పాపం బీజేపీ…ఇప్పుడు ఏపీలో ఆ పార్టీ గురించి అనుకుంటున్న మాట ఇది. జాతీయ స్థాయిలో బీజేపీ ఎంత ప్రభావితం చూపగలుగుతున్నా.. ఏపీలో మాత్రం నామమాత్రంగానే ఉంది. ఎన్ని గేర్లు మారుస్తున్నా.. స్పీడు మాత్రం పెరగడం లేదు.దీంతో వాళ్ళేమైనా రివర్స్ గేర్ వేస్తున్నారా? ఓసారి చూసుకోమనండర్రా… అన్న సెటైర్స్ వినిపిస్తున్నాయి. ఎందుకు ఏపీ బీజేపీ నమ్మకం కోల్పోతోంది? అసలేం జరుగుతోంది?
ఏపీలో కమలం రోజు రోజుకూ వాడిపోతుండడమే తప్ప.. వికసిస్తున్న దాఖలాలు కన్పించడం లేదు.. భవిష్యత్తులో కమల వికాసం జరుగుతుందన్న నమ్మకం కలగడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏపీలో బీజేపీ దూకుడు పెంచుతోందని కొంత కాలంగా చెప్పుకుంటూ వస్తున్నా.. కేవలం ప్రకటనలకే పరిమితం అవుతోందే తప్ప ఆచరణలో కనిపించడం లేదు. దీంతో ఏపీలో పాపం బీజేపీ అనుకోవాల్సివ పరిస్థితి. కొన్ని రోజుల వరకు ఇటు వైసీపీ కానీ.. అటు టీడీపీ కానీ తాము బీజేపీకి దగ్గరంటే దగ్గర అని చెప్పుకునే ప్రయత్నాలు చేసేవి. బీజేపీ జాతీయ నేతలు ఎవరైనా… వైసీపీ-టీడీపీల గురించి మాట్లాడితే.. అదుగో మా గురించి ఎలా చెప్పారో చూడండి.. వాళ్ల గురించి ఎలా మాట్లాడారో చూడండి అంటూ ఆ కామెంట్లను తమకు అనుకూలంగా మార్చుకుని రాజకీయం చేసేవారు. తమకు కేంద్రం,.. బీజేపీ జాతీయ నేతలు చాలా దగ్గరగా ఉన్నారని చెప్పుకునే ప్రయత్నం చేసేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్సులో ఉంది. ఇటు వైసీపీ.. అటు తెలుగుదేశం ఇద్దరూ బీజేపీతో తాము దూరంగా ఉన్నామని.. తమకు అంతగా సఖ్యత లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది బీజేపీ వర్గాలకు షాక్ కొట్టే అంశమనే చెప్పాలి.
బీజేపీ అగ్ర నేతలు అమిత్ షా, నడ్డా వంటి వారు ఏపీకి వచ్చి వైసీపీ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. అనేక ఆరోపణలు చేశారు. సహజంగా బీజేపీ నేతలు ఏమైనా కామెంట్లు చేస్తే.. ఇటు వైసీపీ కానీ.. అటు టీడీపీ కానీ కౌంటర్లు వేయవు. కానీ ఈ దఫా మాత్రం స్వయంగా సీఎం జగన్ రంగంలోకి దిగారు. బీజేపీ పెద్దలను నేరుగా ఏమీ అనకున్నా.. బీజేపీని,టీడీపీని ఒకేగాటన కట్టే ప్రయత్నం చేశారు. ఇక పేర్ని నాని వంటి నేతలైతే.. అడ్డంగా ఉన్న నడ్డా అంటూ విపరీత వ్యాఖ్యలే చేశారు. దీంతో వైసీపీ ఏంటీ.. ఈ స్థాయిలో బీజేపీని విమర్శించడమేంటనే చర్చ మొదలైంది. అమిత్ షాతో చంద్రబాబు భేటీ తర్వాత సీఎం జగన్ యాంటీ బీజేపీ లైన్ తీసుకోవడంతో టీడీపీ అలెర్ట్ అయింది. తామేమీ బీజేపీతో సఖ్యతగా లేమని.. అలాగే తాము బీజేపీ అధిష్టానానికి ఏం సాగిలపడలేదని చెప్పుకునే ప్రయత్నం చేసింది. దీంతో అవినీతి ఆరోపణలు చేయడం కాదు.. వాటి మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ చంద్రబాబు కామెంట్లు చేశారు.. అసలు వైసీపీకి బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టే.. వైఎస్ వివేకా కేసు మొదలుకుని.. రకరకాల అంశాల్లో జగనుకు సానుకూలత లభించిందని నేరుగానే అచ్చెన్నాయుడు కామెంట్లు చేశారు. దీంతో ఏపీ రాజకీయాల్లో బీజేపీ దాదాపు ఒంటరి అయిపోయిందనే చెప్పాలి.
