Off The Record: చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. 73 ఏళ్ల వయస్సులో జైలుకెళ్లారు. ఆయనకు వ్యతిరేకంగా ఇప్పటికీ సీఐడీ సరైన ఆధారాలు సేకరించలేకపోయిందన్నది టీడీపీ లీడర్స్ అండ్ కేడర్ మధ్య విస్తృతంగా జరుగుతున్న చర్చ. కానీ, అదే టైంలో మరో విషయాన్ని కూడా మాట్లాడుకుంటున్నారట. బాబు స్థాయి, వయసు, ఇన్నాళ్లు జైల్లో ఉండటం లాంటి వ్యవహారాలను మనలో మనం మాట్లాడుకుంటున్నాం.. అయ్యో పాపం అనుకుంటున్నాం.. సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నాంగానీ.. అసలు జనం ఏమనుకుంటున్నారన్న ప్రశ్న వచ్చినప్పుడు క్లారిటీ రావడం లేదట. ఇలాంటి వ్యవహారాల్లో సింపతీ ఫ్యాక్టర్ ప్రధానం గనుక ఆ కోణంలో ఆలోచిస్తే.. ఆశించినంత రాలేదన్నది పార్టీలో మెజార్టీ నాయకుల అభిప్రాయంగా తెలుస్తోంది.
ప్రస్తుతం ఏ ఇద్దరు నాయకులు కలిసినా.. వివిధ కోణాల్లో విశ్లేషించుకుంటూ.. వర్తమానం, భవిష్యత్ లెక్కలు వేసుకుంటూ.. సానుభూతి గేమ్ ఎలా ఆడితే పూర్తిగా వర్కౌట్ అవుతుందా అని మాట్లాడుతుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు జైలుకు వెళ్ళక ముందు పార్టీ గురించి జనం ఏమనుకున్నారు? ఇప్పుడు ఎలా మాట్లాడుకుంటున్నారని ఆరా తీసే పనిలో ఉన్నారట కొందరు నాయకులు. వాళ్ళ అంచనాల ప్రకారం గతంలో టీడీపీకి గ్రామీణ ప్రాంతాల్లో కొంత ప్రతికూల వాతావరణం ఉండేదని, ఇప్పుడు కొంత మార్పు కనిపిస్తున్నా.. అది ఇంకా ఎక్కువగా రావాల్సిందని, ఆ స్థాయిలో ఎందుకు రాలేదంటూ మాట్లాడుకుంటున్నారు. ఈ వయసులో ఆయన్ని అలా అరెస్ట్ చేసి ఉండకూడదంటూ.. న్యూట్రల్‌గా ఉండేవాళ్ళు అరెస్ట్ చేసిన విధానంపై మాట్లాడుకుంటున్నా… అది అక్కడికే పరిమితం అవుతోందని, అంతకు మించి పూర్తి సానుభూతి రూపంలోకి మారడం లేదన్న ఫీడ్ బ్యాక్ వస్తోంద పార్టీ నేతలకు.
అరెస్ట్ తర్వాత భువనేశ్వరి, బ్రాహ్మణి తెర మీదికి వచ్చి కేండిల్ ర్యాలీలు నిర్వహించడం వల్ల మహిళల్లో చర్చ మొదలైందంటున్నారు. దాన్ని సానుకూలంగా ఎలా మల్చుకోవాలన్నది పార్టీ నాయకత్వపు నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుందని, ఆ స్థాయిలో నిర్ణయాలు తీసుకుని జనంలోకి తీసుకెళ్ళే పరిస్థితి ఇప్పుడు పార్టీలో ఉందా అన్న చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలిసింది. ప్రజల్లో చర్చ జరుగుతున్నంత మాత్రాన సరిపోదని.. దాన్ని రాజకీయంగా ఉపయోగపడేలా మార్చుకోవడంలోనే విషయమంతా ఉందని, అసలు అందుకు సంబంధించిన ప్రణాళికలు ఏవని పార్టీ వర్గాలే ప్రశ్నించుకుంటున్న పరిస్థితి. ఇదే విషయాన్ని చంద్రబాబు కుటుంబ సభ్యుల దగ్గర కొందరు ప్రస్తావించే ప్రయత్నం చేసినా.. అట్నుంచి అంత సానుకూల స్పందన రాలేదని తెలిసింది. అయితే.. కుటుంబ సభ్యులుగా వారి అభిప్రాయాలు వారికున్నా.. రాజకీయంగా కూడా ఆలోచించాలి, పార్టీని బతికించుకోవాల్సిన అవసరం ఉంది కదా అంటున్నారు కొందరు టీడీపీ నేతలు. రాజకీయంగా సక్సెస్ అయితే.. అన్నీ కొట్టుకుపోతాయని.. పొలిటికల్ యాంగిల్‌లో ఆలోచించకుంటే మొత్తానికే నష్టపోతామన్న ఆందోళన కేడర్‌లో ఉందట. మొత్తంగా చూస్తే… చంద్రబాబులాంటి అగ్రనాయకుడు అరెస్టయి ఇన్ని రోజుల నుంచి జైల్‌లో ఉంటే… రావాల్సిన రేంజ్‌లో సానుభూతి రాలేదన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతోందంటున్నారు. ముందు ముందు పరిస్థితులు ఎలా మారతాయో చూడాలి.