అక్కడ ప్రత్యర్థులతో పని లేకుండా టీడీపీలోని రెండు వర్గాలే గుద్దులాటకు దిగుతున్నాయా? సాక్షాత్తు ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలోనే నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేదాకా వ్యవహారం వెళ్ళిందా? పార్టీ అధిష్టానం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నియోజకవర్గంలో పరిస్థితి అంతకంతకూ దిగజారుతోందా? ఏదా సెగ్మెంట్? ఎవరా ఇద్దరు? వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోట పులివెందుల. గడిచిన 45 ఏళ్ళుగా వైఎస్ కుటుంబానిదే ఇక్కడ హవా. అలాంటి కోటను ఎందుకు బద్దలు కొట్టకూడదు? పసుపు జెండా ఎందుకు ఎగరేయకూడదన్నది టీడీపీ పెద్దల టార్గెట్. ఆ లక్ష్యంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ పులివెందుల నినాదం తెర మీదికి వచ్చింది. కానీ… గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే మాత్రం మాకా నమ్మకం కలగడం లేదని కేడరే చెప్పుకుంటున్న పరిస్థితి. పై స్థాయిలో వాళ్ళయితే కలలు గంటున్నారు గానీ… నియోజకవర్గంలో పని చేయాల్సిన వాళ్ళు ఆ దిశగా అడుగులేస్తున్నారో లేదో వాళ్ళ అంతరాత్మలనే అడగమనండని అంటున్నారు పులివెందుల టీడీపీ కార్యకర్తలు. స్థానిక వైసీపీ అసంతృప్తులను కలుపుకుని, పార్టీ కేడర్‌కు భరోసా ఇస్తూ… ముందుకు నడిపించాల్సి నాయకులు ఇద్దరూ తన్నులాటలకు సై అనడం ఇక్కడి ద్వితీయ శ్రేణిని కలచివేస్తోందట. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి మధ్య పెరుగుతున్న గొడవలు పార్టీ పరువును పులివెందుల నడివీధుల్లో నిలబెడుతున్నాయని అంటున్నారు.పార్టీ తీరు ఒకలా ఉంటే… వాళ్ళిద్దరి తీరు మాత్రం మరోలా ఉందని, అసలు ఇద్దరికీ వై నాట్ పులివెందుల నినాదం నచ్చిందో లేదోనని కూడా వెటకారాలాడుతున్నారట టీడీపీ కార్యకర్తలు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి పై దృష్టి సారించాల్సిన నేతలు ఇద్దరూ… ఆధిపత్యం కోసం వెంపర్లాడుతున్నారు తప్ప అసలు విషయం మీద దృష్టి పెట్టడం లేదని అంటున్నారు.
పరస్పరం అణిచివేతకు కుట్రలు పన్నడంతోనే టైంపాస్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. వీళ్ళ గొడవలతో పార్టీ పటిష్టం సంగతి తర్వాత… అసలు ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పుడుతోందని అంటున్నారు. గత ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద పోటీ చేసి ఓడిపోయారు మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి. అప్పటినుంచి పార్టీ నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్నారాయన. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్‌లో పులివెందులకు చెందిన భూమిరెడ్డి రామ్‌గోపాల్ రెడ్డి ఎమ్మెల్సీగా విజయం సాధించారు. ఇద్దరూ ఒకే ప్రాంతానికి చెందిన వారు కావడంతో ఆధిపత్య పోరు మొదలైంది. పార్టీ పవర్‌లోకి వచ్చాక మేం చెప్పిందే నడవాలన్నట్టుగా ఇద్దరూ వ్యవహరించడంతో సమస్య పెరిగిందని అంటున్నారు పరిశీలకులు. నేను నియోజకవర్గ ఇన్చార్జిని. నా మాటే చెల్లాలని మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి పట్టుపట్టుతుండగా, నేను ఎమ్మెల్సీని, నాకు ప్రోటోకాల్ ఉంది కాబట్టి నా మాటే చెల్లాలంటున్నారట రాంగోపాల్ రెడ్డి. అలా… ఇద్దరి మధ్య పెరుగుతన్న ఆధిపత్య పోరు ఇటు అధికారులకు, అటు టిడిపి క్యాడర్‌కు తలనొప్పిగా మారుతోందట. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చాక మొట్ట మొదటిసారి పార్టీ పులివెందుల నియోజకవర్గ విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ఆ మీటింగ్‌లో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి వేదికపైకి ఎక్కగానే… మాజీ ఎమ్మెల్సీ వర్గం ఆగ్రహంతో ఊగిపోయిందట. సాక్షాత్తు జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత వారిస్తున్నా… కంట్రోల్ కాలేదట బీటెక్ రవి అనుచరులు. దీంతో నిన్న మొన్నటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉన్న వర్గ విభేదాలు, రోడ్డెక్కినట్టయిందంటున్నారు పరిశీలకులు. వైసిపి అధినేత అడ్డాలో పార్టీకి ఊతమివ్వాల్సిన టిడిపి నేతలే ఇలా వీధికెక్కి పరువు మంటగలుపుతున్నారన్న ఆగ్రహం వ్యక్తం అవుతోంది పార్టీ కేడర్‌లో. రెండు వర్గాలు సై అంటే సై అనడంతో టెన్షన్ వాతావరణం ఏర్పడుతోందట నియోజకవర్గ పార్టీలో. పార్టీ పెద్దలు తక్షణం జోక్యం చేసుకుని సరిదిద్దకుంటే… వై నాట్ పులివెందుల నినాదం సంగతి తర్వాత… మొదటికే మోసం వచ్చే ప్రమాదం ఉందంటున్నారు కార్యకర్తలు.