Off The Record: ఈ ఏడాది చివర్లో జరిగే అసెంబ్లీ ఎన్నికల యుద్ధం కోసం తెలంగాణలోని రాజకీయ పార్టీలన్నీ కత్తులు నూరుకుంటున్నాయి. జనంలోకి వెళ్లేందుకు రకరకాల మార్గాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఆ క్రమంలోనే అధికార BRS కూడా సోషల్ మీడియా మీద ప్రత్యేకంగా నజర్ పెట్టిందట. పార్టీ తరపున ఇప్పటికే సోషల్ మీడియా వింగ్ యాక్టివ్‌గానే ఉన్నా… ఇక నుంచి ఆ డోస్ పెరగబోతున్నట్టు తెలిసింది. ఇతర రాజకీయ పార్టీలతో పోల్చితే…సోషల్ మీడియాలో తమ ప్రజెన్స్ ఎక్కువగానే ఉన్నా…. ఎన్నికల టైంలో తట్టుకోవాలంటే ముందు జాగ్రత్తలు చాలా అవసరమని అంటున్నాయి గులాబీ పార్టీ వర్గాలు. ఎన్నికల సమయం దగ్గర పడేకొద్దీ.. విపక్షాలు సోషల్ మీడియా వేదికగా తమను గట్టిగానే టార్గెట్ చేస్తాయని అంచనా వేస్తున్నారట బీఆర్ఎస్ నేతలు. అందుకే గ్రామ స్థాయి నుంచి హైదరాబాద్ దాకా ప్రతి దశలో సోషల్ మీడియా కార్యకర్తల్ని రంగంలోకి దింపి ఎక్కడికక్కడే కౌంటర్ వేయాలనుకుంటున్నారట.
Read Also: Kesineni Nani Vs PVP: బెజవాడలో హీటేక్కిస్తున్న రివెంజ్ పాలిటిక్స్..
కొంత కాలంగా BRS సోషల్ మీడియా పరంగా దూకుడు పెంచినట్టు చెబుతున్నారు.ఒక వైపు సర్కార్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసుకోవడంతోపాటు అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టేలా ప్లాన్స్ వేస్తోందట నాయకత్వం. ఈ క్రమంలోనే భారీ ఎత్తున ప్రైవేట్ యూ ట్యూబ్ ఛానల్స్‌ని కొన్నట్టు తెలిసింది. కుదిరితే కొనడం, లేదంటే అవగాహన కుదుర్చుకోవడం లాంటి కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతున్నట్టు తెలిసింది. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సోషల్ మీడియాపై పార్టీలోని యువతకు శిక్షణ ఇస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రధానంగా ఎన్నికలకు ముందు, ఎలక్షన్ టైంలో జరిగే వ్యతిరేక ప్రచారాన్ని కౌంటర్ చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోందట గులాబీ పార్టీ. గత అసెంబ్లీ ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకున్న అధికార పార్టీ నేతలు…ఈ సారి సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వాలనుకుంటున్నారట. మొత్తంగా చూస్తే…ఈసారి ఎన్నికల ప్రచారంలో డిజిటల్ వార్ గట్టిగానే జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.