Off The Record: ముతుకుమిల్లి శ్రీ భరత్…..టీడీపీ నాయకుడు, సినీ నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు. 2019లో తొలిసారి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రీ భరత్ స్వల్ప ఓట్ల తేడాతో విశాఖ ఎంపీగా ఓడిపోయారు. త్రిముఖ పోటీలో జనసేన భారీగా ఓట్లు చీల్చేసింది. దీంతో సుమారు 4వేల మెజారిటీతో గెలిచారు వైసీపీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ. లోక్‌సభ సీటు పరిధిలో ఏడింట నాలుగు అసెంబ్లీ స్థానాలను టీడీపీ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరోసారి ఎన్నికల టైం దగ్గర పడుతుండగా…. పోగొట్టుకున్న చోటే వెదుక్కోవాలని గట్టిగా డిసైడయ్యారట శ్రీ భరత్.
తెర మీద ఎన్ని లెక్కలు కనిపిస్తున్నా….అంతర్గతంగా ఈ సీటు బాలయ్య అల్లుడికేనన్నది పార్టీలో బలమైన టాక్. అందుకు తగ్గట్టుగానే… ఆయన కూడా నియోజకవర్గంలో పట్టు పెంచుకునేందుకు గట్టి ప్రయత్నాల్లో ఉన్నారట. కీలకమైన విశాఖ దక్షిణం అసెంబ్లీ నియోజకవర్గంలో గడప గడపకు తిరుగుతున్నారు. ఇన్ఛార్జ్ గండిబాబ్జీతో కలిసి పార్టీ బలోపేతం కోసం చేస్తున్న ప్రయత్నం ఒక విధంగా ఎన్నికల ప్రచారంగానే సాగుతోంది. పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లోను ప్రజాసమస్యల పరిష్కారం పేరుతో ప్రణాళిక రూపొందించుకుని వెళుతున్నారు భరత్. ఇక్కడి దాకా బాగానే ఉంది కానీ…ఇక మీదట ఈ లెక్కలు ఇలాగే ఉంటాయా? మారిపోతాయా? అన్న అనుమానం వస్తోందట కొందరు నేతలకు. జనసేన, టీడీపీ, బీజేపీ పొత్తులపై జరుగుతున్న ప్రచారమే అందుకు కారణంగా చెబుతున్నారు.
ఉత్తరాంధ్రపై టీడీపీ, జనసేన ఎక్కువ ఫోకస్ పెట్టాయి. బీజేపీకి కాస్తో కూస్తో ఆదరణ లభించే చోటు కూడా విశాఖపట్టణమే. 2019లో శ్రీకాకుళం, విశాఖలో కొన్ని ఎమ్మెల్యే సీట్లు సాధించినా.. విజయనగరం జిల్లాలో ఘోరంగా ఓడింది టీడీపీ. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి జాగ్రత్త పడుతోంది. జనసేన సైతం ఉత్తరాంధ్రపై ఎక్కువ ఆశలు పెట్టుకుంది. సందర్భం వచ్చిన ప్రతీసారీ పవన్ కల్యాణ్ ఇక్కడి సమస్యలను ప్రస్తావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో విశాఖ ఎంపీ సీటుపై గురిపెట్టాయి పార్టీలు. ఏపీలో 20 ఎంపీ సీట్లు గెలిపించి మరోసారి బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేలా సహకరించమని విశాఖ బహిరంగ సభలో అభ్యర్ధించి వెళ్ళారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. విశాఖ ఎంపీగా పోటీ చేయాలన్న ఉద్దేశ్యంతో రెండేళ్ల క్రితం ఇక్కడ అడుగుపెట్టారు ఆ పార్టీ నాయకుడు జీవీఎల్. అప్పట్నుంచి హడావిడి చేస్తూనే ఉన్నారు. ఒక విధంగా సాంప్రదాయ రాజకీయాల చట్రంలో ఉన్న స్థానిక బీజేపీ నాయకత్వంలో కొత్త ఉత్సాహం తెచ్చే ప్రయత్నాల్లో ఉన్నారాయన.
