ఆ ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల మధ్యనే మంటలు రేగుతున్నాయా? మాటల తూటాలు ఎట్నుంచి ఎటో టర్న్ అయిపోయి ఎవరెవరికో తగులుతున్నాయా? ఒకరకంగా అందుకు పార్టీ అధిష్టానమే కారణం అవుతోందా? పెద్దల నానబెట్టుడు ధోరణి అగ్గికి ఆజ్యం పోస్తోందా? ఇంతకీ ఎవరా ఎమ్మెల్యేలు? ఎందుకా మంటలు? ఉమ్మడి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని పది అసెంబ్లీ సీట్లకుగాను నాలుగు చోట్ల గెలిచింది కాంగ్రెస్. కానీ… జిల్లాకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు. ముందు నుంచి పార్టీలో ఉన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్‌రావుకు ఖాయమనుకున్నా… అది జరగలేదు. ఇక విస్తరణ విషయంలో అదిగో ఇదిగో అంటూ ఎప్పటికప్పుడు ఊరిస్తూనే ఉంది అధిష్టానం. అది ఆలస్యం అయ్యేకొద్దీ… జిల్లా నేతల మధ్య వివాదాలు పెరుగుతున్నాయంటున్నారు. తమకంటే తమకే మంత్రి పదవి అంటూ రచ్చ చేసుకుంటున్నారు ఆశావహుల అనుచరులు. ఈ క్రమంలో తాజాగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు… జై బాపు- జై భీం- జై సంవిధాన్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. నాలుగైదు పార్టీలు మారిన వారు…ఇప్పుడు మంత్రి పదవుల కోసం ఆరాటపడుతున్నారని, కండువాలు మార్చివచ్చిన వారికి మంత్రి పదవి అడిగే హక్కే లేదంటూ ఆయన అన్న మాటలు లిటరల్‌గా హస్తం పార్టీని షేక్ చేస్తున్నాయట. మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా… ప్రేమ్‌సాగర్‌రావు మాటలు గడ్డం బ్రదర్స్‌కు గట్టిగానే తగిలాయంటున్నారు. మా బలం, బలగం, ప్రజల్లో ఉన్న పలుకుబడితోనే పార్టీలు మారినా సరే గెలిచామని, కాకా కుటుంబం మీదున్న గౌరవంతోనే…స్వయంగా రేవంత్ రెడ్డి ఇంటికొచ్చి మరీ పార్టీలోకి ఆహ్వానించారంటూ కౌంటర్ వేశారు బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్. అలాగే ఆయన సోదరుడు, చెన్నూరు ఎమ్మెల్యే పీఎస్ ఆర్ టార్గెట్‌గా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. అధిష్టానం ఎవర్ని నమ్మితే వాళ్ళకు మంత్రి పదవి వస్తుంది తప్ప… ఎవరో ఏదో చెబితే రాదని కౌంటర్ వేశారాయన. సాక్షాత్తు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మంచిర్యాలలో నిర్వహించిన సమావేశంలోనే పార్టీలు మారిన నేతలంటూ ప్రేమ్‌సాగర్‌రావు అనడంతో…వారించే ప్రయత్నం చేశారట శ్రీధర్ బాబు.
అయితే… ఆయన తన మనసులోని ఆవేదనను చెప్పుకున్నారన్న మాటలు వినిపిస్తున్నాయి. కానీ… గడ్డం సోదరులు మాత్రం ఈ విషయంలో సీరియస్‌గానే ఉన్నట్టు తెలుస్తోంది. అదే సమయంలో ఇప్పుడు అసలీ మాటలు ఎందుకు వచ్చాయి? విస్తరణలో ఆదిలాబాద్ జిల్లాకు ఖచ్చితంగా ఒక పదవి ఇవ్వాలి కాబట్టి ఆయనకు ఏమన్నా లీకులు వచ్చాయా అన్న చర్చ జరుగుతోంది రాజకీయ వర్గాల్లో. మంత్రివర్గ విస్తరణ ప్రస్తావన ఎప్పుడు వచ్చినా… అందులో గడ్డం సోదరుల పేర్లు రావడం, ప్రేమ్ సాగర్ రావ్ పేరు అస్సలు వినిపించకపోవడం వల్లే.. ఆయన అలా ఫ్రస్ట్రేట్ అయి ఉండవచ్చంటున్నారు కొందరు. లాయాల్టీని పరిగణనలోకి తీసుకుని ప్రాధాన్యం ఇవ్వాలన్నది ఒకరి వాదన అయితే… అసలు తమ కుటుంబమే పార్టీకి బ్రాండ్ అని, తమకే మంత్రి పదవి కావాలని చెప్పకనే చెబుతోంది గడ్డం ఫ్యామిలీ. అయితే… ఎవరికి వారు పదవి కోసం ఆరాటపడటంలో తప్పులేదుగానీ…..తమకు పదవి కోసం ఇతరుల మీద దుమ్మెత్తి పోయడమనేది తప్పుఅంటూ మరో వర్గం వాదిస్తోందట. ఇన్నాళ్లు ఎవరి గాడ్ ఫాదర్స్ చుట్టూ వాళ్ళు తిరిగి నాకో బెర్త్ కావాలంటూ ప్రయత్నాలు చేసుకోగా…. ఇప్పుడు బాహాటంగానే విమర్శించుకోవడంతో రచ్చ రంబోలా అవుతోంది. ఆ రోజుకు ఎవరు ఎవరికి ఎర్త్ పెడతారో? ఉమ్మడి జిల్లా నుంచి సైరన్ కారెక్కేది ఎవరో చూడాలి మరి. మొత్తంగా పార్టీ అధిష్టానం ఎంత నానిస్తే…. అంత ఎక్కువ రచ్చ అవుతుందన్న వాదన మాత్రం బలపడుతోంది.