Off The Record: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిని… తమ మనిషిగానే చెప్పుకుంటూ వస్తోంది కాంగ్రెస్ పార్టీ. జగన్ సొంతగా వైసీపీ పెట్టుకున్నప్పుడు కూడా కుటుంబ సభ్యులు వైఎస్ ఆస్తులకు వారసులు కానీ… కాంగ్రెస్ పరంగా ఆయన చేసిన రాజకీయాలకు కాదని స్టేట్‌మెంట్స్ ఇచ్చారు పార్టీ పెద్దలు. తర్వాత వివాదం ముగిసింది. కానీ… ఇన్నేళ్ళకు, ఇప్పుడు మళ్లీ .. అదే చర్చ తెర మీదకు వచ్చింది. రాజశేఖర్ రెడ్డి వర్ధంతి, జయంతిలకు గాంధీభవన్‌లో నివాళి అర్పిస్తూ ఉంటారు. ఇన్నాళ్ళు అంత వరకే పరిమితం అయ్యింది పార్టీ. కానీ ఈ సారి మాత్రం ఓ అడుగు ముందుకు వేశారు కాంగ్రెస్ నేతలు. జాతీయ నాయకత్వం కూడా ఈనెల 8న జరిగిన వైఎస్ జయంతికి స్పందించడమే విశేషం. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే, ముఖ్యనేత రాహుల్ గాంధీ వైఎస్‌ని పొగుడుతూ… ఆయన సేవల్ని కొనియాడుతూ… ట్వీట్ చేశారు. రాజశేఖర్‌రెడ్డి చనిపోయాక ఎప్పుడూ లేనిది… ఈ ఏడాది జాతీయ నాయకత్వం ఎందుకు స్పందించింది? ఆ ప్రేమ వెనక వ్యూహం ఏంటి..? అన్న చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.
Read Also: Vizag: నగ్న వీడియోలు తీసి బెదిరిస్తూ లైంగిక దాడి.. వెలుగులోకి నివ్వరపోయే నిజాలు..
కాంగ్రెస్ హై కమాండ్ కూడా రంగంలోకి దిగిందంటే…. దీని వెనక రాజకీయ ఎత్తుగడ గట్టిగానే ఉందన్న అంచనాలు పెరుగుతున్నాయి. వైఎస్ కుమార్తె షర్మిల తన సొంత పార్టీ వైఎస్సార్‌టీపీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ తరుణంలోనే రాహుల్ గాంధీ, ఖర్గే వైఎస్ సేవలను కొనియాడటం ప్రాధాన్యం సంతరించుకుంది. షర్మిల పార్టీ విలీనమా? లేక కలిసి పనిచేయడమా అన్న విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కొద్ది రోజులుగా ఆమె కాంగ్రెస్ విషయంలో సాఫ్ట్ కార్నర్‌తో ఉంటున్నట్టు చెబుతున్నాయి రాజకీయ వర్గాలు. కొన్ని అంశాల్లో కాంగ్రెస్ పెద్దలు, షర్మిల అభిప్రాయాలు కూడా ఒకే తీరుగా ఉన్నాయట. అటు తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఆమె సేవల్ని ఏపీ కాంగ్రెస్‌కి ఉపయోగించుకోవాలని సూచిస్తుంటే… షర్మిల మాత్రం తెలంగాణలోనే రాజకీయం చేయాలన్న ఆలోచనతో ఉన్నారట. మొత్తంగా ఏదో ఒక రూపంలో రెండు పార్టీలు దగ్గరవడం ఖాయమైన పరిస్థితుల్లో జాతీయ నేతల ట్వీట్స్‌కు ప్రాధాన్యం పెరిగింది.
Read Also: Kakani Govardhan Reddy: సూర్యుడు తూర్పున ఉదయించేది ఎంత నిజమో.. జగన్ మళ్లీ సీఎం అవ్వడం కూడా అంతే..
ఆ సంగతులు ఎలా ఉన్నా… గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సెటిలర్ల ఓటు బ్యాంక్ ఎక్కువ. అందుకే… వైఎస్ అభిమానులతోపాటు ఇక్కడున్న రాయలసీమ ప్రాంత ఓటర్లను ఆకట్టుకునే క్రమంలోనే మాజీ సీఎంని ఇప్పుడు కాంగ్రెసె్ పెద్దలు భుజానికెత్తుకున్నట్టు మరో ప్రచారం ఉంది. ఏదో ఒక రాజకీయ వ్యూహం లేకుండా… ఇన్నేళ్ళ తర్వాత కాంగ్రెస్ అధిష్టానం స్పందించదని, ఇది ఖచ్చితంగా ఎన్నికల ముంగిట్లో విసిరిన ఓట్ల వలే అన్నది పొటిలికల్ పండిట్స్ చెబుతున్న మాట.