Off The Record: ఏపీలో పొలిటికల్ హీట్ పెరిగిపోతోంది. నిన్నటి దాకా చంద్రబాబు అరెస్ట్ చుట్టూ తిరిగిన రాజకీయం ఒక్కసారిగా పొత్తుల మీదకు మళ్ళింది. ములాఖత్‌లో చంద్రబాబును కలిశాక పొత్తులపై కీలక ప్రకటన చేశారు పవన్ కల్యాణ్. మాజీ సీఎంని ఆకాశానికెత్తేస్తూ.. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రకటించేశారు పవన్. ఒక రకంగా ఇది రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. రెండు పార్టీల మధ్య పొత్తు గురించి చాలా రోజులుగా ప్రచారం ఉన్నా.. కలిసి ఎన్నికలకు వెళ్లడం ఖాయం అనుకుంటున్నా.. ఆ పొత్తును ఇప్పటికిప్పుడు ప్రకటించే అవకాశం ఉండదని భావించారు అంతా. కానీ, చంద్రబాబు అరెస్టుతో పరిస్థితులు, పరిణామాలు మారినట్టు కన్పిస్తోంది. ఇంత హఠాత్తుగా ప్రకటన రావడానికి కారణాలు చాలానే ఉన్నాయన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది. వాస్తవానికి ఎన్నికలకు మూడు నెలల ముందు పొత్తుల గురించి అధికారిక ప్రకటన చేద్దామని భావించినట్టు సమాచారం. ఈలోగా బీజేపీ విషయంలో కూడా క్లారిటీ తీసుకోవాలని.. ఆ పార్టీని కూడా కలుపుకుని వెళ్లాలనేది టీడీపీ-జనసేన అభిప్రాయమని చెబుతున్నారు.
అయితే చంద్రబాబు అరెస్ట్‌తో మొత్తం సీన్ మారిపోయింది. ఇంకా మాట్లాడుకుంటే.. అసలు చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీకి ముందస్తు సమాచారం ఉందనేది టీడీపీలోని మెజార్టీ నేతల అభిప్రాయమట. ఈ డౌట్ చాలా మందికి ఉన్నా.. ఎవ్వరూ బయటపడలేదంటున్నారు. కానీ.. సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు మాత్రం రెస్పాండ్ అయ్యారు. బీజేపీ పెద్దలు చంద్రబాబు అరెస్ట్ మీద ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారాయన. దీనికి తగ్గట్టే.. ఢిల్లీతో పాటు ఏపీ బీజేపీ నేతలు కూడా మాట్లాడడం లేదు. ఇదంతా చూస్తుంటే.. అరెస్ట్ విషయాన్ని బీజేపీ పెద్దలకు వైసీపీ ముందుగానే చెప్పినట్టుగా కనిపిస్తోందనేది మెజార్టీ టీడీపీ నేతలవాదన. ఈ పరిణామాలన్నిటినీ గమనించాకే.. ఇక తాత్సారం చేయకూడదనే ఉద్దేశ్యంతో.. దూకుడుగా వెళ్లాలని టీడీపీ-జనసేన భావించినట్టు సమాచారం. తామేమో.. బీజేపీని కలుపుకుని వెళ్లే ప్రయత్నం చేస్తుంటే.. ఆ పార్టీ మాత్రం.. వైసీపీకి ప్రభుత్వ పరంగానే కాకుండా.. రాజకీయంగా కూడా సహకరించేలా అడుగులు వేస్తున్నట్టు భావిస్తున్నాయట టీడీపీ-జనసేన అధినాయకత్వాలు.
దీంతో ఇంకా ఆలస్యం అయితే… రాజకీయంగా మరింత ఇబ్బందుల్లోకి వెళ్లే ప్రమాదం ఉందనే ఆందోళనతోనే పొత్తులపై వెంటనే క్లారిటీ ఇచ్చేసినట్టు విశ్లేషిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. పవన్ కళ్యాణ్ రాజమండ్రి రావడం.. చంద్రబాబుతో ములాఖత్ కావడం.. పొత్తులపై ప్రకటన చేయడం, ఆ సందర్భంలో ఓవైపు లోకేష్.. మరోవైపు బాలకృష్ణ ఉండేలా ప్లాన్ చేసుకోవడమంతా అందులో భాగమేనంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్ట్ విషయం బీజేపీ పెద్దలకు తెలిసి జరిగింది కాదని స్వయంగా పవన్ చెప్పడంతో పాటు.. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని భావిస్తున్నామన్నారు. అలాగే తానింకా ఎన్డీఏలో ఉన్నాననే విషయాన్ని స్పష్టంగా చెప్పారు పవన్. ఈ క్రమంలో చంద్రబాబు అరెస్ట్ విషయంలో బీజేపీ పాత్రపై టీడీపీకి అనుమానాలు ఉండడంతోనే.. కమలం పార్టీపై ఒత్తిడి పెంచేందుకు టీడీపీ-జనసేన పొత్తుల ప్రకటన చేశాయనేది మరో వెర్షన్. ఇప్పుడు బీజేపీ ఏ విధంగా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. చంద్రబాబు అరెస్టుపై ఏపీ బీజేపీ నేతలు నోరెత్తడం లేదు కానీ.. తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం జగన్ ప్రభుత్వ తీరును తప్పు పట్టడం ఆసక్తిగా మారింది.