ఆ జిల్లాలో గులాబీ పార్టీ పూర్తిగా ఖాళీ అవబోతోందా? ఈపాటికే జరిగిపోవాల్సిన పనికి జస్ట్… ఆషాఢం అడ్డొచ్చిందా? శ్రావణ శుభ ఘడియలు చూసుకుని మరీ… కారులోంచి కాలు కింద పెట్టాలనుకుంటున్న ఆ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరు? కాంగ్రెస్ గూటికి చేరడానికి వాళ్ళు వేసుకుంటున్న లెక్కలేంటి? జరుగుతున్న ప్రచాకం ఏంటి? 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు పవర్ పోయినా… ఆ పార్టీ పట్టు నిలుపుకున్న నియోజకవర్గాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లా అలంపూర్ ఒకటి. కారు పార్టీ అభ్యర్ధి విజయుడుకి పట్టం కట్టారు ఇక్కడి ఓటర్లు. సిట్టింగ్ ఎమ్మెల్యే అబ్రహంకు టికెట్ దక్కకుండా పావులు కదిపి… తన అనుచరుడైన విజయుడికి టికెట్ ఇప్పించుకుని, గెలిపించుకోవడంలో సక్సెస్ అయ్యారు ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామి రెడ్డి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కాంగ్రెస్ గాలి వీచినా….. అలంపూర్‌లో మాత్రం ఆ హవాకు చల్లా వెంకట్రామిరెడ్డి అడ్డుకట్ట వేయగలిగారన్నది లోకల్ టాక్. తాను మండలిలో, తన శిష్యుడు అసెంబ్లీలో ఉన్నా… తమ పార్టీ పవర్‌లోకి రాకపోవడంతో… నియోజకవర్గంలో మాట చెల్లుబాటవడంలేదన్న బాధ ఎమ్మెల్సీని వేధిస్తోందని, అందుకే ఇద్దరూ ఒకేసారి కారు దిగేందుకు ప్లాన్ చేసుకుంటున్నారన్నది అలంపూర్‌లో లేటెస్ట్ టాక్. ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో భేటీ అయిన చల్లా … నియోజకవర్గ అభివృద్ధి, సాగు నీటి అంశాలపై చర్చించినట్లు చెబుతున్నప్పటికీ, అసలు మేటర్ మాత్రం చేరికల అంశమేనన్నది పాలమూరు పొలిటికల్ సర్కిల్స్‌లో వినిపిస్తున్న మాట. పైకి లేదు లేదంటూనే… మండలాల వారీగా ప్రజాప్రతినిధులు, ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్య అనుచరులతో పార్టీ మార్పు అంశాన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో చల్లా అండ్ టీం హస్తం గూటికి చేరడం ఖాయమేనని, ఇక ముహూర్తం కుదరడమే మిగిలి ఉందని అంటోంది అలంపూర్ గులాబీ శిబిరం. చేరేందుకు వీళ్ళు సిద్ధం… చేర్చుకునేందుకు వాళ్ళు రెడీ… కానీ…. మధ్యలో ఆషాఢం అడ్డొచ్చిందని అంటున్నారు కొందరు. ఆషాఢ మాసం ముగిసిన వెంటనే మంచి ముహూర్తం చూసుకుని మా నాయకులు కారు డోర్స్ తీస్తారని ఇప్పటికే చెబుతున్నారట ఇద్దరి ముఖ్య అనుచరులు. దాదాపుగా ఈనెల చివరి వారంలో ఎమ్మెల్సీ చల్లా , ఎమ్మెల్యే విజుయుడు కాంగ్రెస్ కండువా కప్పుకుంటారన్నది ఇప్పటి సమాచారం.
అదే సమయంలో మరో చర్చా జరుగుతోంది. ఈ చేరికలకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం కూడా జరుగుతోందంటున్నారు. అలంపూర్ నియోజక వర్గ ఇంచార్జ్‌గా ఉన్న మాజీ ఎమ్మెల్యే , ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ చల్లా టీమ్‌కు బ్రేకులు వేసే ప్రయత్నాల్లో ఉన్నట్టు మరో వాదన వినిపిస్తోంది. అయితే… ఎమ్మెల్సీ ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డితో భేటీ అవడంతో… అడ్డంకులేవీ ఉండకపోవచ్చన్నది పొలిటికల్ పండిట్స్ లెక్క. అదే సమయంలో చల్లా వెంకట్రామిరెడ్డి , విజయుడి చేరికను స్థానిక కాంగ్రెస్ నేతలు స్వాగతిస్తూనే… మా మంచి చెడులు చూసేందుకు సంపత్ ఉన్నారంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారట. ఇది చూస్తుంటే… చేరికల తర్వాత కొత్తగా గ్రూపులు ఏర్పడటం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. మొత్తం మీద అలంపూర్ చేరికలకు ఆషాఢం అడ్డొచ్చింది. శ్రావణం వచ్చేలోపు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉంటే… ఇద్దరి చేరికలు ఖాయమేనన్నది నియోజకవర్గంలో టాక్. అదే జరిగితే…పాలమూరు జిల్లాలో ఇక కారు ఖాళీ అయిపోయినట్టే.