గత ఎన్నికల్లో సుమారు 2లక్షల 80వేల ఓట్లు సాధించిన జనసేన….ఈసారి విశాఖ ఎంపీ సీటు పోటీపై ఆసక్తిగా ఉంది. అందుకే పొత్తులు వర్కవుట్ అయితే వైజాగ్ ఎంపీ టిక్కెట్టును టీడీపీ మరోసారి వదులుకోక తప్పని పరిస్థితులు కనిపిస్తున్నాయట. ఈ లెక్కలు అన్నీ తేలి.. మిత్ర ధర్మంలో భాగంగా వైజాగ్ ఎంపీ సీటును టీడీపీ వదులుకోవాల్సి వస్తే… ఇక్కడే తిరిగి పోటీ చేయాలన్న బాలయ్య చిన్న అల్లుడి ఆశలు నెరవేరే అవకాశం ఉండదని టీడీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోందట. ఈసారి రాష్ట్రంలో అధికారంలోకి రావడమన్నది జీవన్మరణ సమస్యగా భావిస్తున్న టీడీపీ హైకమాండ్ ఫోకస్ అంతా ఎమ్మెల్యేలపైనే ఉంది. అందుకే ఎంపీల విషయంలో పట్టు విడుపులు ఉండవచ్చంటున్నారు. భాగస్వామ్య పక్షాలుగా మారితే బీజేపీకి విశాఖ సీటును కేటాయించాల్సి వస్తుందన్న అంచనాలు టీడీపీ వర్గాల్లోనే ఉన్నాయట. అదే జరిగితే శ్రీ భరత్ రాజకీయ భవిష్యత్ మాటేంటి అన్నది ఇప్పుడు విశాఖ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న విస్తృత చర్చ.గత ఎన్నికల సమయంలో కూడా టిక్కెట్ కోసం ఆయన కుటుంబ సభ్యులతో చంద్రబాబుపై ఒత్తిడి తీసుకు వచ్చి సాధించుకున్నారనే ప్రచారం జరిగింది. పొత్తులంటూ కుదిరి, అంతా ఒక అవగాహనకు వచ్చి ఈసారి విశాఖను బీజేపీకి వదులుకోవాల్సి వస్తే.. శ్రీభరత్ సొంత జిల్లాకు బదిలీ అవ్వడం ఖాయం అనే అభి ప్రాయం ఉంది.
వైజాగ్ సీటు కాకుంటే రాజమండ్రి ఎంపీగా భరత్ రంగంలోకి అవకాశాలు ఉన్నాయి. రాజమండ్రి ఎంపీ పరిధిలో టీడీపీకి గట్టిపట్టున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. కమ్మ సామాజిక వర్గం బలం ఎక్కువ. అన్నిటికీ మించి భరత్ ఇద్దరు తాతయ్యలు గోదావరి జిల్లాలోనే రాజకీయంగా ఎదిగారు. ఎంవీవీఎస్ మూర్తి రాజమండ్రి ఎంపీగా పనిచేస్తే, కావూరి సాంబశివరావు ఏలూరు ఎంపీగా గెలిచారు. దీంతో ఆయనకు విశాఖ కంటే రాజమండ్రి వెళ్ళడం సేఫ్ అని సూచనలు ఇచ్చే వాళ్ళు సైతం ఉన్నారు. అటు భరత్ సైతం ఎంపీగా పోటీ చేయడం తనకు ఇష్టం అంటున్నారు తప్ప వైజాగే కావాలని మంకు పట్టు పట్టే అవకాశం లేదంటున్నారు. దీంతో రాజమండ్రి ఎంపీ అభ్యర్థి లేడనే కొరత, పొత్తుల్లో మిత్ర ధర్మాన్ని పాటించామన్న గౌరవం రెండూ ఉంటాయి కాబట్టి శ్రీ భరత్‌ని రాజమండ్రి పంపడమే మేలంటున్నారు కొందరు సీనియర్స్. చివరికి పరిస్థితులు ఎలా మారతాయో, అసలు టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదురుతుందో, లేదో చూడాలి.