Off The Record: పుత్రోత్సాహము తండ్రికి.. పుత్రుడు జన్మించినపుడె పుట్టదు, జనులా.. పుత్రుని గనుకొని పొగడగ.. పుత్రోత్సాహంబు నాడు పొందుర సుమతీ…! అన్నది పద్యం. అంటే… తండ్రికి కుమారుడు పుట్టగానే… సంతోషం కలగదు. అతను సంస్కారవంతుడుగా ఎదిగి పదిమందిచేత మంచివాడని అనిపించుకున్న రోజునే ఆ తండ్రికి నిజమైన సంతోషం కలుగుతుందన్నది సారాంశం. దీన్ని అందరికంటే ఎక్కువగా… ఇంకా చెప్పాలంటే నరనరానా జీర్ణించుకున్న నాయకుడు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. బిఆర్ఎస్ టిక్కెట్ల విషయంలో ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే మైనంపల్లి ఆ వ్యాఖ్యలను సమర్ధింకున్నారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న మైనంపల్లి హనుమంతరావు ఏకంగా పార్టీ ముఖ్యనేతను టార్గెట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. పార్టీ ఆయనకు మల్కాజ్‌గిరి టిక్కెట్ తిరిగి ఇచ్చినా… కొడుక్కి మెదక్ టిక్కెట్ ఆశించి భంగపడ్డారాయన. రోహిత్‌ను ఈసారి ఎలాగైనా బరిలో దింపాలన్న కృత నిశ్చయంతో ఉన్నారాయన. ఇందుకోసం ఎలాంటి త్యాగానికైనా సిద్దపడుతున్నారట తాను మల్కాజిగిరి నుంచి పార్టీ తరుపున పోటీ చేసినా తన కొడుకు రోహిత్ మెదక్ నుంచి స్వతంత్ర అభ్యర్ధిగా పోటీచేస్తానంటే కాదనబోనని అంటున్నారాయన.
మరి… బిఆర్‌ఎస్ నుంచి తండ్రి, ఇండిపెండెంట్‌గా కొడుకు పోటీచేయడం సాధ్యం అవుతుందా? కేసీఆర్ ఇందుకు అంగీకరిస్తారా? అంగీకరించకుంటే… మైనంపల్లి మరో ఆప్షన్ వైపు చూస్తారా అన్న చర్చ ఇప్పుడు బీఆర్‌ఎస్ వర్గాల మధ్య విస్తృతంగా జరుగుతోంది. మెదక్ టికెట్ తనకే వస్తుందన్న ధీమాతో.. ఆరు నెలల నుంచి నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు డాక్టర్ మైనంపల్లి రోహిత్. అయితే ఇటీవల సీఎం ప్రకటించిన జాబితాలో తన పేరు లేకపోవడంతో అయోమయంలో పడ్డారాయన. కాగా… ఇన్నాళ్లు తననే నమ్ముకుని వెంట వచ్చిన వారికి న్యాయం చేయాలంటే తన కొడుకును పోటీలో నిలిపి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటానని మైనంపల్లి హన్మంతరావు బహిరంగంగా మాట్లాడిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పార్టీ ఆయన్ని బుజ్జగించే వ్యవహారం కొలిక్కి వస్తే మల్కాజిగిరి బిఆర్‌ఎస్ అభ్యర్ధిగా రంగంలో ఉంటారా? లేదా పార్టీ సాగనంపితే కాంగ్రెస్‌లోకి వెళతారా..? అదీ ఇదీ కాకుండా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తారా ? అన్న ప్రశ్నలకు కూడా సమాధానాలు వెదికే పనిలో ఉన్నాయి బీఆర్‌ఎస్ వర్గాలు.
ఎమ్మెల్యే మాత్రం తాను ఎలా పోటీ చేసినా కొడుకు రోహిత్ మాత్రం మెదక్ బరిలో ఉండి తీరతాడని కరాఖండిగా చెబుతున్నారట. అయితే…ముఖ్య నేతపై ఆయన చేసిన విమర్శల కారణంగా బీఆర్‌ఎస్‌లో కొనసాగే అవకాశం లేదని, మల్కాజ్‌గిరి టిక్కెట్‌ను కూడా హన్మంతరావు తిరస్కరిస్తారని చెబుతున్నారు ఆయన వర్గీయులు. కాంగ్రెస్, బీజేపీల నుంచి ఇప్పటికే వీరికి ఆహ్వానం అందినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మంత్రి హరీష్‌రావును కలవడం మైనంపల్లికి ప్రతికూల సంకేతంగా భావిస్తున్నారు. మైనంపల్లి కాదంటే..మల్కాజిగిరి టికెట్ తనకు ఇవ్వాలని అడుగుతున్నారట శంభీపూర్ రాజు. మెడిసిన్ చదివిన రోహిత్… ప్రాక్టీస్ వైపు వెళ్లకుండా రాజకీయాల్లోకి రూటు మార్చారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ అర్గనైజేషన్ పేరిట స్వచ్ఛంద సంస్థను పెట్టి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నంలో ఉన్నారు. మరి ఇప్పుడు ఆ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయి? పార్టీ గుర్తు లేకుండా బరిలో దిగితే ప్రజలు ఎంతవరకు ఆదరిస్తారు? లేదా బీఆర్‌ఎస్ కాకుంటే మరో పార్టీ తరపున మెదక్ బరిలో దిగుతారా అన్న ప్రశ్నలకు సమాధానం రావాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.