ఇదంతా ఓ ఎత్తు అయితే.. వైసీపీకి వ్యతిరేకంగా తామే అలుపెరగని పోరాటం చేస్తున్నామని.. వైసీపీతో కుమ్మక్కు కాలేదని చెప్పుకోవడం బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి తలకు మించిన భారంగా మారింది. ఇప్పటికే సోము వీర్రాజు, జీవీఎల్, విష్ణువర్దన్ రెడ్డి వంటి వారు వైసీపీకి అత్యంత సన్నిహితంగా ఉంటారనే ప్రచారం ఉంది. వైసీపీకి ఏ కష్టమొచ్చినా.. బీజేపీలో ఈ ముగ్గురు ఆదుకునేందుకు ముందు ఉంటారనే భావన సర్వత్రా వ్యాపించింది. దీంతో అమిత్ షా, నడ్డా వంటి వారు ఏపీకి వచ్చి జగన్ ప్రభుత్వాన్ని విమర్శించినా.. అంతగా ఫలితం కన్పించడం లేదనే అనుకుంటున్నారు. ముందుగా అనుకున్న వ్యూహం ప్రకారమే.. అమిత్ షా, నడ్డా ఏపీకి వచ్చి జగన్ను విమర్శించారని.. జగన్‌కున్న మైనార్టీ, క్రిస్టియన్ ఓటు బ్యాంకు చెక్కు చెదరకుండా ఉండేందుకు.. మరింతగా కన్సాలిడేట్ అయ్యేందుకే ఈ తరహాలో షా-నడ్డాలు కామెంట్లు చేశారనే కొత్త ఈక్వేషన్ తెర మీదకు వచ్చింది. ఈ భావన ఏర్పడడానికి కారణం.. కేంద్రం నుంచి ఇటీవలే పెద్ద ఎత్తున నిధులను రాష్ట్రానికి విడుదల చేయడం ఒకటి అయితే.. అమిత్ షా చేస్తున్న ప్రసంగం ఘాటును తగ్గించేలా జీవీఎల్ ప్రయత్నించారనే ప్రచారం జోరుగా సాగడం మరో కారణమని చెప్పాలి.
తాము వైసీపీకి వ్యతిరేకమని శీల పరీక్షకు దిగే ప్రయత్నాల్లో ఉన్నారు కమలనాథులు. అందులో భాగంగానే ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఓ విచిత్రమైన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తాము ఎప్పుడెప్పుడు వైసీపీని.. జగన్ మోహన్ రెడ్డిని విమర్శించమో వివరిస్తూ.. వాటికి సంబంధించిన క్లిప్పింగులను చూపుతూ పవర్ పాయింట్ ప్రజెంటేషనిచ్చారు. ఓ ప్రతిపక్ష పార్టీ.. తాము అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామని చెప్పుకోవడానికి ఏకంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చిందంటే…ఏపీ బీజేపీపై ఏ స్థాయి ముద్ర ఉందో అర్థం చేసుకోవచ్చంటున్నారు.