Off The Record: ఏలూరు జిల్లాలో టిడిపి కంచుకోట పాలకొల్లును బద్దలు కొట్టడమే లక్ష్యంగా వైసిపి పెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ కంచుకోటగా పాలకొల్లు నియోజకవర్గం…పార్టీ ఆవిర్భావం తర్వాత తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే…1989, 2009లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. మరే పార్టీకి టిడిపిని ఓడించడం సాధ్యం కాలేదు. అందుకే వచ్చే ఎన్నికల్లో అయినా పాలకొల్లులో పాగా వేయాలనే టార్గెట్‌తో పని చేస్తోంది వైసీపీ. అలాంటి చోట వైసిపి గెలిస్తే…ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాపై పట్టు సాధించవచ్చని అంచనా వేస్తోంది.
వైసిపి పెట్టుకున్న టార్గెట్ అంత ఈజీగా లేదు. ఎందుకంటే పాలకొల్లు ఎమ్మెల్యేగా వరుసగా రెండోసారి నిమ్మల రామానాయుడు గెలుపొందారు. గత ఎన్నికల్లో వైసిపి హవాలోనూ గెలుపొందారు. నిత్యం ప్రజల్లో ఉండటమే కాదు.. అధికార పార్టీపై విమర్శలు చేయడంలోనూ ఆయన రూటే సపరేటు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడిని ఓడించేందుకు గతంలో వైసిపి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. కాపు సామాజికవర్గం డామినేషన్ ఎక్కువగా ఉండే పాలకొల్లులో…ఇపుడు వైసిపి ఇంఛార్జిగా బిసి సామాజిక వర్గానికి చెందిన కవరు శ్రీనివాస్ ఉన్నారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల కోటాలో ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశ కల్పించింది వైసీపీ. గతంలో డిసిసిబి ఛైర్మన్‌గాను పని చేసిన అనుభవం ఉంది. కవురు శ్రీనివాస్‌కు ఇన్ని అవకాశాలు కల్పించడానికి కారణం…పాలకొల్లులో వైసిపిని గెలిపించడానికేనని పార్టీ వర్గాల మాట. 2014 ఎన్నికల్లోనూ బిసి అభ్యర్ధి మేకా శేషుబాబుకు టిక్కెట్ కేటాయించినా…ఓటమి పాలయ్యాడు. 2019లో కాపు అభ్యర్ధి డాక్టర్ బాబ్జికి టిక్కెట్ ఇచ్చినా వైసీపీకి కలిసిరాలేదు. దీంతో మరోసారి బిసి వర్గానికి చెందిన కవురు శ్రీనివాస్‌కు టిక్కెట్ కేటాయించడం వల్ల ఫలితం ఎలా ఉంటుందనే చర్చ వైసీపీలో జరుగుతోంది. కవురు శ్రీనివాస్ భీమవరం నియోజకవర్గంలోని వీరవాసరం మండలానికి చెందిన వ్యక్తి కావడంతో… వైసిపి వేస్తున్న స్కెట్ వర్కవుటవుతుందా అన్నది అనుమానంగా మారింది.
ఇప్పటికే పాలకొల్లు ఇంఛార్జిగా కొనసాగుతున్న కవురు శ్రీనివాస్ …పార్టీని బలోపేతం చేయడంలో…పార్టీ నేతలను ఏకతాటిపైకి తీసుకొచ్చే విషయంలో కొంత వెనుకబడే ఉన్నారని పార్టీలో చర్చ జరుగుతోందట. కవురు శ్రీనివాస్‌ను పక్కనబెట్టి ఎన్నికల సమయానికి కొత్త అభ్యర్ధిని రంగంలోకి దించబోతున్నారనే టాక్ గట్టిగా నడుస్తోంది. ఆర్ధికంగా బలంగా ఉన్న మాజీ మంత్రి, ఆచంట ఎమ్మెల్యే రంగనాధరాజు, లేదా నర్సాపురం ఎమ్మెల్యే, చీఫ్ విప్ ప్రసాదరాజుల్లో ఎవరో ఒకరు పాలకొల్లు నుంచి పోటిలో దిగే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. బలమైన ఎమ్మెల్యే రామానాయుడిని ఎదుర్కొవాలంటే…ఆర్ధికంగా బలమైన నేతతో పాటు కాపు లేదా క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన లీడర్ అవసరమనే అభిప్రాయంలో ఉందట వైసీపీ అధిష్ఠానం. అదే జరిగితే పాలకొల్లు టిక్కెట్ ఆశిస్తున్న వైసిపి నేతలు, అసంతృప్తులు అంతా ఏకతాటిపైకొచ్చి… విజయం కోసం కృషి చేసే అవకాశముందట. లేదంటే ఖచ్చితంగా గెలవాలనుకుని టార్గెట్ పెట్టుకున్న పాలకొల్లులో మరోసారి భంగపాటు తప్పదనే అనుమానాలు వెంటాడుతున్నాయట.
పాలకొల్లు నుంచి పోటీ చేసేందుకు బిసి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్‌తో పాటు మాజీ ఎమ్మెల్సీ శేషుబాబు, కాపు సామాజిక వర్గానికి చెందిన డిసిఎంఎస్ మాజీ చైర్మెన్ యడ్ల తాతాజీ, గుణ్ణం నాగబాబులు రెడీగా ఉన్నారు. వీరిలో ఒకరికి అవకాశం ఇస్తే…మరొకరు సహకరించే పరిస్థితి కనిపించడం లేదట. దీంతో కొత్త వారిని తెరపైకి తీసుకువస్తారనే టాక్ ఎక్కువగా ఉంది. ఇప్పటి వరకు పార్టీ బలోపేతంపై దృష్టిపెట్టిన వైసిపి…బలంగా ఉన్న టిడిపి అభ్యర్ధిని ఓడించడానికి ఎవరిని బరిలో దించబోతుందనేది ఆసక్తికరంగా మారింది.