పవన్‌కళ్యాణ్ సినిమాల్లోని ట్విస్ట్‌ల కంటే ఎక్కువగా ఆ అసెంబ్లీ అభ్యర్థి ఎంపికలో ఉన్నాయి. సర్వే రిపోర్ట్స్ బాగాలేవని టీడీపీ పక్కనపెట్టిన అభ్యర్థికే ఇప్పుడు జనసేన పిలిచి టీ గ్లాస్ చేతిలో పెట్టి మరీ టిక్కెట్ ఇస్తోంది. ఆయనకే ఇవ్వాలనుకున్నప్పుడు ఇన్నాళ్ళు ఇంటర్వ్యూల పేరుతో రకరకాల లెక్కలు ఎందుకు వేసినట్టు? అసలు టీడీపీ కాదనుకున్న లీడర్ జనసేన అభ్యర్థిగా ఎలా తెర మీదికి వచ్చారు? తెర వెనక ఏం జరిగింది? ఉమ్మడి కృష్ణాజిల్లాలో జనసేన బరిలోకి దిగుతున్న ఒకే ఒక్క అసెంబ్లీ నియోజకవర్గం అవనిగడ్డ. ఇక్కడ అభ్యర్థిని ఫైనల్ చేయటానికి పార్టీ చేసిన కసరత్తు అంతా ఇంతా కాదు. జిల్లాలో మిగతా రెండు పార్టీలు అన్ని స్థానాలకు అభ్యర్థులను ఫైనల్ చేసినా పవన్ మాత్రం అవనిగడ్డను అలానే పెండింగ్ లో పెట్టారు. మొదట బందరు పార్లమెంట్ అభ్యర్థిని ఫైనల్ చేయడం కోసం అవనిగడ్డను ఆపామని చెప్పారు జనసేన నేతలు. ఆ తర్వాత ఆశావహులు ఎక్కువగా ఉన్నారంటూ వారి గురించి సర్వే చేశాక మంచి అభ్యర్ధిని రంగంలోకి దింపుతామని ప్రకటించారు. అవనిగడ్డ కోసం విక్కుర్తి శ్రీనివాస్, బండ్రెడ్డి రామకృష్ణ, బండి రామకృష్ణ పేర్లతో ఐవీఆర్ఎస్ సర్వేలు కూడా చేశారు. కాంట్రాక్టర్ అయిన విక్కుర్తి శ్రీనివాస్ పేరు దాదాపు ఖారారైనట్టు వార్తలు వచ్చాయి. శ్రీనివాస్ ఆర్థిక స్థోమతపై స్క్రీనింగ్ కూడా జరిగిందట. ఆయనతో స్వయంగా పవన్ కల్యాణే పలు దఫాలు భేటీ అయినట్టు తెలిసింది. సీట్ మీకేనని హామీ ఇచ్చేసినట్టు ప్రచారం కూడా జరిగింది. ఆ హడావిడంతా చూసిన జనసేన లీడర్స్, కేడర్ టిక్కెట్ ఆయనకేనని క్లారిటీకి వచ్చేశారట. అయితే అనూహ్యంగా టీడీపీలో ఉంంటూ… టికెట్ దక్కక నిరాశలో ఉన్న మండలి బుద్దప్రసాద్ తెరమీదికి వచ్చారు. టిక్కెట్ హామీతోనే ఆయన పార్టీ కండువా మార్చినట్టు తెలిసింది.
ఇదే ఇప్పుడు లోకల్ కేడర్‌కు మింగుడు పడటం లేదంటున్నారు. కూటమి పొత్తులో భాగంగా ఈ సీటును జనసేనకు ఫైనల్ చేశారు. దీంతో బుద్దప్రసాద్ ను పక్కన పెట్టేసింది టీడీపీ. ఆయన కూడా నిర్వేదంతో కూడిన స్పీచ్ లు, సోషల్ మీడియా పోస్టులు పెట్టారు. డబ్బులున్న వారికే టిక్కెట్లు, డబ్బులకే పార్టీ సీట్లు ఇస్తోందని విమర్శించారు. ఓ దశలో ఆయన వైసీపీలోకి వెళ్తారన్న వార్తలు కూడా వచ్చాయి. బుద్ధప్రసాద్ అనుచరవర్గం మూకుమ్మడిగా రాజీనామాలు చేసింది. ఆయన కూడా ఇక సీట్ లేదనే నిర్ణయానికి వచ్చి పార్టీ నిర్ణయాలపై పరోక్ష కామెంట్స్ చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు మండలి నేరుగా వచ్చి పవన్ పార్టీలో జాయినై టికెట్ టిక్కెట్ తీసుకోబోతున్నారు. దీని వెనుక జనసేన బందర్ ఎంపీ అభ్యర్ధి వల్లభనేని బాలశౌరి ప్రమేయం ఉందన్నది ఇంటర్నల్ టాక్. వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేశారు బాలశౌరి. జనసేన నుంచి ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్న శౌరి మద్దతు కోసం బుద్ధప్రసాద్ ను కలిశారట. తనకు కాకుండా ఎవరికో సీట్ ఇస్తే మద్దతు ఇవ్వబోనని మండలి తెగేసి చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. అటు విక్కుర్తి శ్రీనివాస్‌కి సీటు ఇవ్వడం బాగానే ఉన్నప్పటికీ… బుద్ధప్రసాద్ మద్దతులేకుంటే ఎంపీగా తన గెలుపు కష్టం అవుతుందని బాలశౌరి భావించారట. అందుకే అవనిగడ్డ కోసం బుద్ధప్రసాద్ అభ్యర్ధిత్వాన్ని పరిశీలించాలని జనసేన అధినాయకత్వాన్ని కోరారని, అందుకే ఆ క్రమంలోనే పార్టీ మార్పించి టిక్కెట్ ఇప్పిస్తున్నట్టు తెలిసింది. అయితే నిన్నటి వరకు జనసేనకు అవనిగడ్డకు సీట్ ఇస్తే గెలవదంటూ బుద్ధ ప్రసాద్ వర్గం ప్రచారం చేసిందని, ఇప్పుడు ఆయనకే పార్టీ టికెట్ ఇవ్వటం ఏంటనే ఆవేదన కనిపిస్తోందట జనసేన లోకల్ కేడర్‌లో. 2014లో గెలిచిన మండలి, 2019లో ఓడిపోయారు. సర్వే పరంగా చూసినా బలహీనంగా ఉండటంతోనే టీడీపీ ఆ సీట్ ను జనసేనకు వదిలేసిందన్నది నాటి మాట.మరిప్పుడు అదే బుద్దప్రసాద్ పార్టీ గుర్తు మార్చి పోటీ చేయబోతుండటం ఆసక్తిగా మారింది.