Off The Record: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు, ఆయన వ్యవహార శైలి ఏకంగా సొంత హస్తం పార్టీ క్యాడర్‌నే కలవర పెడుతోందట. అంతా నా ఇష్టం.. నా మాటే శాసనం అన్నట్టుగా ఆయన పోకడ ఉందని అంటున్నారు. నేను చెప్పినట్టే అంతా నడవాలి.. నా మాటే వినాలి.. అన్నీ నేనే అన్ని సెట్ చేస్తానంటూ.. తానే సర్వాంశ సంభూతుడిని అన్నట్టు బిల్డప్‌లు ఇస్తున్నారన్నది కాంగ్రెస్ వర్గాల ఇన్నర్ టాక్. ఈ వైఖరే పార్టీ నేతలను కలవర పెడుతుండగా…. కొద్ది రోజులుగా నియోజకవర్గంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను ఉదహరిస్తూ క్యాడర్ కంగారు పడుతుండటం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే నిర్ణయాలు, సొంత పార్టీలోని నేతలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న తీరు… ఆందోళన కవలిగిస్తోందట పైగా… నియోజకవర్గంలో రాజకీయాలను ప్రభావితం చేసే బలమైన సామాజిక వర్గాల టార్గెట్‌గా బీఎల్‌ఆర్ రాజకీయం చేయడం అంత కరెక్ట్ కాదన్నవాదన బలపడుతోందట పార్టీలో. ఎమ్మెల్యే వ్యూహాలు, నిర్ణయాలు రివెంజ్ పాలిటిక్స్‌ని గుర్తుచేస్తున్నాయని చెప్పుకుంటున్నారు. సొంత పార్టీ నేతలకు వ్యతిరేకంగా వేస్తున్న ఎత్తులు రాబోయే రోజుల్లో ఏకంగా పార్టీకే ఇబ్బంది కలిగించవచ్చని అంటున్నారు. దీని ప్రభావం… రాబోయే స్థానిక సంస్ధల ఎన్నికల మీద ఉంటుందని కొందరు అంటుంటే… ప్రతిపక్ష పార్టీలకు ఎక్కడ అస్త్రంగా మారుతుందోనన్న కంగారు మరి కొందరిదట. ఇప్పటికే మిర్యాలగూడ పొలిటికల్ స్క్రీన్ పై కనిపిస్తున్న రివెంజ్ సీన్స్ రక్తి కట్టిస్తున్నాయి.
మున్సిపాలిటీలో ఈ వ్యవహారం ముదురు పాకాన పడటంతో.. అసంతృప్త నాయకుల్ని తమ పార్టీల్లోకి ఆహ్వానించేందుకు ప్రతిపక్షాలు గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. గ్రూపు పాలిటిక్స్ కారణంగా హస్తం నేతల మధ్య గ్యాప్ ఎక్కవైందట. దీంతో అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది క్యాడర్ పరిస్థితి. అంతేకాదు… అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా పదవులు లేక, సరైన ప్రాధాన్యత దక్కక.. ఇంకా ప్రతిపక్షం లోనే ఉన్నామా అన్నట్లు తయారైందట మిర్యాలగూడ కాంగ్రెస్ నాయకుల పరిస్థితి. ఎమ్మెల్యే తీరుతో నియోజకవర్గ కేంద్రం… మిర్యాలగూడ మున్సిపాలిటీలో నేతలు గ్రూపులుగా విడిపోయారని.. మండలాల్లో కూడా అధికార పార్టీలో గ్రూపుల గోల ఎక్కువైందని చెప్పుకుంటున్నారు. దామరచర్ల మండలంలో జరిగిన ఓ కార్యక్రమంలో నల్లగొండ ఎంపీ ఫ్లెక్సీని ఆయన అభిమానులు పెద్దగా పెట్టడంపై ఎమ్మెల్యే అభ్యంతరం వ్యక్తం చేశారట. ఇది కూడా ఇప్పుడు చర్చనీయాంశం అయింది. ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా… బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టుగా ఎమ్మెల్యే పాలిటిక్స్ నడుస్తుండటాన్ని సొంత పార్టీ నేతలే జీర్ణించుకోలేకపోతున్నారట.
దీంతో మిర్యాలగూడ రాజకీయం నివురుగప్పిన నిప్పులా ఉందంటున్నారు అధికార పార్టీ నేతలు.. రెండు దశాబ్దాల తరువాత ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్ధిని ఎమ్మెల్యేగా గెలిపిస్తే… ఏరు దాటాక తెప్ప తగలేసినట్లుగా అయన వ్యవహరిస్తున్నారని, గెలిచాక… కంచం, చెంబూ బయట పడేసి… రాయి, రప్ప లోపలేసుకున్నట్టుగా తమ పరిస్థితి తయారైందని ఆవేదనగా ఉన్నారట నాయకులు. ఆయనకు మీరన్నా చెప్పండని అంటూ సీనియర్స్ దగ్గర గోడు వెళ్ళబోసుకుంటున్నట్టు సమాచారం. ఇంత జరుగుతున్నా మిర్యాగూడ నియోజకవర్గంపై గట్టిపట్టున్న సీనియర్ నేతలు మౌనంగా చూస్తున్నారే తప్ప…. మాట్లాడ్డం లేదని, వాళ్ళ మౌనం నియోజకవర్గ పార్టీకి మంచిది కాదని అంటోంది కేడర్. ఇప్పటికన్నా పెద్దలు జోక్యం చేసుకుంటారా? లేక కాలమే సమాధానం చెబుతుందని కామ్‌గా చూస్తూ ఊరుకుంటారా అన్నది తేలాల్సి ఉంది.