Off The Record: సర్వేల ఆధారంగానే ఈసారి పార్టీ టిక్కెట్స్ ఉంటాయని తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం పదే పదే చెబుతోంది. కానీ, అసలిప్పుడా సర్వేల శాస్త్రీయత పైనే. పార్టీ నేతలకు అనుమానం కలుగుతోందట. వాటికి ప్రామాణికత ఏంటని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ పార్టీ మీటింగ్‌లో ప్రశ్నించడం కలకలం రేపుతోంది. ఎన్నికల కమిటీ సమావేశంలో ఇదే అంశాన్ని బలంగా వినిపించే ప్రయత్నం చేశారాయన. సర్వేలు, వాటి ప్రామాణిక అంశాలను కూడా కమిటీ ముందు పెట్టాలని సూచించిన బలరామ్.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో రిపోర్ట్స్ ట్యాంపర్ అవుతున్నాయని ఆరోపించారు.
దీంతో ఇప్పుడు గాంధీభవన్‌లో కొత్త సమరం మొదలైంది. కొందరికి అనుకూలంగా నివేదికలు ఇస్తున్నారని, సర్వేలో తేలింది ఒకటైతే.. ఢిల్లీ వెళ్తున్న రిపోర్ట్ ఇంకోటని అనుమానం వ్యక్తం చేస్తున్నారు పార్టీ నేతలు. ఉప్పల్ నియోజకవర్గానికి సంబంధించిన నివేదికలపై స్థానిక నేతలకు కొన్ని డౌట్స్ వచ్చాయట. నిత్యం జనంలో ఉండే వాళ్లకు స్థానికంగా వచ్చిన రిజల్ట్ ఒకటైతే.. ఢిల్లీ హెడాఫీస్‌కి వేరే రకంగా వెళ్ళిందట. అక్కడి నాయకులు ఏఐసీసీలో కీలక నేత దగ్గరకి వెళ్లిన నివేదిక గురించి తెలుసుకునే ప్రయత్నంలో ఈ వ్యవహారం బయటపడినట్టు సమాచారం. ఏఐసీసీలో ఉన్న తెలంగాణకు చెందిన ఓ కీలక నేత ఇదంతా నడిపిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గంలో పెద్దగా తిరగని నాయకుడి గ్రాఫ్ బాగుందంటూ ఢిల్లీకి రిపోర్ట్ వెళ్ళిందని తెలుసుకున్న లీడర్స్ అవాక్కయ్యారట. దీంతో అసలు వాటి ప్రామాణికత మీదే అనుమానాలు పెరుగుతున్నాయంటున్నారు కొందరు లీడర్స్. గ్రేటర్ హైదరాబాద్‌లోని మరో నియోజకవర్గం సనత్ నగర్. ఇక్కడ కూడా అధిష్టానంలోని ఆ కీలక నేతల సిఫార్సు ఉంటే టికెట్ వస్తుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇటీవల పీసీసీ ప్రధాన కార్యదర్శిగా, ఆ వెంటనే ఏఐసీసీ సభ్యురాలిగా ఎన్నికైన కోట నీలిమ ఈసారి సనత్‌నగర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఢిల్లీ స్థాయిలో ఉన్న పరిచయాలతోనే ఆమెకు టిక్కెట్ వస్తుందంటున్నారు.
ఇదే నియోజకవర్గంలో మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి కుమారుడు ఆదిత్య రెడ్డి కూడా టికెట్ ఆశిస్తున్నారు . దశాబ్దాల తరబడి కాంగ్రెస్‌కి లాయల్‌గా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన తనకు అవకాశం ఇవ్వాలంటూ తన ప్రయత్నాల్లో ఉన్నారాయన. తండ్రి బీజేపీలోకి వెళ్లినా ఆదిత్య మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతున్నారు. మరోవైపు ప్రతి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు బీసీలకు ఇస్తామని కాంగ్రెస్ నాయకత్వం ప్రకటిస్తున్నందున కురుమ సామాజిక వర్గం నుంచి తనకు కావాలంటూ దుండిగాళ్ల నాగేందర్ రాజ్ దరఖాస్తు పెట్టుకున్నారు. 30 ఏళ్ళ నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నానంటూ…. బీసీ కోటాలో టిక్కెట్ కోసం లాబీయింగ్ చేస్తున్నారాయన. మొత్తంగా చూస్తే… సొంత పార్టీ సర్వేతోనే కాంగ్రెస్‌లో కంగాళీ పెరుగుతున్నట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. బలరాం నాయక్ లేవనెత్తిన ప్రశ్నలతో… పాత తరం నాయకులను పక్కన పెట్టేందుకే సర్వేలను అడ్డంపెట్టుకుంటున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయంటున్నారు కొందరు సీనియర్స్. అభ్యంతరాలపై సర్వే టీమ్ నుంచి ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.