Off The Record: తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా…ఆ ఫలితాల ప్రభావం తెలంగాణపై ఉంటుందని కాషాయ పార్టీ నేతలు చెబుతూ వస్తున్నారు. ఎన్నికలు జరిగిన చోట బీజేపీ గెలిస్తే ఇక్కడా చేరికలు ఉంటాయట. ఐతే…చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే ఎన్నికలు జరిగాయి. పలితాలు వచ్చాయి. కానీ ఇక్కడ మాత్రం వారు ఊహించిన స్థాయిలో చేరికలు జరగనేలేదు. ఎక్కడైనా ఎన్నికలు జరిగి బీజేపీ గెలిస్తే ఆ ఫలితాలే తెలంగాణలోనూ రిపీట్ అవుతాయని బీజేపీ నేతలు ఢంకా బజాయించి చెబుతూ ఉంటారు. ఇక…ఇప్పుడు తెలంగాణ బీజేపీ నేతల ఆశలన్నీ కర్ణాటక ఎన్నికలపైనే ఉన్నాయి. అక్కడ గెలిస్తే తెలంగాణలోనూ ఆ ప్రభావం భారీ స్థాయిలో ఉంటుందని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారట. అమిత్ షా లాంటి వారు కూడా దక్షిణాదికి ఎంట్రీ అయిన కర్ణాటకలో మళ్లీ గెలుస్తామంటూ ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఆ తరువాత సౌత్‌లో అధికారంలోకి వచ్చేది తెలంగాణలోనేనట.
Read Also: Off The Record: హాట్‌టాపిక్‌గా మారిన బాలినేని వ్యవహారం..! వైసీపీలో ప్రకంపనలు
ఐతే.. కర్నాటకలో బీజేపీ గెలిస్తే కాంగ్రెస్ బలహీనపడుతుందని కాషాయ నేతలు భావిస్తున్నారని టాక్. తెలంగాణ కాంగ్రెస్ నేతల్లోను పార్టీపై విశ్వాసం సన్నగిల్లుతుందని అనుకుంటున్నారట. అదే సమయంలో బిజెపిలోకి చేరికలు ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నారు. ప్రజల్లో తమ పార్టీకి సానుకూల వాతావరణం ఏర్పడుతుందని…కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందనే ప్లాన్స్‌లో కాషాయ నేతలు ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఒకవేళ కర్నాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీలో ఉత్సాహం పెరుగుతుందని…ఆ ప్రభావం బీజేపీపై పడుతుందని అంచనాలతో ఉంది కాషాయదళం. క్షేత్ర స్థాయిలో ఆ పార్టీ పట్టు కొనసాగే అవకాశం ఉంటుందని బీజేపీ నేతల ఆలోచనగా తెలుస్తోంది. మరోవైపు…తెలంగాణ బీజేపీ నేతలు కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఇరవై నియోజకవర్గాలకు ఇంఛార్జ్‌లుగా వ్యవహరిస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపు కోసం తెలంగాణ నేతలు చెమటోడుస్తున్నారు. కర్ణాటక గెలిస్తే తెలంగాణలోనూ తమకు గెలుపు ఖాయం అవుతుందనుకుంటున్నారు టీ బీజేపీ నేతలు. కర్నాటక తరువాత ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. అక్కడ గెలిచి ఇక్కడ ఊపు తీసుకురావాలని కమలం పెద్దలు ఆలోచనతో ఉన్నట్టు పార్టీ వర్గాలు అనుకుంటున్నాయి. మరి…బీజేపీ ప్లాన్ వర్కవుట్ అవుతుందో లేదో చూడాలి.