Off The Record: తెలంగాణ బీజేపీలో ఇప్పుడు కొత్త దృశ్యం కనిపిస్తోంది. ద్వితీయ శ్రేణిలో ఈ కల్లోలం స్పష్టంగా కనిపిస్తున్నట్టు చెబుతున్నాయి పార్టీ వర్గాలు. టీ బీజేపీ కొత్త అధ్యక్షుడే అందుకు కారణం అన్నది ఆ వర్గాల మాట. పార్టీ రాష్ట్ర కమిటీలో మార్పులు చేర్పులు ఉంటాయని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడే తన టీంలో కొంత మందిని మార్చి కొత్తవారికి అవకాశం ఇస్తారని ప్రచారం జరిగింది. రాష్ట్ర పదాధికారుల్లో కొంత మందికి ఉద్వాసన ఉంటుందని, జిల్లా అధ్యక్షులను సైతం తప్పిస్తారన్న చర్చ ఇప్పటికే జరుగుతోంది. మార్పులు ఉంటే తమకు ఛాన్స్ ఇవ్వాలని ఈపాటికే బండి దగ్గర లాబీయింగ్ కూడా చేసేశారట కొందరు నాయకులు. అయితే వివిధ కారణాలతో అలాంటి మార్పులు ఏమీ జరగలేదు. కానీ… తనను తప్పించడానికి కొద్ది రోజుల ముందే కొత్తగా దాదాపు100 మంది రాష్ట్ర కార్యవర్గ సభ్యుల్ని నియమించారు బండి సంజయ్.
Read Also: Off The Record: వైఎస్ జయంతికి ట్వీట్ చేసిన రాహుల్.. రాజకీయ వ్యూహం ఉందా?
అయితే… ఇప్పుడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మారారు. కిషన్ రెడ్డి పాత కమిటీలను ఉంచుతారా? లేక సొంత టీమ్‌ని ఏర్పాటు చేసుకుంటారా అన్న ఆందోళన కొందరు నేతల్లో స్పష్టంగా కనిపిస్తోందట. మార్పులు జరిగితే మా పదవులు ఉంటాయా? ఊడతాయా అని పార్టీ ముఖ్యులందరి దగ్గర ఆరాతీస్తున్నారట అలాంటి భయాలున్న నాయకులు. కొత్త అధ్యక్షుడు వచ్చినప్పుడు కమిటీల్లో మార్పులు జరగడం కామన్. ఎవరు పగ్గాలు చేపట్టినా… తన సొంత జట్టు కావాలని కోరుకోవడం సాధారణంగా జరిగేదే. కానీ…పదవులు చేపట్టి ఎక్కువ రోజులు కానివారు, ఎన్నికల టైంలో పార్టీలో క్రియాశీలకంగా ఉండాలనుకుంటున్న నాయకులే ఇప్పుడు ఎక్కువగా టెన్షన్ పడుతున్నట్టు తెలిసింది.
Read Also: Karnataka CM: ఇచ్చిన హామీలను అమలు చేస్తున్న కర్ణాటక సీఎం సిద్దరామయ్య
మరోవైపు అసెంబ్లీ ఎన్నికలకు పెద్దగా టైం లేనందున ఇప్పుడు కిషన్ కొత్త జట్టును ఏర్పాటు చేసుకుంటారా? లేక ఉన్నవాళ్ళతోనే లాగించేస్తారా అన్న చర్చ కూడా నేతల మధ్య జరుగుతున్నట్టు తెలిసింది. ఈ విషయంలో కిషన్‌రెడ్డి కూడా ఇప్పటిదాకా నోరు విప్పలేదు. మార్పులు ఉంటాయనిగాని, ఉండవని గాని చెప్పకపోవడంతో నేతల్లో టెన్షన్ ఇంకా పెరుగుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఏ నిర్ణయమైనా … సమష్టిగానే ఉంటుందన్న సంకేతాలు మాత్రం వస్తున్నాయట. పూర్తిగా కాకున్నా.. కొంతమేరకైనా…. మార్పులు ఉండవచ్చని, అదికూడా పార్టీ కేంద్ర నాయకత్వం సూచనల మేరకేనన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి… ఈ పరిణామాలతో ప్రస్తుత కమిటీలో ఉన్న కొందరిలో మాత్రం గుబులు మొదలైందట. పార్టీ పదవులు ఊడకుండా ఎవరి పరిధిలో వారు లాబీయింగ్ చేస్తున్నట్టు తెలిసింది.