Off The Record: పవన్ కళ్యాణ్ రాజమండ్రిలో చేసిన పొత్తు ప్రకటనతో కమ్యూనిస్టుల్లో ఆశలు చిగురిస్తున్నాయట. రాష్ట్రంలో జవసత్వాల కోసం పాకులాడుతున్న, ఒంటరితనమే శరణ్యం అనుకున్న ఆ రెండు పార్టీలకు ఇప్పుడు పవన్ ప్రకటన వీనుల విందుగా ఉందట. బీజేపీలేని కూటమిలో చేరాలన్నది లెఫ్ట్ పార్టీల సిద్ధాంతం. మరి బీజేపీతోనే ఉన్నామన్న జనసేన పొత్తు ప్రకటన చేస్తే వాళ్లకెందుకు ఆనందం అన్న డౌట్ రావడం సహజం. రాజమండ్రిలో డైరెక్ట్‌గా టీడీపీ-జనసేన పొత్తు గురించి ప్రకటించిన పవన్… బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని అనుకుంటున్నామని, కలిసి పనిచేయాలని కోరుకుంటున్నామని చెప్పారు. అంటే… ఆ పార్టీ విషయంలో ఇంకా ఏ క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కాషాయ పార్టీ టీడీపీ ఉన్న కూటమిలోకి రాకపోవచ్చన్నది ఎర్రన్నల అంచనా అట. అందుకే.. ఇదే ఛాన్స్ అన్నట్టు మన వంతు ప్రయత్నం మనం చేద్దాం.
టీడీపీ-జనసేన కూటమికి దగ్గరవుదామని అనుకుంటున్నట్టు తెలిసింది. ఈ దిశగా సీపీఐ ఇప్పటికే.. టీడీపీకి సంకేతాలు పంపినట్టు తెలిసింది. సీపీఎం కాస్త వేచిచూసే ధోరణిలో ఉందట. గతంలో కలిసి పనిచేసిన అనుభవం, భావసారూప్యత లాంటి అంశాలన్నీ ప్లస్ అవుతాయని లెక్కలు వేసుకుంటున్నారట లెఫ్ట్ నేతలు. అంతా కలిసి ఇప్పటి నుంచే.. గట్టిగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాలు చేస్తే… ఎన్నికల నాటికి తిరుగుండదన్నది కమ్యూనిస్ట్‌ల ఆలోచనగా చెబుతున్నారు. ఆలోచనలు, ఆశలు బాగానే ఉన్నా… ఇప్పుడు బంధమంతా బీజేపీ ఏం చేస్తుందన్న అంశం మీదే ఆధారపడి ఉంది. జరిగిందేదో జరిగిపోయింది. 2014లో లాగే ముగ్గురం కలిసి పనిచేద్దామని బీజేపీ నాయకత్వం ముందుకు వస్తే మాత్రం కమ్యూనిస్ట్ నేతల గొంతులో పచ్చి వెలక్కాయ పడుతుంది. అప్పుడిక ఒంటరి పోరాటం తప్ప మరో గత్యంతరం కనిపించదు. ఒకవేళ కాంగ్రెస్‌తో జట్టు కట్టినా… ఆంధ్రప్రదేశ్ వరకు రెండు పార్టీల పరిస్థితి జోగి జోగి రాసుకున్నట్టే ఉంటుంది. పవన్ ఇప్పటికే పొత్తు బాల్‌ని బీజేపీ కోర్ట్‌లోకి నెట్టేసి ఉన్నందున వాళ్ల రియాక్షన్ ఎలా ఉంటుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారట లెఫ్ట్ నేతలు. ఒకవేళ బీజేపీ గనుక నో చెబితే… వెంటనే తాము కూటమిలోకి జంప్ అయిపోవాలని పెట్టే బేడా సర్దుకుని రెడీగా ఉన్నారట లెఫ్ట్ నాయకులు. ముందు ముందు ఈ పరిణామాలు ఎలా మారతాయో చూడాలి.