Off The Record: మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలవడం రెండు రాష్ట్రాల్లో రాజకీయంగా కలకలం రేపుతోంది. ఇటీవలే అట్టహాసంగా కాంగ్రెస్‌లో చేరిన పొంగులేటి సడన్‌గా అమరావతిలో ప్రత్యక్షమవడంపై హాట్ హాట్ చర్చలు జరుగుతున్నాయి. ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయి. ఇటీవలే ఏపీ సీఎం కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కూడా కలిసి వచ్చారు. తర్వాత రోజుల వ్యవధిలోనే…పొంగులేటి అమరావతికి వెళ్లి జగన్‌తో సమావేశం కావడంతో రాజకీయ ప్రాధాన్యం పెరిగింది. దీనిపై ఇటు గాంధీభవన్‌లో కూడా గుసగుసలు మొదలయ్యాయి. జగన్, పొంగులేటి మధ్య సత్సంబంధాలున్నాయన్నది అందరికీ తెలిసిందే. కానీ….ఆయన కాంగ్రెస్‌లో చేరిన వెంటనే ఏపీ సీఎంని కలవడం వెనక వ్యూహం ఏంటన్నదే అసలు పాయింట్.
వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల తన పార్టీని తెలంగాణ కాంగ్రెస్‌లో విలీనం చేస్తారన్న చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. ఆమె చేరికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది సీనియర్స్‌తో పాటు స్వయంగా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి సైతం అభ్యంతరాలున్నట్టు ప్రచారం జరుగుతోంది. మధు యాష్కీ, ఉత్తం కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు మాత్రం షర్మిల చేరికను స్వాగతిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అమరావతికి వెళ్లిన పొంగులేటి, జగన్మోహన్ రెడ్డి మధ్య షర్మిల వ్యవహారంపై చర్చ జరిగి ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాను ముఖ్యమంత్రిని కలవలేదని, సీఎంవోలోని అధికారులను మాత్రమే కలిసి మాట్లాడి వచ్చానని పొంగులేటి చెబుతున్నా… పొలిటికల్ పరిశీలకులకు మాత్రం నమ్మకం కుదరడం లేదట. ఖచ్చితంగా రాజకీయ వ్యవహారాల చర్చే జరిగిఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇద్దరి మధ్య షర్మిల ప్రస్తావన వచ్చి ఉంటుందని అంటున్నారు.
పొంగులేటి శ్రీనివాసరెడ్డి గతంలో షర్మిలను ఆమె ఇంటికి వెళ్లి కలిశారు. ఎన్నికల్లో పోటీ చేసే అంశంపైనే ఇద్దరి మధ్య చర్చ జరిగిందని అప్పట్లో ప్రచారమైంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన ఏపీ ముఖ్యమంత్రిని కలవడం వెనక అసలు వ్యూహం ఏంటన్న టెన్షన్ గాంధీభవన్ వర్గాల్లో పెరిగిపోతోంది. పార్టీలో చేరిన కొద్ది రోజులకే జరిగిన ఈ పరిణామం ఎట్నుంచి ఎటు దారి తీస్తుందోనన్న ఆందోళన కూడా టి కాంగ్రెస్ నేతల్లో కనిపిస్తోందట.