పీవీపీ.. అలియాస్ పొట్లూరి వరప్రసాద్. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. సినీ, రాజకీయ, పారిశ్రామిక రంగాలతో గట్టి సబంధాలే ఉన్న వ్యక్తి. అలాంటి పీవీపీ ఇప్పుడు ఒక పాత పగ తీర్చుకోవడానికి కసిగా పనిచేస్తున్నారట. ఇన్నాళ్ళు ఎదురు చూసి ఇప్పుడు శతృవు కాస్త మెత్తబడ్డారని తెలియగానే చెలరేగిపోతున్నారట. అదే సమయంలో తన తీరని కల కోసం కూడా పని చేస్తున్నారట పొట్లూరి. 2019 ఎన్నికల్లో బెజవాడ ఎంపీ స్థానంలో వైసీపీ తరపున బరిలోకి దిగారు పీవీపీ. టీడీపీ అభ్యర్థి కేశినేని నానిపై స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఎన్నికల సమయంలో కేశినేని, పీవీపీ మధ్య వార్ తారాస్థాయిలో జరిగింది. నాని నేరుగా పొట్లూరిని టార్గెట్ చేసి ఆర్థిక నేరగాడు, మాఫియా అంటూ తీవ్ర స్థాయి విమర్శలే చేశారు. బెజవాడ ప్రజలు ఆర్థిక నేరగాడికి ఓట్లు వేయరు. గెలిపించరు అంటూ విరుచుకుపడ్డారు. రాజకీయాలు కాకుండా వ్యక్తిగతంగా చేసిన ఆ విమర్శలకు గట్టిగానే హర్ట్ అయిన పొట్లూరి….కేశినేని మీద 100 కోట్లకు పరువు నష్టం వేస్తున్నట్టు ప్రెస్‌మీట్ పెట్టి మరీ ప్రకటించారు. అయితే అదంతా గతం. అదే వైరం ఇప్పుడు కొత్త రూపంలో మొదలైంది.
రెండో సారి కేశినేని నాని టీడీపీ ఎంపీగా బెజవాడ నుంచి గెలవడం, రాష్ట్రంలో వైసీపీ పవర్‌లోకి రావటంతో పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జిగా పీవీపీని నియమించింది అధికార పార్టీ. ఆ సమయంలో ఎంపీ తీరుపై వరుస ట్వీట్లు చేసిన పొట్లూరి తర్వాత కాలంలో వైసీపీకి కూడా దూరంగా ఉన్నారు. ఇదే సమయంలో కేశినేని వ్యవహారం టీడీపీలో రచ్చ అవుతోంది. దీంతో… ఇప్పుడు గత విమర్శల తాలూకూ ప్రతీకారం తీర్చుకుంటున్నారట పీవీవీ. అందుకు ట్వీటాయుధాన్ని వాడుతున్నారు. బెజవాడ భల్లూకం లాంటి ఘాటైన పదజాలంతో ఎంపీ మీద డైరెక్ట్‌గా డిజిటల్ అటాక్ చేస్తున్నారు. సొంత పార్టీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొంటున్న కేశినేని నానిని తన ట్వీట్స్‌తో మరింతగా కుళ్ళుబొడవాలన్నది ఆయన టార్గెట్ అని స్థానికంగా చెప్పుకుంటున్నారు. పాత పగ తాలూకూ రివెంజ్‌ని కొత్తగా తీర్చుకుంటున్న పీవీపీ… నాని స్పందించకున్నా కూడా ఏ మాత్రం వదలడం లేదట. వరుస ట్వీట్స్‌తో చురుకు పుట్టించాలన్నది ఆయన టార్గెట్ అని తెలిసింది.
బెజవాడ వాసిగా ఇక్కడ నుంచి ఎంపీ అవ్వాలనేది పీవీపీ లక్ష్యాల్లో ఒకటిగా చెబుతారు ఆయన సన్నిహితులు. అందుకే ఈసారి వైసీపీ కాకుంటే.. మరో పార్టీ నుంచైనా సరే… బెజవాడ బరిలో ఉండాలనుకుంటున్నారట. ఇటీవలి పరిణామాలతో కొందరు వైసీపీ నేతలు కేశినేని నానిని పార్టీలోకి ఆహ్వానించడం చూశాక పీవీపీకి కాలిపోతోందట. బెజవాడ వేసవి భగభగలకంటే ఎక్కువగా మంట పుడుతోందట ఆయనకు. అందుకే ఒకేసారి రెండు లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా ట్వీట్ యుద్ధం మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. వేరే పార్టీల నుంచి తనకు ఆహ్వానాలు రావటానికి కారణం తాను మంచి వాడిని అవటమేనని కేశినేని చేసిన కామెంట్స్‌ని కూడా వెటకారం చేశారు పీవీపీ. నువ్వేం చేసినా అది నీకు దుర్దినం మాకు సుదినం అని ట్వీట్ చేశారు. ఇటీవలి కాలంలో బీజేపీని పొగుడుతూ కూడా వరుస ట్వీట్లు చేస్తున్నారు పీవీపీ. దీంతో ఈసారి ఆయన అడుగులు ఎటువైపు పడబోతున్నాయన్న ఆసక్తి రాజకీయ వర్గాల్లో పెరుగుతోంది. ఎన్నికల నాటికి ఎవరు ఏ పార్టీలో ఉంటారో చూడాలి.