలు పార్టీ వ్యవహారాలను గాలికి వదిలేశారని అంటున్నారు పులివెందుల టీటీపీ కార్యకర్తలు. ఎగస్ట్రాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమంటూ…. బీటెక్ రవి అనుచరులు ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. అసలు రెండు వర్గాలు ఎప్పుడు ఎక్కడ ఘర్షణ పడతాయో అన్నంత టెన్షన్‌గా ఉందట పులివెందుల టీడీపీలో. పరిస్థితి చేజారిపోతోందని గమనించిన అధిష్టానం ఇద్దరికీ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. తాజాగా కదిరి నుంచి పులివెందుల మీదుగా కడప వెళ్ళిన లోకేష్‌కు రెండు వర్గాలు వేరువేరుగా స్వాగతం పలకడం కొసమెరుపు. పార్టీ పెద్దలు వార్నింగ్స్‌తో సరిపెడతారా? లేక ఇద్దర్నీ సెట్ చేస్తారా అన్నది చూడాలంటున్నారు కార్యకర్తలు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు ఎవరి వెనక నడవాలో తమకు అర్ధం కావడం లేదన్నది వాళ్ల బాధ.